కరోనాని వరంగా మార్చుకుంటున్నమెడికల్ మాఫియా

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)

తన దారిన వచ్చిన వైరస్ ని మన దారిన నియంత్రించడానికి బదులు, దోపిడీ పాలక వర్గాలు దానిని తమ రాజకీయ వరంగా భావించాయి. వాళ్ళ రాజ్యం కరోనా ఊతంతో దేశప్రజల్ని, మరీముఖ్యంగా శ్రామిక ప్రజల బ్రతుకుల్ని బుల్ డోజర్ వలె బుగ్గిపాల్జేయ పూనుకుంది.

శ్రామికవర్గం తమ తరతరాల రక్తతర్పణలు, ప్రాణార్పణలతో సాధించి, నేటికీ ఎంతో కొంతైనా అనుభవిస్తోన్న కార్మిక చట్టాలు, హక్కులన్నింటినీ మంటగలిపే పాడు కాలమిది.

ఇది తన ఇల్లు తగలబడి ఒకడేడుస్తుంటే, ఆ కాలే ఇంటి వాసాల్ని మరొకడు చంకన పెట్టినట్లు ఉంది. కరోనా కాలంలో ఒకవైపు 130కోట్ల మంది దేశప్రజలు తమ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, పైగా కరోనాకు భీతిల్లి ఇళ్లల్లో కన్నీటి బ్రతుకులు సాగిస్తుంటే, అదే అదునుగా భావించి, మరో వైపు కార్పోరేట్ సంస్థల లాభాల కోసం దోపిడీ పాలకులు చీకటి చట్టాలు తెచ్చాయి.

వాటిలో భాగమే నాలుగు లేబర్ కోడ్లు, మూడు వ్యవసాయ చట్టాలు! ” ఇంకా ఉపా ” నిర్బంధ చట్టం వంటివి ఎన్నో! ఈ పాడుకాలం లో 135వ మేడే వస్తోంది.

కోట్లాది వలస కార్మికుల్ని రోడ్డున పడేసినందున నాడు దేశ ప్రజలలో పొంగి పొరలిన పెనుదుఃఖం తిరిగి గుర్తుకి వచ్చి జాతి జనుల మనస్సులు మళ్లీ చలిస్తోన్న వేళ యిది.

నిర్ణీత పని గంటలు కూడా లేకుండా, గత అనాగరిక కాలాలలో వలె యంత్రాల్లా పని చేసే వలస శ్రామికవర్గం మళ్లీ భీతిల్లుతోన్న వేళ యిది. కరోనాని తమ బడా వాణిజ్య సామ్రాజ్యాల విస్తరణ కోసం ఒక రాజకీయ సాధనంగా కార్పోరేట్ సంస్థలు మార్చుకొని, తమదోపిడీ, పీడనల్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుంటున్న వేళ యిది. ఈ పాడుకాలంలోనే ఈరోజు 135వ మేడే వస్తోంది.

ఆదిమ కాలపు ప్రాణాంతక వ్యాధులు సృష్టించిన ఘోర మానవ మృత్యుకాండలు నేటి ఆధునిక యుగంలోనూ తిరిగి పునరావృతమయ్యే వేళ యిది. ఏరోజు తమఊరిలో తమకు తెలిసిన ఏ మనిషి నిండు ప్రాణాన్ని మాయదారి కరోనా బలి తీసుకుంటుందో తెలీదు.

తమ ఇరుగు పొరుగు ఇళ్లల్లో నిత్యం కలిసిమెలిసి బ్రతికే ఏ సన్నిహిత మనిషి ప్రాణాన్ని ఏ నిమిషంలో అది నిర్దాక్షిణ్యంగా ఎగరేసుకు పోతుందో తెలీదు. తమ స్వంత కుటుంబంలోనే కన్నతల్లినో, కన్నతండ్రినో, తోబుట్టువునో, కన్నబిడ్డనో, పసిగుడ్డునో ఏ క్షణంలో అది పొట్ట పెట్టుకుంటుందో తెలీదు.

మనిషికి మనిషి తోడు నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం చేయు కలిపి షేక్ హాండ్ ఇచ్చే స్థితి లేకుండా ఒకరికి దూరంగా మరొకరు జరుగుతూ గజగజ వణుకుతూ మనిషి బ్రతికే పాడుకాలంలో 135వ మేడే వస్తోంది.


నూటా ముప్పై ఐదేళ్ల క్రితం శ్రమజీవుల సమరాగ్ని సరస్సు లో వికసించిన వజ్రమే నేడు ప్రపంచావని నలుచేరుగులా ఎగురుతోన్న అరుణపతాకం. ఎత్తుపల్లాల నెత్తుటి రహదారి లో పడుతూ, తిరిగి లేస్తూ అది పురోగమిస్తోంది. దానికి నేటికి 135 ఏళ్లు! ఈ మేడే ఇచ్చే సమరసందేశం వినూత్నమే.


దోపిడీ రాజకీయ వేత్తల చేతుల్లోని దుష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలతో సహా ప్రధాన ఉత్పత్తి సాధనాలు అన్నింటినీ విప్లవం ద్వారా తమ స్వాధీనం చేసుకొని, వాటిని సమాజపరం చేయడంలో ముందుండాల్సిన శ్రామికవర్గం కారణాలు ఏమైనా వెనకబడింది.

ఒకకాలంలో తన చేజిక్కిన ఓ అవకాశాన్ని అది చేజార్చుకుంది. దాని ఫలితంగా భౌతిక పరిస్థితి మారిపోయింది. రక్తపిపాస కార్పొరేట్లకి ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పగించే కంటే, ఈ దోపిడీ ప్రభుత్వాల చేతుల్లో కొనసాగించడమే ” జరభద్రం అని భావించే కొత్త పాడుకాలం శ్రామిక వర్గం పై రుద్దబడింది.

ఆ గత పాడుకాలాన్ని కూడా నేడు మిగలకుండా, దాని స్థానంలో మరోకొత్త పరమ పాడుకాలాన్ని రుద్దుతోన్న వేళలో 135వ మేడే వస్తోంది.

దేశంలోని శ్రామికవర్గ విప్లవ సంస్థలు నిన్నమొన్నటి వరకూ 135వ మేడేకి ఇవ్వాలనుకున్న పోరాట పిలుపుల స్వరూపం వేరు! మేడే సమీపించేసరికి ఆ పాతపిలుపుల స్వరూపం సైతం మారిపోతోంది.

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దుకై, రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దుకై, ప్రయివేటీకరణ చర్యల రద్దుకై, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కై, కాంట్రాక్తీకరణ & అవుట్ సోర్సింగ్ సిస్టమ్స్ రద్దు కై, స్కీమ్ వర్కర్ల క్రమబద్దీకరణ కై, కనీస వేతనాలకై, సమాన పనికి సమాన వేతనాలకై, మహిళా కార్మికుల ప్రత్యేక హక్కుల కై, వలస కార్మికుల సంక్షేమం కై 135వ మేడే సందర్భంగా మార్చినెలలో ఆయా కార్మిక సంస్థలు తమ పిలుపులని రూపొందించాయి.

ఏప్రిల్ నెలాఖరుకు వచ్చేసరికి కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడింది. పాతపిలుపుల్ని కొనసాగిస్తూనే, వాటి వెలుగులో కొత్తపిలుపుల్ని జోడించుకొని మేడే సందర్భంగా శ్రామికవర్గంలో రాజకీయ కసిని రగిలించాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడింది.

ఔను, తన లేబర్ కోడ్లు, తన సోదర రైతాంగ వ్యవసాయ చట్టాల రద్దువంటి పైన పేర్కొన్న కర్తవ్యంతో పాటు ప్రతిరోజూ పనికి వెళ్లే దారిలో శ్రామికులు కంటితో చూసే “మనిషి” రోదన, వేదన,ఆక్రందన, హాహాకారాలు, కన్నీటి దృశ్యాలు, చితిలో దగ్ధం అయ్యే బీభత్స దృశ్యాలు నేడు అతలాకుతలం చేస్తున్నాయి. శ్రామికవర్గపు సామాజిక బాధ్యతను హెచ్చరించే కొత్త భౌతికస్థితి నేడు ముంచుకొని వచ్చింది. ఈ కర్తవ్యోపదేశాన్ని చేసి తీరాల్సిన వేళ 135వ మేడే నేడు తటష్టించింది.

తాను ప్రవచించే అన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలు, సూత్రాల అంతిమ ఆశయం పరిపూర్ణమైన మానవుడి ఆవిష్కరణయే అని కారల్ మార్క్స్ విశ్వసించాడు. అట్టి పరిపూర్ణమైన మానవ జాతితో కూడిన సమసమాజ స్థాపనకై జరిగే సామాజిక విప్లవానికి కార్మికవర్గం చోదక పాత్రను పోషిస్తుందని కూడా మార్క్స్ ప్రబోధించాడు.

వర్తమానదోపిడీ సామాజిక వ్యవస్థ కల్పించిన అమానుష పరిస్థితుల్లో బ్రతికే అసమగ్ర మనిషిని, అసంపూర్ణ మానవుణ్ణి బ్రతికించుకోకుండా, రేపటి పరిపూర్ణ మానవసమాజ స్థాపన సాధ్యం కాదు.

సంపూర్ణ మానవుడి కేంద్రంగా దోపిడీ, పీడన, కష్టాలు, కన్నీళ్లు లేని రేపటి నూతన సామాజిక వ్యవస్థ ఏర్పడాలంటే, నేటి అర్ధమనిషి కాపాడబడాలి. కరోనా పేర్చిన చితి మంటల్లో దగ్ధమవుతున్న నేటి మనిషిని చంపుకొనివ్వాల్సిందేనా అని ప్రశ్నించే స్ఫూర్తిని నేటి మేడే నుండి పొందాలి.

ఔను, ఆమె, అతడు, కాలి బూడిద కాకుండా కాపాడుకోవడం నేటి శ్రామికవర్గ సామాజిక రాజకీయ కర్తవ్యంగా మారింది. నేటి 135వ మేడే అందుకు ఓ ప్రేరేపక పోరాట పిలుపుగా మారాలి.

భారతదేశంలో కరోనాకు 15 నెలల చరిత్ర ఉంది. చాలా ఆలస్యంగా మేల్కొని లేడికి లేచిందే పరుగులా లాక్ డౌన్ విధించి 13 నెలలు దాటింది. తన ముప్పు నుండి మనిషిని కాపాడే అవకాశం ప్రభుత్వానికి కరోనా వైరస్ కల్పించింది.

అది ఆ బాధ్యతని చేపట్టలేదు. పైగా బడా కార్పోరేట్ సంస్థల సేవలో మునిగింది. ఒకవైపు కరోనా వైరస్ ని ఓ టెర్రరిస్టు భూతంగా సృష్టించింది.

జనంలో మానసిక భయభీతుల్ని సృష్టించింది. ఆ మానసిక భీతితో మనిషిని వ్యూహాత్మక దృష్టితోనే వైరస్ ఎదుట పిరికిపందగా మార్చి వేసింది. ఉపాధిని రద్దుచేసి, లాక్ డౌన్ పేరిట మనిషిని ఇళ్లకి పరిమితం చేసింది. తానేమో కార్పొరేట్ల సేవలో మునిగింది.

తాను 2019 చివరలో చేసిన NRC, CAA చట్టాల అమలుకై బెంగాల్ ని ఓ ప్రయోగశాలగా మార్చే ప్రక్రియపై దృష్టి పెట్టింది. బెంగాల్ లో 8విడతల ఎన్నికల్ పెట్టించి, ప్రధాని, షా సహా కేంద్ర కేబినెట్ బెంగాల్ కి తరలింది.

తమపార్టీ గెలిస్తే, శాసనసభ తొలి సమావేశంలో NRC, CAA అమలుపై తీర్మానం చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ మకాం ని ఆరునెలల ముందే ఏకంగా కలకత్తాకి మార్చేసింది.

వ్యూహాత్మక లక్ష్యంతో తాము సృష్టించిన కరోనా టెర్రరిస్టు రాజకీయ దాహానికి మనిషిని బలిపశువుగా మార్చివేసింది. ఫలితమే నేడు మనిషి చితి మంటల్లో దగ్ధమవుతున్నాడు.

రేపు మే 2వ తేదీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఏం జరుగుతోందో తెలియదు. ఆ రోజు, లేదా ఆ వెంటనే పాక్షిక లాక్ డౌన్ వార్తల్లోనూ ఏ చీకటి రాజకీయ కుట్రలున్నాయో తెలియదు. అస్సాం, బెంగాల్ లలో NRC, CAA అమలు పేరిట మతం చిచ్చు రగిల్చి దేశవిభజన కాలం నాటి రక్తసిక్త ఘోరకలిని పునరావృతం చేసే కుట్రలు ఉన్నాయేమో కూడా తెలియదు.

మరోవైపు కరోనా బూచితో ఢిల్లీ రైతాంగ పోరాటం పట్ల ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు. రేపు బెంగాల్ లో గెలిస్తే, ఏ కౌటిల్యపు రాజకీయ ఘోర మరణకాండని కొత్తగా సృష్టిస్తుందో ఊహించలేము. అదెలా రేపు మనిషిని బలి తీసుకుంటుందో మరొమాట! నేడు పాలకులు పోషించిన మాయదారి కరోనా మనిషిని పొట్టనపెట్టుకోవడం నేటినిజం.

పాలకులు వ్యూహాత్మకంగానే పెంచి పోషిస్తోన్న నేటి కరోనా టెర్రరిస్టు భూతానికి మనిషి బలవుతున్నాడు. ఆ మనిషిని ముందుగా బ్రతికించు కోవడం కార్మికవర్గ సామాజిక బాధ్యత! అందుకై నేటి 135వ మేడే సందర్భంగా దీక్ష వహిద్దాం.

పాలకుల వ్యూహాత్మక రాజకీయ కుట్రలు తెలిసిన చైతన్యవంతులైన కొద్దిశాతం మంది తప్ప, నేడు దేశ ప్రజల్లో స్థూలంగా రెండే రెండు రకాల మునుషులు వున్నారు. ఒకటి, భయంతో బ్రతికేవాళ్ళు. రెండు భయంతో మరణించే వాళ్ళు. మొదటి కోవలోని మనుషులు బ్రతికివున్నా, చస్తామేమో అనే నిత్య భయంతో జీవిస్తున్నారు.

రెండో కోవలోని మనుషులు తాము భౌతికంగా మరణించి, మిగిలిన మనుషులకి మరింత భయాన్ని బదిలీ చేస్తున్నారు. స్ ఈ రెండురకాల మనుషులతో పాపిష్టి పాలకులు నింపారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన 135వ మేడే సందర్భంగా మనిషిని మనిషిగా బ్రతికించే లక్ష్యం కోసం దీక్ష వహిద్దాం.

తమ తల్లులు, తండ్రుల కోసం కన్న కొడుకులు కావచ్చు. కన్న బిడ్డలకోసం తల్లితండ్రులు కావచ్చు. ఆసుపత్రుల్లో చేరినతమ వాళ్ళకోసం ఎదురు చూపులతో వారి కుటుంబాలూ, ఇళ్లూ, ఊళ్ళూ, పేటలూ నేడు బావురుమంటున్నాయి. ఏ పాడు ఘడియల్లో ఏ కీడు వార్తలు వస్తాయో తెలియక మానవ సమూహాలు వణుకు తో బ్రతుకుతున్నాయి. ఒకవేళ తమ ఆప్తులు, ఆత్మీయులని కొల్పితే కనీసం కడచూపుకు సైతం నోచుకోలేని దౌర్భాగ్యం నెలకొన్నది. ఆసుపత్రులలో మృతులను అంత్యక్రియల కై ఇవ్వకపోతే అనాధలుగా వదిలివేసే దిక్కుమాలిన దీన స్థితి తలుచుకొని మనిషి నేడు దుఃఖంతో కుమిలికుమిలి ఏడుస్తున్నాడు.

ఆసుపత్రుల్లో పడకలు (బెడ్స్) లేక పడిగాపులు! అవి ఎట్టకేలకు దొరికితే, మందుల కొరత! ముఖ్యంగా ఆక్సిజన్ (ప్రాణవాయువు) లేక ప్రాణాలు కోల్పోయే దుస్థితి! ఏడేళ్లలో బడా కార్పొరేట్లకు (ముఖ్యంగా గుజరాత్ కార్పొరేట్లకు) పది లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాల్ని ఎగనాం పెట్టించి లబ్ది చేకూర్చింది. అది ప్రజాధనమే. స్విస్ ధనం హామీని వదిలేసి, పెట్రో లూటీ, ఇతర అదనపు పన్నుల లూటీ సొమ్ముని కూడా మినహాయించి చూసినా కేవలం బ్యాంకుల్లో మనప్రజల పొదుపు సొమ్మును మన దేశప్రజలకి పంచితే తలకు ఇంచుమించు లక్ష అవుతోంది. ఈ బందిపోటు పాలక వ్యవస్థ నేడు వాక్సిన్ ని సైతం బీదాబిక్కీ స్వంతంగా కొనుక్కొని తమ ప్రాణాల్ని నిలబెట్టుకొండని ప్రజలకి కర్తవ్య బోధ చేస్తోంది. తనకు బాధ్యత లేదని చేతులు ఎత్తేసిన ఈ దుష్ట రాజకీయ వ్యవస్థ మీద ధర్మ యుద్ధ సందేశం ఈ మేడే నుండి పొందాలి.

ప్రైవేటు హాస్పిటళ్లకు లక్షల సొమ్ము తగలబెట్టి రుణగ్రస్తులు గా మరే దుస్థితిని రాజకీయ వ్యవస్థ ప్రజలకు కల్పించింది. ఈ పాడుకాలంలో వచ్చిన మేడే సందర్భంగా తమ సౌకర్యాలు, సదుపాయాలు, హక్కులు, చట్టాలు, సంక్షేమాల కంటే కూడా నేడు మనిషిని మనిషిగా బ్రతికించుకోవడం శ్రామికవర్గం యొక్క ప్రధమ తక్షణ కర్తవ్యం. మనుగడకై సాటి మనుషుల ఆరాటాన్ని పెను పోరాటంగా మలుచుకోవడం కార్మికవర్గ రాజకీయ కర్తవ్యంగా మారింది. తమరేపటి కోర్కెలతో పాటు మనిషి జీవించడానికి అవసరం అయ్యే వైద్య, ఆరోగ్య హక్కుల కోసం, ఉచిత చికిత్స కోసం, మందుల కోసం, పడకల కోసం, ఆక్సిజన్ కోసం కూడా ఈ మేడే సందర్భంగా కార్మికవర్గం ప్రతిన పూనుతుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *