ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వ్యాఖ్య
హైదరాబాద్ : సర్వసాదారణంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో ప్రధాని మోడి హోం మినిష్టర్ అమిత్ షా అనవసర ప్రతిష్టకుపోయి తమ ఉన్నత పదవులను మరుగుజ్జుగా మార్చుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ఫలితాల్లో ఆ కవలలు కీర్తి పటాపంచాలయిందని వ్యాఖ్యానించారు. అన్నిరకాలుగా ప్రజాస్వామ్య పద్దతిలో నడిపించే కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై , ముఖ్యంగా సీఎం పినరయ్ విజయన్ పై అనైతిక బాణాలొదిలి నవ్వులపాలయ్యారని చురకలు అంటించారు. కేరళలో బిజెపికి శృంగభంగం జరిగిందని స్పష్టం చేశారు. అటుకేంద్రంలోని అధికారం ఇటు ప్రభుత్వ వ్యతిరేకతను బూతద్దంలో పెట్టి తోలుబొమ్మలాటలాడారని దుయ్యబట్టారు. గెలవడానికి చేసిన అన్ని అనైతిక ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ కేరళప్రజలు LDF ను గెలిపించి బీజేపీ చెంప చెళ్ళుమనిపించారని వ్యాఖ్యానించారు
.
తమిళనాడులో నాటి సీఎం జయలలిత మరణం తర్వాత అక్కడి సంక్షోభాన్ని సృష్టించి AIDMK పార్టీని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల ఒప్పందం చేసుకున్న బీజేపీ AIDMK కొంపముంచిందని పేర్కొన్నారు. DMK నేత స్టాలిన్ ముందు చూపుతో విశాల వేదికను బలపరిచారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలు సహా, తాజా శాశనసభ ఎన్నికలలోను ఘనవిజయం సాధించి బీజేపీ ౼ఏఐడీఎంకె పార్టీల అవకాశవాద రాజకీయాలను తమిళ ప్రజలు చిత్తుచేశారని ఆయన పేర్కొన్నారు.
ఇక బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ముఖ్యంగా ప్రధాని మోడి, హోంమంత్రి అమిత్ షా కలసి కవల పిల్లల్లా రాజకీయ నైతిక సూత్రాలనాన్ని తుంగలో తొక్కి మమతబెనర్జిపై అధర్మయుద్దం చేశారని దుయ్యబట్టారు.
TMC౼ BJP లు రెండు బస్తీమేసవాల్ అన్నట్టు వీధిపోరాటం చేశాయని పేర్కొన్నారు.. చివరికి మమతకే మరోసారి అవకాశం వచ్చినా బీజేపీ కి కూడ ఓట్లు,సీట్లు పెరగడం ఆందోళకరమన్నారు. ఆ రెండు పార్టీల మధ్య సాగిన హొరాహోరీ పోరాటంలో “కాంగ్రెస్ వామపక్షాలు ” సమ్యుక్తంగా పోరాటం చెసినా నిరుపయోగం అయ్యిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టి అసమర్దత కారణంగానే పుదుచ్చేరి రి NDA కుటమికి కాస్త కలసి వచ్చిందని తెలిపారు. అస్సాంలో NDA నిలదొక్కుకుందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరి లోని యానాం నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పై సీపీఐ, కాంగ్రెస్ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ గెలుపు దిశగా సాగుతుండటం అభినందనీయమని చెప్పారు. అశోక్ తరపున తాను మూడు రోజుల పాటు ఆ నియోజక వర్గంలో ప్రచారం చేసానని ఆ తరుణంలోనే అశోక్ గెలుపు ఖాయం అని స్పష్టంచేసినట్టు గుర్తు చేశారు. ఏపీలోని తిరుపతి పార్లమెంట్, తెలంగాణాలో శాసనసభ ఉపఎన్నికలలో ప్రగల్బాలు పలికిన బీజేపీ కి చేదు ఫలితాలు మిగిలాయని అధికార పార్టీలైన వైసీపీ, టిఆర్ఎస్ లు విజయం సాధింఛాయని పేర్కొన్నారు.
ఈ ఫలితాల తర్వాతే బిజెపి అసలు స్వరూపాన్ని చూపబోతున్నదని, బుసలు కొడుతున్న ఆ పార్టీని వామపక్షాలు ప్రజాస్వామ్య లౌకికశక్తుల కలయికతో రాజకీయప్రతిఘటన చేయాల్సిన ఆవసరముందని హెచ్చరించారు.