ఆరోపణలు వచ్చి 24 గంటలు కాలేదు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీద అపుడే ఫీల్డ్ స్థాయిలో విచారణ ప్రారంభమయింది. అధికారులు అపుడే మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చం పేట గ్రామంలో పొద్దునే దిగారు. మఫ్టీ పోలీసులు కూడా ఉన్నారని చెబుతున్నారు.
మెదక్ జిల్లా అచ్చంపేటలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
నిన్న మధ్యాహ్నం టిన్యూస్ లో బ్రేకింగ్… కనివిని ఎరుగుని కుంభకోణం, వందలకోట్ల కుంభకోణం, ఆరోగ్య శాఖమంత్రి భూకబ్జా రోగం అని వార్త వచ్చిందో లేదో ప్రభుత్వం స్పందించింది. సాయంకాలం అరున్నర కల్లా ముఖ్యమంత్రి కార్యాలయంనుంచి విచారణ కు ఆదేశాలు వెలువడ్దాయి. ఒకపక్క కలెక్టర్ విచారణ, మరొక వైపు విజిలెన్స్ డిపార్ట్ మెంటు విచారణ మొదలయింది.
అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్ సర్వే కొనసాగుతోంది.
దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తున్నారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ నేతృత్వంలో మంత్రి ఈటల ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇది ఇలా ఉంటే… శామీర్‌పేట్‌లోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
పత్రికల్లో కుంభకోణాల గురించి రాసినపుడు ప్రభుత్వాలు పట్టించుకోవు. పట్టించుకున్నా విచారణ ముందుకు సాగదు, నెలలు సంవత్సరాలు పడుతుంది. సిబిఐ విచారణలు, సిబిసిఐడి విచారణలు ఎలా సాగుతుంటాయోతెలుసుగా. విచారణ ముగిసేందుకు సంవత్సరాలు, చార్జ్ షీట్ వేసేందుకు సంవత్సరాలు, కోర్టుల విచారణ సంవత్సరాలు సాగుతుంటాయి. అలాంటి దేశంలో వార్త వెలవడిన రెండుగంటల్లో విచారణ కు ముఖ్యమంత్రి అదేశాలు, ఈ ఆదేశాలు వెలువడిన పదిగంటల్లో విచారణ మొదలు. ఈ వేగం చూస్తూంటే, విచారణ రిపోర్టు కూడు ముందే తయారయినట్లు అనిపిస్తుంది.
ఇది జరుగుతున్నది అవినీతిలో టాప్ అయిదు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో.
2018 లో మోస్ట్ కరప్ట్ రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని CMS-India Corruption Study తేల్చింది. తర్వాత India-Corruption Survey 2019 లో తెలంగాణ దేశంలో అయిదో కరప్ట్ స్టేట్ గా గుర్తింపు పొందింది.రాష్ట్రంలో లంచం ఇవ్వకపోతే పనులేవీ జరగవని 67 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో చెప్పారు. రాష్ట్రంలో అవినీతి ఎంతో, తాహశీల్దార్ల మీద జరుగుతున్న దాడులే సాక్ష్యం. దాడి చేసినవాళ్లంతా లంచం కోసం తాహశీల్దార్లు పెట్టే సతాయింపులు భరించలేకనే చెప్పారు. ఒక రైతు ఏకంగా ఒక అధికారిని సజీవదహనం చేశాడు. లంచం బెడద భరించలేక చాలా మందిరైతులు తాహశీల్దార్ల కార్యాలయాల్లో ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇది తెలంగాణలో అవినీతి సంగతి. ఇతమంది అవినీతి అధికారులు రాజకీయ నాయకుల అండ లేకుండా వర్ధిల్లగలరా?
అయితేనేం, ఇపుడు ఆరోగ్య మంత్రి అవినీతి మీద విచారణ జరుగుతూ ఉంది. ఆయన, అచ్చంపేటలో తన పౌల్ట్రీఫామ్ చుట్టూర ఉన్న అసైన్డ్ భూములను కభళించే ప్రయత్నం చేశారనేది ఆరోపణ. దీనికోసం రైతులను బెదిరించారని, ఈ భూములను రెగ్యులరైజ్ చేయించుకునేందుకు అధికారుల మీద వత్తిడి తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ.
ఒక మాజీ కలెక్టర్, మరొక మాజీ అడిషనల్ కలెక్టర్ల సాక్ష్యంతో జరిగిన ‘బ్రేకింగ్ న్యూస్’ కు రాత్రి పొద్దుపోయాక ఈటెల రాజేందర్ చేసిన ఖండన పేలవంగా ఉంది.
తాను 2004 నాటికే కోటీశ్వరుడనని, ఎకరానికి ఆరు లక్షల పెట్టి 40 ఎకరాలు కొన్న శక్తి తనదని, తాను కష్టపడి పైకొచ్చానని…. ఇలా చెప్పాడు తప్ప మాజీ కలెక్టకర మల్లారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేశ్ లు చెప్పిన వాటిని ఖండించలేదు. రైతులు టివి ముందుకు వచ్చి (రప్పించిఉండవచ్చు) చేస్తున్న విమర్శలకు జవాబులేదు. ఆ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవనేని చచ్చు జవాబు. ఇపుడు తెలంగాణలో అలాంటి భూముల్లేవు. జానెడు భూమి ఉన్నా బంగారే.
రాజకీయాలంటే అవినీతి. అవినీతికి పాల్పడకుండా ఉండటం రాజకీయాల్లో సాధ్యం కాదు. పదవి కోరుకునేది చట్టాలను తన చుట్టాలు చేసుకునేందుకే . పదవికి దగ్గిరగా ఉన్నపుడు, లేదా పదవిలో ఉన్నపుడు భూములు కబ్జా చేయవచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, పోలీసులతో పాటు రెవిన్యు, ఇతర అధికారులను తన సొంతానికి వాడుకోవచ్చు. సెటిల్ మెంట్లు చేయవచ్చు. దీనితో ఎంతయినా సంపాదించవచ్చు. ఈ అవకాశం ఉంది కాబట్టి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్లు ఎక్కువవుతున్నారు. వచ్చిన వాళ్లు మరొకరికి తావియ్యకుండా భార్యలను, ప్రియరాళ్లను, కొడుకులను,కోడళ్లను కూతర్లు,మేనల్లుళ్లను, బంధువులను రాజకీయాల్లోకి దించుతన్నారు.
కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఒక మునిసిపల్ కౌన్సిలర్ ఎంత అధికారం చలాయిస్తుంటారో, ఎన్ని సెటిల్ మెంట్స్ చేస్తుంటారో అందరికీ తెలుసు.
ఇలాంటి రాజకీయాల్లో ఉన్నపుడు అవినీతి అంటుకోకుండా ఎవరూ ఉండలేరు. ఈ విషయం ముఖ్యమంత్రులకు తెలుసు. లాయల్టీ ఉన్నంత వరకు ముఖ్యమంత్రులు సహిస్తారు, భుజం తట్టి ప్రోత్సహిస్తారు. లాయల్టీ పోగానే అవినీతి లో ఇరికిించేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇరుక్కుపోతారు.
1984 మార్చిలో ఏం జరిగిందో ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి. అపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు
తన క్యాబినెట్ లో కార్మిక, ఉపాధి శాఖల మంత్రి ఎం రామచంద్రరావుని బర్త్ రఫ్ చేశారు. ఈ రామచంద్రరావు హైదరాబాద్ వాడే. కూకట్ పల్లి సర్పంచ్. ఖైరతా బాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి పి.జనార్దన్ రెడ్డిని వోడించాడు. ఆయన పరిశ్రమల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చాయనిచెబుతారు. ఒక యజమాని నుంచి పదివేలు లంచం కోరారు. పిబ్రవరి 16న ఆయన బేగంపేటలోని మంత్రి ఇంటికి వచ్చాడు. ఏదో పారిశ్రామిక వివాదాని సంబంధించిన కేసు మాఫీ చేసేందుకు సాయంకోరాడు. దీనికి గాను పదివేల రుపాయలున్న కవర్ అందించాడు. ఆయన అలా వెళ్లిపోగానే వి అప్పారావు అనే పోలీసు అధికారి వచ్చి పట్టుకున్నాడు. అంతే, దీనితో ఆయన అవినీతి పరుడని ఎన్టీరామరావు ఆయన్ని క్యాబినెట్ నుంచి తప్పించారు. ఇది ట్రాప్ అని అందరికి తెలుసు.
ఇపుడు టీవిలు, సోషల్ మీడియా బలంగా ఉన్నాయి కాబట్టి పోలీసులను పంపి ట్రాప్ చేయించాల్సిన పనిలేదు. టీవికి లీక్ ఇస్తే చాలు, అది రోజంతా ఢంకా భజాయిస్తూ బ్రేకింగ్ చేస్తూ వుంటుంది. ఇదిట్రాప్ కంటే ప్రమాదరకమయింది. ఇపుడు ఈటల మీద ప్రయోగించిన అస్త్రం ఇదే. అవినీతి ఆరోపణ, టివిలో లీక్.
రాజకీయాల్లో ఏ నాయకుడి మీద నైనా అవినీతి ఆరోపణ చేయవచ్చు. ప్రభుత్వం అనుకుంటే దానిని నిరూపిస్తుంది. లేదంటే అది నిరాధార ఆరోపణ అని తేలుస్తుంది.
ఈటల మీద విచారణ రిపోర్టు ఏంచెబుతుందో ఎవరైనా వూహించవచ్చు.
కుటుంబ వ్యాపార సంస్థ వంటి ప్రాంతీయ పార్టీలో ఉంటూ నాయకుడితో పేచీ వచ్చినపుడు ఈటెల పార్టీ, పదవి పదిలేసి బయటకు వచ్చి ఉండాలి. అలా చేయలేదు. ఎందుకంటే పదవి వదులు కోవడం, రాజకీయనాయకు ప్రాణం వదులుకోవడంలాంటిది.
ముఖ్యమంత్రితో విబేధాలు వచ్చినపుడు ఆయన తన దారి తాను చూసుకోవాలి. బయటకు వచ్చి తాను ప్రజలకోసం ఉన్నానని నిరూపించుకోవాలి. ఈటల అలా చేయలేదు. చివరిదాకా, తెగేదాకా, అవమానాలు భరిస్తూ, పదవిని అంటిపెట్టుకున్నారు.
ఆయన లో ఆత్మగౌరవం ఉండి ఉంటే ఎపుడో బయటకు వచ్చి, కోదండ రామ్ లాగా ఒంటరిపోరు సలిపేవారు. అలా జరగలేదు. అడ్జస్టయిపోయేందుకు ప్రయత్నించారు. ఈటెలకు బిజినెస్ ఇంటరెస్ట్ డెవలప్ అయింది. అలాంటపుడు రాజకీయాల్లో కొనసాగితే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దొరికే ప్రమాదమూ ఉంటుంది.