బహు భార్యాత్వం గురించి విస్తుపోయే  నిజాలు… 

      (డాక్టర్. జతిన్ కుమార్ )

భారతీయ సమాజంలో బహు భార్యత్వం ఎంత వుంది? ఏ మతం మగవాళ్ళు ఎక్కువమంది భార్యలను కలిగి ఉంటున్నారు? అనే విషయం తెలుసు కోవటం కేవలం  ఒక సాధారణ ఆసక్తికి చెందిన విషయమే కాదు, స్త్రీల సామాజిక స్థాయినీ , సమానత నీ  సూచించే అంశం కూడా. అంతే కాదు “ముస్లిం మతస్తులలో  బహు భార్యాత్వం చాలా హెచ్చు” అనే  ఒక అభిప్రాయం ప్రచారం లో ఉన్నది. ఈ అధ్యయనంలో బహుళ ప్రచారంలో ఉన్నఈ అంశం ఎంత వరకు నిజమూ  అన్న విషయం కూడా తెలుస్తుంది. 

ఒకనాటి ప్రఖ్యాత షాబానో కేసు తర్వాత, ముస్లిం వివాహ వ్యవస్థ గురించి చాలా చర్చలు జరిగాయి. “భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్” కార్యకర్తలు, ముస్లింలో బహు భార్యాత్వాన్ని నిషేధించాలంటూ ఒక ముసాయిదా చ ట్టం కూడా తయారు చేశారు. వారు స్త్రీల సమానత్వ దృష్టితో ఈ ప్రతిపాదన చేస్తే, భారతీయ జనతా పార్టీ మరో కారణంతో దీనికి వెనువెంటనే తమ మద్దతు  ప్రకటించింది, ఎక్కువ మంది భార్యలు ఉండటం వల్ల ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు కలుగుతున్నారనీ , అందువల్ల ముస్లిం జనాభా త్వరిత గతిని  వృద్ధి చెందుతున్నదని, దీన్ని అరికట్టడానికి, హిందూ మెజారిటీని కాపాడటానికి, ముస్లింల  బహు భార్యాత్వాన్ని  నిషేధించాలని వారు అభిప్రాయపడ్డారు. 

అయితే బహు భార్యలను కలిగి ఉండటం  ఏ మతంలో ఎంత వుంది అనే అధ్యయనం చేయడం ( విషయ సేకరణ)  కొంత క్లిష్టమయినదే. ఆఖరి సారిగా 1961 జనాభాలెక్కలలో మాత్రమే- మతాలు ,సామాజిక వర్గాల నేపధ్యం లో జరిగిన  వివాహాల సంఖ్యను నమోదు చేశారు. అప్పటి లెక్కల ప్రకారం ముస్లింల లో 5.7 %  మంది బహు భార్యలను కలిగి ఉన్నారు. అంతగా చెప్పుకోని దేమంటే     హిందువులలో 5.8%, జైనుల లో 6.7%, బౌద్ధుల లో 7.9% మంది కూడా బహు భార్యాత్వాన్ని అనుసరిస్తున్నట్లుగా నమోదై వుంది. వీరందరికంటే ఎక్కువగా గిరిజనులలో  15.25% మంది బహుభార్యలను కలిగి వున్నారని లెక్క వేశారు.  

“ ముస్లిం పర్సనల్ లా  బహుభార్యత్వాన్ని అనుమతిస్తుంది, కానీ భారతీయ ముస్లింలు దాన్ని వాస్తవం లో అంత అధికంగా పాటించటం లేదు”  అని [ Unequal citizens: A Study of Muslim Women in India ] రచయిత  రీతూ మీనన్ అంటారు. 

ఆ తరువాత  లభించిన సమాచారం 1974 లో చేసిన ఒక సర్వే. అదికూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. ముస్లిం ల లో 5.6%, హిందూ అగ్రకులాలలో 5.8% బహు భార్యాత్వం   ఉన్నట్లు ఆ సర్వే నమోదు చేసింది. 1993 లో పూణే లో మల్లికా బి మిస్త్రీ  చేసిన అధ్యయనం కూడా ”ముస్లింలలో, హిందువులకంటే ఎక్కువగా  బహుభార్యాత్వం ఉన్నట్లు ఏ ఆధారమూ లేదు” అని విస్పష్టం గా చెప్పింది. 2006 లో జరిపిన మూడవ జాతీయ ఫామిలీ హెల్త్ సర్వే లో 2% మంది మహిళలు , తమ భర్తలకు మరో భార్య (లేక భార్యలు) వున్నట్లు చెప్పారు. ఏ ఒక్క మతం లోనో  ఇలా వున్నట్లు చెప్ప లేదు. మొదటి భార్య వల్ల పిల్లలు కలగక పోవడం, లేక మగ సంతానం కలగక పోవడం, భార్యకు చదువు రాకపోవటం, వయసు వ్యత్యాసాలు తదితర కారణాల వల్ల రెండో వివాహం జరుగుతున్నట్లు  పేర్కొన్నారు గాని మత ఆచారాల ప్రభావం అని  అనలేదు.

బహు భార్యలు కలిగి ఉన్నవాళ్ళలో, వివిధ మతాల పురుషులలో కొంత తేడా ఉన్నది. హిందువులు 1.77, ముస్లింలు 2.5, క్రైస్తవులు 2.35, బౌద్దులు 3.4 మంది భార్యలను కలిగి ఉన్నారు. ఈశాన్య భారత దేశం లోను, దక్షిణాదిలోనూ ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది . ఆ తరువాతి స్థానం తూర్పు ప్రాంతాలదీ. ఈ ప్రాంతీయ గణాంకాలలో కూడా మత పరమైన వ్యత్యాసం అంతగా లేదు.

గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈ పరిశీలనలన్నీ హిందూ కోడ్ ను  ఆమోదించిన  (1950 )తర్వాత జరిగినవే, అంటే చట్టపరంగా హిందువులలో బహు భార్యాత్వం నిషేధించబడిన తరువాత. అది  చట్టవిరుద్ధం అని ప్రకటించిన తరువాత కూడా  హిందువులలో బహు భార్యాత్వం ఇతర మతాల కంటే తగ్గి పోలేదనీ, మిగతా మతాల, సామాజిక బృందాలతో సమజోడుగా సాగుతూనే ఉందని అర్థమవుతోంది. వరకట్నాలు ,బాల్యవివాహాలు వంటి విషయాలలో చట్టం ఎంత ప్రభావహీనంగ ఉందో,  బహు భార్యత్వం విషయం లో కూడా అలాగే ఉంది. ఇలాంటప్పుడు  ముస్లిం స్త్రీలు బహుభార్యత్వం నిషేధించమని అర్థించడమ్ లో అర్ధముందా ?          

 తాము స్వతంత్రత , సమానత, ఆత్మగౌరవము గల ఆధునిక సమాజం వైపు అడుగిడటానికి నాందిగా ముస్లింలలోని  బహు భార్యత్వాన్ని రద్దు చేయవలసిందే అని ముస్లిం మహిళా సమాజం ఆకాంక్షిస్తున్నది . “లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి బహు భార్యాత్వాన్ని రద్దు చేసే  చట్టం ఎంతో బలాన్నిస్తుంది”  అని   ముస్లిం మహిళా సంస్థ సహ వ్యవస్థాపకురాలు జనియా సోమన్ అంటారు . ” అయితే  చట్టం చేసినంత మాత్రాన మహిళకు వెంటనే  ఒరిగిపడేది ఏమీలేదు, సమాజ క్షేత్రంలో మేము చురుకుగా పని చేయ వలసి వుంటుంది, ఈలోగా  చట్టం దానికి కావలసిన  నైతిక స్థైర్యాన్నిస్తుంది “  

Dr Suryadevara Jatinkumar

(డాక్టర్ జతిన్ కుమార్, ఆర్థోపేడిక్ సర్జన్, రచయిత, కవి, సామాజిక ఉద్యమకారుడు, హైదరాబాద్)

(18 ఏప్రియల్ 2021 స్క్రోల్. ఇన్ సంచికలో, జులై 2014 నాటి  రోహన్ వెంకట రామకృష్ణన్ వ్యాసం ప్రచురించారు. దాని  ఆధారంగా)

 

  

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *