విద్యార్థులు , తల్లిదండ్రులు పరీక్షలు రద్దు కాదు వాయిదానే కోరుకుంటున్నారు.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
పరీక్షలు రద్దు , వాయిదా ఒకటి కాదు అనే రెండు భిన్నమైన అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ గురించి వినబడుతున్నాయి. వాయిదా కోరుతున్న విద్యార్థులు , తల్లిదండ్రులు పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు.
ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పరీక్షలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ పరీక్ష ” నీట్ ” తో ముడిపడి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలను రద్దు చేయకుండా ఆగస్టుకు వాయిదా వేసింది. కాబట్టి ఇంటర్ పరీక్షలను రద్దు కాకుండా వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నారు. దాదాపు 10 వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇంకా 35 రోజుల సమయం ఉన్నది కనుక అప్పుడే నిర్ణయం అవసరం లేదు.
ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నా కరోనా విషయంలో అంతకు మించి భయంతో ఉన్నారు అన్నది నిరాకరించలేని సత్యం. కరోనా సమీక్షలో ముఖ్యమంత్రి అభిప్రాయ పడినట్లు కరోనా సమస్య పరిష్కారానికి మరో ఏడాది కాలం పట్టవచ్చు కనుక అప్పటి వరకు ఏ పరీక్షలు నిర్వహించకుండా ఉండగలమా ? అన్న అభిప్రాయం కూడా ఉండవచ్చు. భయము , మనోభావాలు అత్యంత ముఖ్యమైన విషయాలు. ప్రస్తుతానికి ప్రజలు మే నెలలో పరీక్షలు వద్దు అన్న భయంతో కూడిన అభిప్రాయంతో ఉన్నారు. మే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవడం మినహా మరో పరిస్కారం లేదు అని చెప్పక తప్పదు.
అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మే 5 న జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి. అదే సమయంలో 35 రోజుల సమయం ఉన్నందున 10వ తరగతి పరీక్షల విషయంలో ఇప్పుడే నిర్ణయం అవసరం లేదు. పరీక్షలు ఉంటాయి అని చదవండి – నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పరీక్షలు నిర్వహించడాని అనువైన వాతావరణం ఉంటే నిర్వహిస్తాము. ఆందోళన వద్దు అన్న భరోసా విద్యార్థులకు , తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయం కోసం లక్షల మంది విద్యార్థులు , వారిని తమ ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.