మంగళవారం తీర్థ ఉత్సవం – కరోనా వల్ల అనుమతి లేదు.
(రాఘవ శర్మ)
ఒక లోతైన నీటి గుండంలోకి జాలువారుతున్న జలపాతం. కొండ గుప్పెట్లో బందీ అయినట్టు, జలపాతం చుట్టూ కమ్ముకున్న కొండ అంచులు. నీటి గుండంలోకి ప్రవేశించడానికి సహజ సిద్ధమైన రాతి ద్వారం.కొండకు నడినెత్తిన చిన్న చీలిక. ఆ చీలిక నుంచి జాలువారుతున్న జలధార.
ఆది శేషుని పడగ లా ఉన్న నీటి గుండమే తిరుమల కొండల్లో కనువిందు చేస్తున్న శేషతీర్థం.
తిరుమల కొండల్లో అతి కష్టమైనది ఈ శేష తీర్థం.ఈ తీర్థ మహోత్సవం ఏడాదికొకసారి చైత్ర పౌర్ణమినాడు వస్తుంది.
ఈ నెల 27వ తేదీ మంగళవారం శేషతీర్థ మహోత్సవం.ఈ ఉత్సవాన్ని కూడా కరోనా కాటు వేసింది. తీర్థ సందర్శనకు టీటీడీ అనుమతించడం లేదు.
గత పాతికేళ్ళుగా ఈ సుందర తీర్థాన్ని సందర్శిస్తూనే ఉన్నాం. తిరుమలలోని పాపనాశనం వెళ్ళే దారిలో పార్వేట మండపం వస్తుంది. ఆ మండపానికి ఈవలే ఉన్న గోగర్భం డ్యాం దాటాక, కుడివైపున ఉన్న రోడ్డు మార్గాన వెళ్ళాలి.
ఆ దారిలో ఉత్తరాన కొంత దూరమే వాహనాలు వెళ్ళగలుగుతాయి. అక్కడి నుంచి కుడి దిక్కుగా అడవిలో నడవాలి.
టీటీడీ అటవీ శాఖ నాటిన సరివిచెట్ల మధ్య నుంచి నడక సాగుతుంది. సహజంగా సరివి తోటలు తీర ప్రాంతంలో నాటుతారు. సరివి ఆకులు నేలపైన రాలి పరుచుకోవడం వల్ల వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకవు. అందుచేత కొండపైన సరివి నాటడాన్ని పర్యావరణ వేత్తలు తప్పుపడుతున్నారు.
అటొక కొండల వరుస, ఇటొక కొండల వరుస. నడుమ మరొక కొండల వరుస. తూర్పువైపుగా ఉన్న మధ్య నున్న కొండ వరుస నడినెత్తిన నడుస్తూ సాగిపోవాలి.
ఆ కొండ వరుసకు ఇరువైపులా లోతైన లోయలు. రకరకాల చెట్లతో చుట్టూ దట్టమైన అడవి. ఎక్కువగా ఈత చెట్లు. ఏప్రిల్, మే మాసాల్లో వచ్చే ఈ తీర్థ సమయంలో ఈత పండ్లు విరివిగా కాస్తాయి. దూరంగా ఒక చెట్టు కాండానికి ఒక పెద్ద మానవ కంకాళం అతికించినట్టుంది.
దగ్గరకెళ్ళి చూస్తే, చెట్టుకు మొలిచిన పెద్ద బుడిపె అది. ఇక్కడ గడ్డి ఏపుగా పెరిగి, గాలికి తలలూప డం ఎంత ఆహ్లాదం గా ఉంటుందో! ఈ ప్రాంతంలో దుప్పులు, జింకలు, కుందేళ్ళు,అడవి గొర్రెలు, ఎలుగు బంట్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
ఈత పండ్లంటే ఎలుగు బంట్లకు ఎంత ఇష్టమో! కొంత దూరం వెళ్ళాక సానరళ్ళ మిట్ట వస్తుంది. ఇక్కడ దొరికే బండలను కొట్టి, సాన రాళ్ళను చేసి అమ్ముకునే వారు. చందనం నూరడానికి ఈ సానరాళ్ళు ఉపయోగిస్తున్నారు .
ఈ మిట్ట దాటాక కొండ అంచుల నుంచి లోతైన లోయలోకి దిగాలి. లోయంతా దట్టంగా పెరిగిన చెట్లు. అ చెట్ల కొమ్మలను పట్టుకుని ఏటవాలుగా ఉన్న లోయలోకి నిదానంగా దిగాలి.ఏ మాత్రం పట్టు తప్పినా దొర్లుకుంటూ పడిపోతాం.మెలికలు మెలికలుగా ఉన్న ఆ ఏటవాలు దారి నుంచి కొండ దిగడం అంత తేలిక కాదు.
కొంత దూరం వెళ్ళాక దారి అంతా వర్షానికి దొర్లుకుంటూ వచ్చిపడిన పెద్ద పెద్ద బండరాళ్ళ గుట్టలు. ఒక రాయిపైనుంచి మరొక రాయిపైకి జాగ్రత్తగా అడుగేయాలి.
పట్టుకోడానికి పక్కన చెట్లకొమ్మలు కూడా ఉండవు. చిన్న పిల్లలు మెట్లు వెనక్కి వెనక్కి దిగినట్టు, మనం కూడా అలా వెనక్కి వెనక్కి దిగాలి. లోయలోకి దిగడానికే గంటసేపు పడుతుంది. దిగడం ఎంత ప్రయాసో, ఎక్కడం రెండింతల ప్రయాస.
ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మన ఉచ్వాస నిశ్వాసలు పాము బుస కొట్టినట్టు ఉంటాయి. అడుగులు భారంగా పడతాయి. శక్తినంతా కూడగట్టుకుంటే తప్ప అడుగు వేయలేం.
వీపునకు తగిలించుకున్న బ్యాగు, నీళ్ళ బాటిళ్ళే కాదు, బుజం పైన వేసుకున్న తుండుగుడ్డ కూడా భారంగానే అనిపిస్తుంది. వాటన్నిటినీ అక్కడే వదిలేసి వెళితే చాలని పిస్తుంది. లో య లోకి దిగగానే నీడనిచ్చే ఒకే ఒక్క వృక్షం .
ఏమీ లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం. మండు వేసవిలో కాస్త సేద దీరడానికి మన పాలిట అది కల్పవృక్షం. లోయలోకి దిగాక చుట్టూ కలియ తిరిగితే, అంతా కొండ అంచులే. పడమరన ఉన్న శేష తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహం తూర్పునకు పారుతుంది.
ఆ నీటి ప్రవాహం రెండు కొండల మధ్య నుంచి సాగుతుంది. నీటి ప్రవాహానికి ఒరుసుకుని నల్లని రాతి కొండలు రకరకాల రూపాలను సంతరించుకున్నాయి. ఆ కొండ చీలికనుంచి కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళగలుగుతాం.ఆ తరువాత మనిషి పట్టనంతటి సన్నని దారి!
ఆ చీలికకు అభిముఖంగా తూర్పు దిక్కున ఉన్న కొండ అంచుల నుంచి జాగ్రత్తగా పైకెక్కాలి. కొండ అంచులను పట్టుకుని ఒకరొకరే ముందుకు సాగాలి. ఏ మాత్రం పట్టు తప్పినా, ముప్పై అడుగుల పల్లం లోకి దొర్లుకుంటూ పడిపోతాం.
కొండ అంచులు దాటితే, ఎదురుగా శేష తీర్థంలోకి ప్రవేశించే కొండ చీలికలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఈత వచ్చిన వారే ముందుకు సాగగలుగుతారు. ఈత రాని వారిని ట్యూబులపైన కూర్చోబెట్టి, తాళ్ళతో లాక్కెళ్ళాలి.
ఎత్తైన కొండకు నిట్టనిలువునా చీలిక! ఆ సన్ని చీలికలో నూట యాభై అడుగుల పైగా ఈదుకుంటూ వెళ్ళాలి. అడ్డంగా వచ్చిన ఏడెనిమిది అడుగుల కొండ రాళ్ళను ఎక్కి ఆవలికి దిగాలి.
అలా సాగుతుంటే మాటలకందని మహాద్బుత దృశ్యాలు. తలెత్తితే కొండ అంచుల రూపాలు; చిత్రి విచిత్రాలు. నీటి ఉధృతికి గుండ్రంగా చెక్కినట్టు ఎత్తైన కొండ చీలికల్లో సహజ సిద్దం గా ఏర్పడిన రూపాలు. లేత గులాబీ రంగులో కొండ అంచులు!
ఆ కొండ చీలికల మధ్య ఒక్కొక్కరు మాత్రమే ముందుకు సాగాలి. తలపైకెత్తినా ఆకాశం కనిపించదు. మధ్యలో చిన్న చిన్న ఏడు నీటి గుండాలను దాటుకుంటూ ముందుకు సాగాలి. దారి పొడవునా రాళ్ళపై నీళ్ళే! అంతా పాకుడే!
జారకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కాళ్ళకు పాత మేజోళ్ళు వేసుకుంటే జారకుండా ఉంటాం. ఈ మలుపులన్నీ చూస్తుంటే మెలికలు తిరిగి పడుకున్న శేషుడి తోక చివరి నుంచి పడగవరకు వెళ్ళినట్టుంటుంది.
నీటి మడుగులోంచి మళ్ళీ చిన్న రాతి బండ ఎక్కాలి. శేష తీర్థం లోకి సహజ సిద్ధమైన ద్వారం లాంటి చీలిక.ఆ చీలిక నుంచి చూస్తే ఒక మహాద్బుత దృశ్యం! స్వచ్ఛమైన నీటి గుండం.
ఆ గుండంలోకి ఎదురుగా కొండ చీలిక నుంచి పడుతున్న జలధార.విప్పు కున్న శేషుడి పడగలా, నీటి గుండాన్ని అన్ని వైపులా కమ్మేసిన కొండ అంచులు. వెలుగుతున్న దీపాన్ని రెండు చేతులతో కప్పి కాపాడినట్టుంది. కొండతో చేసిన చుట్టుగుడిసెలోకి దూరినట్టుంది.
నిత్యం ప్రవహించే నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో! పెద్దగా వెలుతురు లేని నీటి గుండం. సూర్యుడు నడినత్తికొస్తే తప్ప జలధార పడుతున్న చీలిక నుంచి కిరణాలు సోకవు. సూర్య కిరణాలు పడే సమయంకోసమే ప్రకృతి ప్రియులు ఎదురు చూస్తుంటారు.
ఈ కొస నుంచి ఆ కొసకు ఈదుకుంటూ వెళితే పట్టుకోడానికి కాస్త కొండ అంచు దొరుకుతుంది.కొండ అంచుపట్టుకుని ఆ జలధార కింద నిలబడితే, నెత్తిపై ముత్యాలు రాలినట్టే! ముత్యాలతో ప్రకృతి అభిషేకం చేసినట్టే! మైళ్ళదూరం నడిచిన అలుపంతా తీరిపోతుంది. ఆకలి తెలియదు. దాహం తెలియదు. కరిగిపోతున్న కాలం గుర్తుకు రాదు. ఈ తీర్థంలో విశ్రమించలేం.
మిగతా తీర్థాలలోలాగా ఎవ్వరూ ఇక్కడ పౌర్ణమి రాత్రికి నిద్రించరు. అడవి జంతువుల భయం. ఈ తీర్థానికి రావడానికి ఎంత కష్టపడ్డామో, తిరిగి వెళ్ళడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాలి.
తిరిగి వచ్చేటప్పుడు అంతా మిట్ట.మళ్ళీ లోయలోంచి కొండ ఎక్కడం ఎంత ప్రయాస! లోయ లోంచి కొండ ఎక్కాలే కానీ, శేషతీర్థం అనుభూతులతో అడుగులు వడివడిగా పడతాయి.
మళ్ళీ అడవి అందాలను ఆస్వాదిస్తాం.5 వ ఫొటోః కొండ అంచుల్లో నీటి ఒరవడికి ఏర్పడిన సుందర దృశ్యం.
(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)