ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణమీద ఉత్కంఠ తొలిగింది. కరోనా మధ్య పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం కష్టమంటున్న తల్లితండ్రుల వత్తిడి,కోవిడ్ మధ్య విధులు నిర్వర్తించడం కష్టమన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచన పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. ఈ విషయాన్నివిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
మంత్రి ఇచ్చిన వివరణ
కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ 10వ తరగతి, 11–12వ తరగతి(ఇంటర్) పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల… ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల… జాతీయ విధానం అంటూ లేకపోవటం వల్ల, కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు.
మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇంటర్ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి.
ఆ పిల్లల కెరీర్ అవకాశాల పరంగా చూసినా, వారి భవిష్యత్ ఉద్యోగాల కోసం కూడా… ఇలా ఇంటర్ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే వారి పైచదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టే… ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలోని మన విద్యార్థి వెనకబడకుండా చూడాల్సిన బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా మన మీద ఉంది కాబట్టే… వారి పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది. పూర్తిగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ… ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక, పిల్లల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది.
పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం, ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం. అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నాం.
ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నాం. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, ఈతరం విద్యార్థులు రాబోయే ప్రపంచంలో గొప్పగా నిలబడటం కోసం, ఇంటింటా చదువుల విప్లవం కోసం… మనందరి ప్రభుత్వం గత 23 నెలలుగా ఎంతగా తాపత్రయపడుతోందో ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికి, ప్రతి పిల్లవాడికీ తెలుసు.
జగనన్న అమ్మ ఒడి, నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వైయస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన… ఇలా అనేక పథకాలను తెచ్చి, ఈ కోవిడ్ సమయంలో కూడా వెనకంజ వేయకుండా అమలు చేస్తూ ఈ తరం పిల్లలు పోటీ ప్రపంచంలో తలెత్తుకుని నిలబడేందుకు, నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి ఇంటిలోనూ ఆయా కుటుంబాల స్థితిగతులు గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తున్న ప్రభుత్వం మనది.
కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎంతటి బాధ్యత, మమకారం ఉంటుందో, మొత్తంగా రాష్ట్రంలో పిల్లలపట్ల మనందరి ప్రభుత్వానికీ అంతే బాధ్యత, మమకారం ఉంది. వారి భవిష్యత్తును గొప్పగా నిర్మించేందుకు, కాపాడేందుకు ప్రతి ఆలోచనా ఇకమీదట కూడా చేస్తాం.