ప్రముఖ గాంధేయవాదిని కోవిడ్ కాటేసింది…

(వి.శంకరయ్య)
మరొక గాంధేయ వాదిని కోల్పోయాము. సామాజిక సేవ కోసం వివాహం కూడా త్యజించారు. రాయలసీమ సేవాసమితి సారధి అధ్యక్షులు గుత్తా ముని రత్నం నాయుడు (జననం 1936,జనవరి 6- మే 6, 2021))గారు .
అవిభక్త మద్రాసు రాష్ట్రంలో తిరుత్తణి (ప్రస్తుతం తమిళ నాడులో వుంది) ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే చిరంజీవులు నాయుడు సహకారంతో చిత్తూరు జిల్లా అంతటా బాల సంఘాలు నెల కొల్పారు.
తదుపరి చిత్తూరు గాంధి రాజగోపాల్ నాయుడు సహకారంతో గుర్తింపు తెచ్చుకున్నారు. సరిగ్గా గుర్తు లేదు.1953 లో అనుకుంటాను.
ముని రత్నం నాయుడు గారు తిరుత్తణిలో ఆయన మామ గారింట వుండేవారు.
ముని రత్నం నాయుడు చేపట్టిన బాల సంఘాల నిర్మాణం నన్ను ఆకర్షించింది. అందులో ఆయన వెంట పాల్గొనే సమయంలో బాల సంఘాలకు ఒక పత్రిక వుండాలని ముని రత్నం నాయుడు భావించి తిరుత్తణి నుండే బాల ప్రభ అనే మాస పత్రిక ప్రారంభించారు.
ఈ పత్రిక ఎడిటింగ్ బాధ్యత నాకు అప్పగించారు.
ముని రత్నం నాయుడు ఎడిటర్ నేను అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశాము. వాస్తవం చెప్పాలంటే జర్నలిజంలో నేను ముని రత్నం నాయుడు వద్దనే ఓనమాలు దిద్దు కొన్నారు.
తదుపరి కడప జిల్లా నుండి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గౌరవ సంపాదకులుగా వెలువడిన తెలుగు సంక్రాంతి పత్రిక కు ముని రత్నం నాయుడు అనుమతితో వెళ్లాను.
ముని రత్నం నాయుడు గారితో పనిచేసిన రోజులను ఇంకా మరచి పోలేకున్నారు. అప్పట్లోనే ఆయన రోజులో 18 గంటలు పని చేసేవారు.
1988 నుండి చిత్తూరు జిల్లాలో నేను పాత్రికేయజీవితం ప్రారంభించిన తదుపరి ఆయనను రాస్ అధినేతగా నేను పాత్రికేయుడుగా కలిసిన సందర్భాల్లో చూపిన అభిమానం ఎన్నటికీ మరువ లేను.
మా ఇద్దరికీ వయసు పైబడిన తర్వాత ఇటీవల కాలంలో కలువ లేదు. గాని 2020 జూన్ మాసంలో ఒక మారు ఫోన్ లో మాట్లాడాను.
ఆయన లేక పోవడం రాస్ ద్వారా లబ్ధి పొందుతున్న వేలాది మందికే కాకుండా రాస్ పని చేసే ఎపి ఒడిషా తదితర రాష్ట్రాలకు తీరని లోటు.
మా తరం వారు ఒక్కొక్కరే వెళ్లి పోతున్నారు. వారి జ్ఞాపకాలు మాత్రం మిగులు తున్నాయి
(VSankaraiah facebook wall నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *