– రాఘవ శర్మ
విప్లవ రచయితల సంఘం(విరసం)పై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధం విధించింది.
శ్రీశ్రీ, కె.వి. రమాణారెడ్డి, త్రిపురనేని మధుసూదన రావు, చలసాని ప్రసాద్, రావి శాస్త్రి వంటి ఉద్దండులైన సాహితీ వేత్తలు గతంలో పనిచేసిన విరసాన్ని నిషేధించడం నిజంగా ఒక సంచలనమే!
రెండు తెలుగు రాష్ట్రాలలో అర్ధ శతాబ్దం క్రితం ఏర్పడిన సాహిత్య సంఘాన్ని నిషేధించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
విరసంతోపాటు మొత్తం 16 సంఘాలను నిషేధిస్తూ తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు మార్చి 30 నుంచి అమలులోకి వచ్చాయి.
నిషేధానికి గురైన జాబితాలో విరసంతోపాటు తెలంగాణా ప్రజాఫ్రంట్, తెలంగాణా అసంఘటిత కార్మిక సమాఖ్య, తెలంగాణా విద్యార్థి వేదిక, డెమాక్రటిక్ స్టూడింట్స్ ఆర్గనైజేషన్, తెలంగాణా విద్యార్థి సంఘం, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్, రాజకీయ ఖైదీల విడుదల కోసం సంఘం, తెలంగాణా రైతాంగ సమితి, తుడుం దెబ్బ, ప్రజాకళామండలి, తెలంగాణా డెమాక్రటిక్ ఫ్రంట్, హిందూ ఫ్యాసిస్టు నేరాల వ్యతిరేక సంఘం, పౌరహక్కుల సంఘం, అమరుల బందుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం ఉన్నాయి.
ఈ సంస్థల సభ్యులు నగరాలలో, పట్టణాలలో తిరుగుతూ పట్టణ గెరిల్లా పద్ధతులను అనుసరిస్తున్నారని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తూ, సభలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం విడుదల చేసిన నిషేధిత ఉత్తర్వులో పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్రపన్నారన్న ఆరోపణపై ఎలగార్ పరిషత్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న వరవరరావు(విరసం), ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా, రోనా విల్సన్ వంటి వారిని విడుదల చేయాలని ఈ సంస్థలు కోరుతున్నాయని పేర్కొంది.
విరసం వంటి సంఘాల వారి వాదనలను ఎదుర్కోలేక, వీరిపై తప్పుడు కుట్ర కేసు పెట్టారన్నది పలువురు మేధావుల వాదన.
విల్సన్ లాప్‌టాప్‌లో తప్పుడు ఆధారాలు పెట్టి వీరిని ఈ కేసులో ఇరికించారని వాషింగ్‌టన్ పోస్టు చేసిన పరిశోధన కూడా వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఈ 16 నిషేధిత సంస్థలు వ్యతిరేకించాయని ఆ జీవోలో పేర్కొంది.
రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం నేరం కాదు కదా!
అలా అంటే తెలంగాణా ప్రభుత్వ పెద్దలు పార్లమెంటులో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఈ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలోని పెద్దలు కూడా బహిరంగ ప్రకటనలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌరసత్వ నమోదు చట్టాన్ని(ఎన్ఆర్‌సీ) ఈ సంఘాల వారు వ్యతిరేకించారని ఈ నిషేధిత ఉత్తర్వులో పేర్కొన్నారు.
దేశంలో చాలా మంది మేధావులు, చాలా మంది పౌరులు వీటిని వ్యతిరేకించారు. పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమి హక్కు. ఇష్టం లేని వాటి పట్ల నిరసన తెలిపే హక్కుకూడా ఉందని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది.
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విధానాల ను వ్యతిరేకించడం, వాటి పట్ల నిరసన తెలపడం నేరం కాదు. అలాంటప్పుడు వీరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని, నిరసన తెలపడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తారు?
ఈ నిషేధిత 16 సంఘాల వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తన్నారన్నది మరో ఆరోపణ. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా , ఎవరి ఆదేశాలు ఎలా ఉన్నా అవి రాజ్యాంగం పరిధిలో ఉన్నట్టయితే వాటిని ఎలా నిషేధిస్తారు?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసఘడ్, జార్కండ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలతోపాటు మరి కొన్ని ప్రాం తాలలో మావో ఇస్టు పార్టీ వ్యాపించిందని, ఈ నిషేధిత సంస్థలు, ముఖ్యంగా విరసం సభ్యులు రచయితలుగా ప్రజల్లో పలుకుబడి కలిగిన వారని, వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ ఆదేశాలలో పేర్కాన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే నేరం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడవచ్చు కదా! అంటే వీరి ఉద్దేశ్యమేమిటి? మేం ఏం చేసినా ఎవరూ నోరెత్తకూడదు.
నోరెత్తితే దేశద్రోహులనో, అర్బన్ నక్సలైట్లనో ముద్ర వేయడం నియంతృత్వ పోకడే. ఏనిషేధిత సంఘ సభ్యుడినైనప్పటికీ అతన్ని నేరస్థుడిగా భావించడం సరికాదని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది.
హిట్లర్ నాజీ పాలనలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారెవరైనా సరే నిర్బంధించి, జైళ్ళలో హింసించి, చంపేసిన సంఘటనలు చరిత్రలో చూశాం.
కమ్యూనిస్టులను, యూదులను ఊచకోత కోసిన హిట్లర్ దుర్మార్గాలకు చరిత్ర సాక్షీ భూతంగా నిలబడింది. నాజీ భావజాలంతో నిండిన గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ పునాదిగా నడుస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధించాల్సిన ఇలాంటి నిషేధాలను తెలంగాణాలోని టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎందుకు విధిస్తోంది? అన్నది ఇప్పడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా పనిచేస్తోంది. ఇప్పటికే తనకు గిట్టని వారిపైన ఎన్ ఐ ఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)ని, సీబీఐని ప్రయోగిస్తోంది.తప్పుడు కేసులు పెట్టి, జైళ్ళలో కుక్కుతోంది.
ఇలాటి చర్యలతో మోడీ ప్రభుత్వం ప్రజల్లో, మేధావుల్లో పరువు పోగొట్టుకుంటోంది.ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకుని వాటి చేత ఈ నిషేధాలను అమలుచేయిస్తోందనిపిస్తున్నది.
పైకి మేకపులి గాంభీర్యం ప్రదర్శిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాధినేతలపైన ఉన్న కేసులను ఆసరా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వాటిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటోంది.
ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ, వారి చేత నిషేధిత చట్టాలను తెప్పించి, వాటిని అమలు చేసే లా చూస్తోంది.
ప్రజాస్వామిక పతనానికి, నియంతృత్వ పోకడలకు ఇవి సూచికలుగా కనిపిస్తున్నాయి.
(ఇందులో వ్యక్తపరిచినవి రచయత సొంత అభిప్రాయాలు)