సుమారు ఒక సంవత్సరం పైగా క్యాన్సర్ వ్యాధితో కింద మీదలవుతున్న కలం యోధుడు సిహెచ్ మధు, 24 ఏప్రిల్ 2021 శనివారం శాశ్వతంగా మనల్ని వీడి వెళ్లిపోయారు.
రచన ఆయనకు ఆరో ప్రాణం. ధిక్కారo ఆయన అలుపెరగకుండా ఎత్తిపట్టిన జెండా. ప్రజాస్వామిక సమాజం నిర్మాణమే ఆయన నమ్ముకున్న ఎజెండా. తన 76 ఏళ్ల జీవితంలో 55 ఏళ్లుగా రచనలు సాగిస్తూనే ఉన్నారు. నమ్మిన ఆశయ సాధన కోసం 50 ఏళ్లకు పైగా ప్రత్యక్షంగా అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొని , ఉద్యమ సంస్థలతో కలిసి పని చేస్తూ వచ్చారు. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రజాసాహితి పత్రికతో జనసాహితి సంస్థతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.
ప్రజాసాహితి మొట్టమొదటి సంచిక (1977 ఆగస్టు) లోనే ఆయన కథ వెలువడటమేకాక దానిపై అందులో చర్చ కూడా నడిచింది.
1978 మే నెలలో మంగళగిరి చార్వాక ఆశ్రమంలో జరిగిన జనసాహితి తొలి మహాసభ నిర్వహణకై జరిగిన రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశానికి నిజామాబాద్ నుండి సిహెచ్ మధు కూడా హాజరయ్యారు. తన కొన ఊపిరిదాకా ప్రజాసాహితి పత్రికతో జనసాహితి సంస్థతో సజీవ సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు.
రైతు కూలీ ఉద్యమాలతో, కార్మిక పోరాటాలతో, పౌర హక్కుల ఉద్యమంతో, విప్లవ రచయితల సంఘంతో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ బాధ్యతలు నెరవేరుస్తూ
తన వ్యక్తిగత జీవితం ఎన్ని కష్టనష్టాలతో తలమునకలైనా, నమ్మిన ఆశయాన్ని, ఎత్తిపట్టిన కలాన్ని, తలవంచని ధిక్కార స్వరాన్ని
విడిచిపెట్టకుండా నిరంతరాయంగా రాస్తూ వినిపిస్తూ తన ఆశయ బలాన్ని చాటుకుంటూ వచ్చారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో పుట్టి పెరిగిన చందుపట్ల విఠల్
బతుకు తెరువుకై నిజామాబాద్ వచ్చి బట్టల షాపులో గుమస్తాగా, ఊర్లవెంట తిరిగి బట్టలు అమ్మకాలుచేసే చిరు వ్యాపారస్తునిగా, చాలా కొద్ది కాలం చిన్న ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకునిగా పని చేశారు.
Ch. మధు పేరుతో కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర ప్రక్రియలలో అనేక పత్రికలలో విస్తృతంగా రచనలు చేశారు.
శ్రమ జీవులపట్ల, పీడిత ప్రజలపట్ల తనకు గల అచంచల పక్షపాతాన్ని, దోపిడీవర్గాల పట్ల, వారికి కావలి కాస్తున్న నిరంకుశ పాలక ప్రభువుల పట్ల తనకున్న ఆగ్రహాన్ని ఏనాడు ఆయన దాచుకోలేదు . ఆయనను సజీవంగా నిలబెట్టిన శక్తివంతమైన తాత్విక భావనా శక్తి అదే.
పుస్తక రూపాన్ని పొందని వందలాది రచనలు చేసిన సాహిత్యకారుడు ఆయన!
అసమానతలతో కూడిన భారత సామాజిక వ్యవస్థలో మౌలిక మార్పులు రావాలనే ప్రగాఢ ఆకాంక్షతో ఆయన సాహిత్య సామాజిక కార్య క్రమాలు సాగాయి.
కామ్రేడ్ మధుది పీడిత ప్రజల ధిక్కార స్వరం. పాలకుల మెర మెచ్చులకు, లాలింపులకూ లొంగని కలం! ప్రజా ఉద్యమాలనే నమ్ముకున్న నిబద్ధజీవనం!
ఆయన మరణం తెలుగు సాహిత్యానికి, ప్రగతిశీల ఉద్యమాలకు, సామాజిక మార్పును ఆశించే సమస్త విప్లవ శక్తులకు తీరని లోటు.
ప్రజాసాహితి పత్రికకు, జనసాహితి సంస్థకు ఆయనతోగల సుదీర్ఘ అనుబంధం వల్ల గొప్ప ఉద్యమ మిత్రుని కోల్పోయిన ఆవేదన!
బహుముఖ సాహితీ ప్రక్రియలతో వందలాది రచనలు చేసిన, ధిక్కారమే ఊపిరిగా జీవించిన సిహెచ్ మధు మరణం పట్ల జనసాహితి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ నివాళులర్పిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ వారితో తన బాధను పంచుకుంటోంది .
(జనసాహితి,24-4-2021)