నిర్మల్ పట్టణం లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని ప్రెస్ నోటొకటి జారీ అయింది.
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నిర్మల్ పట్టణంలో లాక్డౌన్, ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నిజానికి మంత్రి ఇలా రోడ్డెక్కి, పోలీసులందరిని తన చుట్టు పెట్టుకుని ఖాళీ గా ఉన్న బజార్లను పరిశీలించాల్సిన అవసరం ఉందా? ఆయన కోవిడ్ కేర్ సెంటర్లకు, ఆరోగ్య కేంద్రాలకు, ఆసుపత్రులకు వెళ్లి రోగులకు బెడ్లు, ఆక్సిజన్, రెమ్డిసివర్, టోసిలిజుమాబ్ వంటి మందులు అందుతున్నాయా లేదా అనేది చూస్తే ప్రజలు సంతోషిస్తారు. ఖాళీ రోడ్ల మీద ఏముంది? పోలీసులున్నారుగా చూసుకోవాడానికి. మాస్క్ ఉపన్యాసం చేయడానికి కనీసం ప్రజలు కూడా లేరు.
లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం, అమలుపర్చేది అధికారులు, పోలీసులు,లాక్ డౌన్ ను గౌరవించాల్సింది ప్రజలు. మధ్య లో ఈ హంగామా ఎందుకు?
ఇలా రూలింగ్ పార్టీకి చెందిన ప్రతి సర్పంచు, మునిసిపల్ చెయిర్మన్ త, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, ఎంపిలు లాక్ డౌన్ అమలు చేస్తున్న తీరును పరిశీలించడానికి రోడ్డెక్కితే ఏమవుతుంది?
కరోనా గురించి డాక్టర్లకు,శాస్త్రవేత్తలకే అంతుబట్టడం లేదు, మంత్రిగారి ఉపన్యాసం దేనికో అర్థం కాదు. మంత్రి లాక్ డౌన్ పరిశీలించడం చేయవచ్చా ఆలోచించాలి.
మంత్రిగారు ఏం చేశారంటే…
ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సిన వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, తమ కావలసిన వస్తువులు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని తెలుపుతూ, లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరారు.
అనంతరం నిర్మల్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పోలీస్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు. ఇదీ సంగతి…