కరోనా విలయతాండవం చేస్తుంటే రాజకీయ కక్షసాధింపు చర్యలా?
(కిమిడి కళా వెంకట్రావు)
రాష్ట్రంలో ఒకవైపు కరోనా విలయ తాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యల్లో మునిగిపోయారు.
రాష్ట్రంలో N440k వైరస్ ఉందని ఈనెల 4వతేదీన హిందూ దినపత్రిక కథనం ఆధారంగా తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు ఆ వైరస్ ప్రభావ తీవ్రతను తెలియజేశారు.
దీనిని సాకుగా తీసుకొని చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదుచేయడం దుర్మార్గం. కరోనాకు సంబంధించి సాధారణ పౌరులైనా తమ గళాన్ని స్వేచ్చగా వినిపించవచ్చని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
చంద్రబాబుపై కేసు నమోదు చేయడమంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినట్లే. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం మాని ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సిగ్గుచేటు.
తమ పార్టీ నేతలు ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమలపై కూడా అక్రమ కేసులు బనాయించారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన వారందరిపై కేసులు పెడతారా? రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నది ముమ్మాటికీ వాస్తవం. ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు దొరక్క రోజూ అనధికారికంగా వందల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
కనీసం శవాలను దహనం చేసేందుకు శ్మశాన వాటికల వద్ద సైతం క్యూలు కటాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట కాదా? ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన వారిపై కక్ష సాధింపు చర్యలు మాని ఈ మహమ్మారి నుంచి ప్రజలను బయటపడేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడితే మంచిది.
(కిమిడి కళా వెంకట్రావు,తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు)