ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
సహజంగానే పై ప్రశ్న ఎవరికైనా ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్పొరేట్ కుట్రలు తెలిసిన రాజకీయ వర్గాలకు ఇది ఆశ్చర్యం కలిగించదు.
పంటల సీజన్, ఎండల సీజన్, వానల సీజన్, జ్వరాల సీజన్ ల వలెనే కుట్రల సీజన్లు ఉంటాయి. కోళ్లకు గుడ్లు పొదిగే సీజన్ వలెనే కార్పోరేట్ వ్యవస్థకి కుట్రల్ని పొదిగే సీజన్లు ఉంటాయి. ఇప్పుడు అదో కుట్రను పొదుగుతుందా?
మోడీ ప్రభుత్వ ఏడేళ్ల పాలన స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు బహుళ లాభం చేకూర్చింది. వాషింగ్టన్, న్యూ యార్క్, లండన్, పారిస్ లలోని బలిసిన కార్పొరేట్ మీడియా సంస్థలన్నీ మోదీని పొగడటంలో పోటీ పడినవే! అవి ఎందుకు నేడు గొంతు మారుస్తున్నాయి? భారత్ ను ప్రగతిపథంలో నడిపించడంలో మోడీ విఫలమైనట్లు అవి నేడు కొత్తగా అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నాయి. హఠాత్తుగా వాటికి భారతదేశ ప్రజల పట్ల ప్రేమ పుట్టుకొచ్చిందా? వాటి వర్గస్వభావం మారిందా? లేదా మోడీ ప్రభుత్వ రాజకీయ విధానం కొత్తగా మారిందా?
మోడీ ప్రభుత్వ విధానాల్ని అమలు చేయడంలో దానికి సారథ్యం వహిస్తున్న ప్రధానిగా, మోడీ నిజానికి విఫలం కాలేదు. పైగా సఫలమయ్యాడు. ఏ బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అంకితమయ్యాడో, వాటికోసం మోడీ నిరంతరం శ్రమించాడు. వాటి మేలుకోసం తనను ఓట్లేసి గెలిపించిన దేశ ప్రజల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నిన్న తనను పొగిడిన దేశప్రజలే నేడు “చీ” కొట్టే స్థితి వస్తున్నా, మోడీ వెనక్కి తగ్గలేదు. చీము, నెత్తురు లేని తెంపరితనంతో నిస్సిగ్గుగా కార్పొరేట్ల సేవను సాగించాడు. కార్పొరేట్ వర్గాల కోసం అదో గొప్ప త్యాగం. వాటి తరపున గొప్ప త్యాగపురుషుడి గా చరిత్రలో మోడీ పేరొందాడు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల కోసం ఇంతటి త్యాగం చేసిన మోదీని అంతర్జాతీయ బడా కార్పొరేట్ మీడియా సంస్థలు నేడు తప్పు పడుతున్నాయి. అవి తిన్నింటి వాసాల్ని లెక్కిస్తున్నట్లు మోడీ పట్ల ఎందుకు విశ్వాసఘాతుక పాత్రను నేడు చేపడుతున్నవి? వాటిలో ఏదైనా జ్ఞానోదయం కలిగిందని సంతోషిద్దామా? లేదా తమ స్వానుభవంతో జ్ఞానోదయం కలుగుతోన్న దేశ ప్రజల రాజకీయ చైతన్యాన్ని దారి మళ్లించి దెబ్బతీసే కొత్త కుట్రలో భాగంగా చూద్దామా?
గత ఏడేళ్లుగా భారతదేశ ప్రజలకు ఎదురైన అదనపు కష్టాలు, కడగళ్లు, కన్నీళ్లకు ఏకైక కారకుడు మోడీ కాదు. కనీసం ప్రధాన కారకుడు కూడా కాడు. మోడీని సర్వఅనర్ధాలకు కారకుడిగా చేయడంలోనే ఒక వ్యూహం ఉంది. నిజానికి మోడీ కంటే ఆయన ప్రభుత్వం అనేక రేట్లు కారణం. మోడీ ప్రభుత్వం కంటే, దానికి గాడ్ ఫాదర్ వంటి ఆర్.ఎస్.ఎస్. సంస్థ వంద రెట్లు కారణం. దాని కంటే, దానిని తెర వెనుక ఉండి నడిపించే బడా కార్పొరేట్ వ్యవస్థ వెయ్యు రేట్లు కారణం. అది లేకుండా, మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు, విశాఖ ఉక్కుతో సహా సమస్త ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, నిర్బంధ చట్టాలు, NRC, CAA, NPR చట్టాలు, 370, 35A రద్దు వంటివి లేవు. ఈ అన్నింటి వల్ల పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ లాభపడింది. దానికి కొమ్ము కాసే మీడియా నేడు మోడీ పని తీరు విఫలమైనది ప్రచారం చేయడంలో కుట్ర లేదంటామా?
ఇదే కార్పొరేట్ వ్యవస్థ తన చెప్పుచేతుల్లోని మీడియాతో ఇప్పటివరకు దేశప్రజల్లో మోడీ ని హీరోని చేయజూసింది. వారు మోడీని అనుసరించే విధంగా సైకలాజికల్ ప్రచారం చేసింది. డెబ్బై రెండు అంగుళాల ఛాతీ తో మోడీఉద్వేగ ప్రసంగాల్ని ఘనంగా పబ్లిసిటీ చేసింది. మీడియా చేసే ఈ ధగాకోరు ప్రచారంతో పెరిగిన భ్రమల నుండి దేశప్రజలు (ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సైతం) ఇప్పుడిప్పుడే బయటపడే ప్రక్రియ ప్రారంభమైనది. ఈ క్రమంతో సంబంధం లేనిదిగా దీన్ని చూడరాదు.
రైతాంగ ప్రతిఘటన తర్వాత పరిస్థితిలో కొత్త మార్పు చోటు చేసుకుంటోంది. దేశ జనాభాలో అధిక సంఖ్యాకులైన రైతాంగం ఎదుట మోడీప్రభుత్వ ట్రిక్కులు విఫలమయ్యాయి. తాజాగా బెంగాల్ లో 20 భారీ ఎన్నికల సభలలో ఋషి పుంగవునిగా కొత్త వేషంతో చేసిన ప్రసంగాలు కూడా రక్తికట్టించలేదు. బెంగాల్ లో అధికారం పొందివుంటే, NRC, CAA, NPR ల అమలు పేరిట దేశవ్యాప్త మతోన్మాద మారణహోమం సృష్టించి, లబ్ది పొందే వీలుండేది. ఆ వ్యూహం బెడిసి కొట్టింది. వీటికి తోడు కరోనా మారణహోమంపై మోడీ ప్రభుత్వ వైఫల్యం అగ్నికి ఆజ్యంగా మారింది. మోడీకి పొలిటికల్ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. ఇక నుండి బడా కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే మోడీకృషిని దేశప్రజల చే ఒప్పించడం అసాధ్యమయ్యే కొత్తస్థితి ఏర్పడుతోంది. ఈ కొత్త పరిస్థితిలో రైతాంగ ఉద్యమ విస్తరణ జరిగి, అది మోడీ ప్రభుత్వ వ్యతిరేక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా, ప్రజాతంత్ర ఉద్యమంగా, ఇంకా ఫెడరల్ రాజకీయ స్ఫూర్తితో రాష్ట్రాల హక్కుల ఉద్యమంగా కూడా పరిణామం చెందే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో అట్టి రాజకీయ సువర్ణావకాశం దేశప్రజల చేతికి ఇవ్వకుండా బడా కార్పొరేట్ వ్యవస్థే ఒక పెనుకుట్రకు ఒడిగడుతుందా? లాటిన్ అమెరికా దేశాల గత అనుభవాల వెలుగులో ఈప్రశకి జవాబులు వెదుకుదాం.
మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల వ్యూహాత్మకంగానే నేడు అంతర్జాతీయ మీడియా తెరపై అసమ్మతి రాగం వినిపిస్తుందా? తద్వారా అది దేశప్రజల మెప్పు పొంది, ఆ తర్వాత, తెర వెనుక ఓ కొత్త డ్రామా ఆడుతుందా?
“నేనిప్పుడు మారిన కొత్త మనిషిని” అని మోడీతో దేశ ప్రజల ఎదుట బడా కార్పొరేట్ వ్యవస్థ బహిరంగ ఆత్మవిమర్శ చేయించి, దానికి తన మీడియా తో అధిక పబ్లిసిటీ చేయించి, దేశప్రజల మనస్సుల్లో తిరిగి మోడీని సుస్థిరపరిచే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ ఇలాంటి ఎత్తుగడ ఫలించదనుకుంటే, తమ మౌలిక విధానంలో ఎట్టి మార్పు చేయకుండా నినాదాల్లో మార్పు చేసుకొని, కొన్ని స్వల్ప ఉపశమన పాలనా చర్యలతో ప్రజల్ని మెప్పించి, ఒప్పించే ప్రక్రియను చేపడుతుందా? మోడీ ప్రభుత్వం మరమ్మతులకి గురైనట్లు దేశ ప్రజలలో భ్రమను కలిగించే పధకం పన్నుతుందా? లేదంటే రిపేరు వర్క్ వల్ల కూడా తమకు ఫలితం దక్కదనే తుది నిర్ధారణకు వచ్చి, ప్రధానిగా మోడీ స్థానంలో కొత్త సారధిని ఆర్.ఎస్.ఎస్. అంబులపొది నుండి కార్పొరేట్ వ్యవస్థ ఎంపిక చేయిస్తుందా? రేపటి కాలమే చెప్పాలి.
అదే రహదారి! అదే బుల్ డోజర్! అది తొక్కేది అదే 130 కోట్ల మంది దేశ ప్రజల్ని! దాన్ని రహదారిపై తప్పించకుండా, దాని మీద డ్రైవర్ ని తప్పించి, మరో కొత్త డ్రైవర్ ని ఎక్కించి, దేశ ప్రజల్ని సంతృప్తి పరిచి, తద్వారా వారిలో కలిగే కొత్త “మౌనం” ఆధారంగా తిరిగి వారిని తొక్కుకుంటూ సాగే బుల్ డోజర్ పాలనకి ఏదైనా కుట్రలు సాగుతున్నాయా? ఈ దిశలో కూడా ఆలోచిద్దాం.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)