తిరుపతి ఎన్నిక రద్దు చేయాలని రత్నప్రభ పిటిషన్

ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ (ఎస్ సి)  స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తిరుపతి వైసిపి ఎంపి మరణించడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఇందులో వైసిపి తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తే, బిజెపి తరఫున మాజీ ఐఎఎస్ అధికారి  రత్న ప్రభ పోటీ చేశారు. తెలుగుదేశం తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిపోటీ చేశారు. కాంగ్రెస్ కూడా పోటీ లో ఉంది. ఎన్నికల్లో అధికార పార్టీ బాగా అక్రమాలకు పాల్బడిందని విమర్శలు వచ్చాయి. ఇతర జిల్లాలనుంచి మహిళలను రప్పించి పెద్ద ఎత్తున దొంగవోట్లు వేయించుకున్నారని తెలుగుదేశం పార్టీ  ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇపుడు, బిజెపి అభ్యర్థి రత్నప్రభ, అసలు తిరుపతి ఎన్నికను రద్దు చేయాలని  హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇలా పోలింగ్ జరిగాక ఎన్నికలను రద్దు చేయవచ్చా ? ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలిచాక  ఏకంగా ఎన్నికను రద్దు చేయవచ్చా?

దీనికి  చారిత్రాత్మక ఉదాహరణ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు. సుమారు నాలుగున్నర దశాబ్దాల కిందట అలహా బాద్ హైకోర్టు  ఎన్నికల అక్రమాల కారణంగానే రద్దు చేసింది. ఆ తర్వాత ఏమయిందో తెలుసుగదా, దేశంలో ఆమె ఎమర్జన్నీ విధించారు.

1975 జూన్ 12న అలహాబాద్ హై కోర్టు ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి, ఆమె లోక్ సభ ఎన్నిక చెల్లదని చెప్పింది.  ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువయింది. దీనితో ఆమె ఎన్నిక చెల్లదనే కాదు, మరొక ఆరేళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ తీర్పు ఇచ్చింది అలహా బాద్ హైకోర్టుకు చెందిన జగ్మోహన్ లాల్ సిన్హా.

1971లో జరిగిన ఎన్నికలో ఇందిరాగాంధీ  ఉత్తర ప్రదేశ్  రాయ్ బరేలీనుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఓడిపోయారు. అయితే, ఆయన ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని , యశ్ పాల్ కపూర్  ప్రభుత్వోద్యోగిని ఆమె ఎన్నికల ఏజంటుగా పెట్టుకున్నారని రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ వేశారు. ఇది రుజువయింది. కోర్టు ఆమె అక్రమాలకు పాల్పడ్డారని,  ప్రజాప్రతినిధుల చట్టం 1957లోని  సెక్షన్ 123(7) కింద ఆమె ఎన్నికల చెల్లదని తీర్పు చెప్పింది. ఆమెసుప్రీంకోర్టు కు వెళ్లారు. అపుడు వెకేషన్ జడ్జి జస్టిస్ విఆర్ క్రిష్ణ అయ్యర్ 1975జూన్ 24న ఆమెకు కండిషనల్ స్టే ఇచ్చారు. ఆమె ప్రధానిగా కొనసాగవచ్చని, అయితే పార్లమెంటు చర్చల్లో పాల్గొన రాదని, ఎంపి జీతం తీసుకోరాదని చెప్పారు. ఆ మరుసటి రోజే అంటే జూన్ 25, 1975 దేశంలో ప్రధాని అత్యయిక పరిస్థితి విధించారు.

ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి.

ఉదాహరణకు గుజరాత్ లో  2017లో ఏంజరిగిందో చూద్దాం. అక్కడి ధోల్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి భూపేంద్ర సింగ్ చూడసామా గెల్చారు. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి  అశ్విన్ రాథోడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఎన్నికల్లో రాథోడ్ కేవలం  327ఓట్లతో ఓడిపోయారు. ఆయన పిటిషన్ ను పరిశీలించాక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పరేష్ ఉపాధ్యాయ భూపేంద్ర సింగ్ (Section 100 (1)(d)(iv) of the Representation of the People’s Act 1951) ప్రకారం ఎన్నిక చెల్లదని  తీర్పు చెప్పారు.

ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అందుకే ఈ ఎన్నికచెల్లదని హైకోర్టు తీర్పు చెపింది. రిటర్నింగ్ అధికారి, బిజెపి అభ్యర్థి భూపేంద్ర సింగ్ లాలూచి పడ్డారని,అందుకే ఎన్నికల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ను అడిషనల్ కలెక్టర్ స్థాయికి ప్రమోటో చేశారని రాధోఢ్ వాదించారు.రిటర్నింగ్ ఆఫీసర్ తో భూపేంద్ర సింగ్ లాలూచి పడ్డాడన్న విషయంలో హైకోర్టు సంతృప్తి చెందింది.

ఈఎన్నిక చెల్లదని, ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనేందుకు రుజువులున్నాయని ప్రధాన న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అపుడు భూపేంద్ర సింగ్ గుజరాత్ ప్రభుత్వంలో  న్యాయ శాఖ మంత్రి కూడాను. అయితే, ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.  2020 మేనెలలో హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చింది.

ఇపుడు తిరుపతి ఉప ఎన్నికలో  బిజెపి అభ్యర్థి రత్న ప్రభ కూడా ఎన్నికల అక్రమాల ఆరోపణలో మీదే తిరుపతి ఎన్నిక రద్దుచేయాలని పిటిషన్ వేశారు.ఆమె పిటిషన్ లో ఏ వివరాలు పేర్కొన్నారు, కోర్టు కు ఎలాంటి వివరాలు సమర్పిస్తున్నారనే వివరు ఇంకా అందలేదు.  కోర్టు ఈ పిటిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *