ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆక్సిజన్ సేకరణకు భారీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం,తిరుపతిలో అక్సిజన్ ప్రమాదంలో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వ ఆక్సిజన్ వేట ప్రారంభించింది. ఏ ఇండస్ట్రీ దగ్గిర ఆక్సిజన్ ఉన్నా సేకరిస్తున్నారు.
అనేక పరిశ్రమల ఆక్సిజన్ యూనిట్లను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ పట్టణంలో ఆరబిందో ఫార్మ,మైలాన్, మెట్రోకెం, నాగార్జన అగ్రికెమ్ లనుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇలాగే తిరుపతి, శ్రీకాళహస్తిల దగ్గిర ఉన్న మరొక రెండు పరిశ్రమలను ఆక్సిజన్ కోసం అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాళహస్తి సమీపంలో ఒక ఆక్సిజన్ యూనిట్ ఉండటంతో అక్కడ మూడువేల పడకల కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడయినాసరే ఆక్సిజన్ బెడ్ కోసం వచ్చి రోగులెవరూ వెనుదిరిగిపోకుండా ఉండేలా ఏర్పాట్లు సాగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు ‘ ట్రెండింగ్ తెలుగున్యూస్’కు చెప్పారు.
పొరుగు రాష్ట్రాలనుంచి అందుబాటులో ఎంత ఆక్సిజన్ ఉంటే తెప్పించుకునే ప్రయత్నం మొదలయింది. ఆక్సిజన్ విషయంలో ఖర్చు కు వెనకాడవద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించారు. వాళ్లందరికి ఆక్సిజన్ సేకరించేందుకు సంపూర్ణాధికారాలు అప్పగించారు. కర్నాటక , తమిళనాడుల నుంచి సుమారు 100 మెట్రిక్ టన్నులు దాకా ఆక్సిజన్ రానుందని తెలిసింది.దీనిని సేకరించే బాధ్యతలను కరికాలవలవన్ (తమిళనాడు), అనంతరాములు(కర్నాటక)కు అప్పగించారు.
అయితే, రాష్ట్రానికిభారీగా ఆక్సిజన్ ఒదిషా నుంచి రావలసి ఉంది. ఒదిషా ఆక్సిజన్ నే ఇపుడు రాష్ట్రంలోకి కొరత తీర్చాలి. ఎందుకంటే, కనీసం మూడువందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సేకరించబోతున్నారు. ఈ ఆక్సిజన్ తీసుకువచ్చే బాధ్యతను రిటైర్డు ఐఎఎస్ అధికారి ఎకె పరీడాకుఅప్పగించారు. పరీడా 1980 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.జనవరిలో ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యనివారణ మండలి (Andhra Pradesh Pollution Control Board)చెయిర్మన్ గా నియమించారు. రూర్కేలా, కళింగనగర్, అంగుల్ లలోని పరిశ్రమల నుంచి ఆక్సిజన్ ను సేకరిస్తాను. ఇప్పటికే ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడారు. అక్కడి ప్రధాన కార్యదర్శితో కూడా మంతనాలయిపోయాయి. ఇపుడు ఈ ప్రణాళికను అమలుచేస ఆక్సిజన్ తీసుకువచ్చే బాధ్యత ఫరీడా మీద ఉంది.
ఒక టన్ను ఆక్సిజన్ తో 160 సిలిండర్లను నింపవచ్చు. ఒక్కొక్క సిలిండర్ లో 10 కేజీల ఆక్సిజన్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ కు రవాణా సమస్య
యుద్ధ ప్రాతిపదికను ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఆక్సిజన్ ను రవాణా చేయడం పెద్ద సమస్యగా ఉందని సీనియర్అధికారి ఒకరు వెళ్లడించారు. ట్యాంకర్ల రవాణా ఆలస్యం కాకుండా చూడాలి. ఆలస్యమయిన తిరుపతి వంటి దుర్ఘటనలు ఎదురవుతాయి. అందువల్ల మిలిటరీ విమానాల్లో, రైళ్లలో కూడాట్యాంకర్లనుతరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ట్యాంకర్ల డ్రైవర్లు చాలా మంది కోవిడ్ పాజిటివ్ కావడంతో ట్యాంకర్లు రోడ్డు మార్గాన తరలించడం సమస్య అవుతున్నదని ఆయన చెప్పారు. కొన్ని టాంకర్లను రోడ్డు మార్గాన తరలించవలసి వస్తే ఎలాంటి సమస్యఎదురుకాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దారి పోడుగునా పోలీసుల భద్రతకూడా కల్పిస్తున్నది.
ఈ ప్రయత్నాలన్నీ సజావుగా సాగితే, రేపు ఎల్లుండి నుంచి ఒదిషా తో పాటు తమిళనాడు, కర్నాటక ల నుంచి ఆక్సిజన్ రవాణా అయ్యే అవకాశం ఉంది. ఒదిషాతో అన్ని స్థాయిలలో సంప్రదింపులు పూర్తయ్యాయయని, ట్యాంకర్లసమస్య కూడా ఆధిగమిస్తామని చెబుతూ ఎంత తొందరగావీలయితే అంత తొందరగా ఆక్సిజన్ రవాణ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.