(రాఘవ శర్మ)
ఎత్తైన కొండపైన ఒక పెద్ద నీటిగుండం. ఆ గుండానికి ఉన్న సొరంగం నుంచి వస్తున్న నీటి ప్రవాహం.
ఆ నీటి గుండం పొంగి పొరలి , కొండపైనుంచి కిందకు జలపాతంలా జాలువారుతోంది.
ఆ జలపాతం మరో పెద్ద నీటిముడుగులో పడి ముందుకు సాగిపోతోంది.
రెండు ఎత్తైన కొండల నడుమ ఉన్న అనేక నీటి గుండాలకు ఆవల ఒక మహాద్భుత దృశ్యం నారాయణ తీర్థం. తిరుమల శేషాచలం కొండల్లో కొలువై, మనసును మంత్రించే ప్రకృతి సోయగం.
తూర్పున ఏర్పేడు నుంచి, పడమరన తలకోన వరకు పరుచుకున్న శేషాచలం కొండలు.
తన కడుపులో ఎన్నో అందాలను, అద్భుతాలను ఇలా దాచుకున్నాయి!
కొండలను ఎక్కుతూ దిగుతూ, అనేక నీటి గుండాలను దాటుకుంటూ వెళితే తప్ప, ఈ తీర్థ రాజాన్ని చేరుకోలేం.
పాతిక మంది ప్రకృతి ప్రియులైన ట్రెక్కింగ్ సాహసికులతో కలిసి గత ఆదివారం ఉదయం శేషాచలం కొండల్లోకి బయలుదేరాం. కొండల్లో కొలువైన ఈ నారాయణ తీర్థం చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో ఉంది.
తిరుపతి జ్ఞాపకాలు-31
తిరుపతి నుంచి కోడూరు వెళ్ళే దారిలో మామండూరు నుంచి అటవీ ప్రాంతం మొదలవుతుంది.
అది దాటాక వచ్చే కుక్కల దొడ్డి రెండు జిల్లాలకు సరిహద్దు. బాలపల్లి, మాధవరంపాడు దాటాక ఎడమ వైపు వచ్చే మరపురాజుపల్లె నుంచి అడవిలోకి దారితీశాం.
ఆ దారిలో ఎండిపోయిన ఒక ఏరు కొంత దూరం మాతోనే సాగింది. ఈ నదంతా రాళ్ళమయం.
వర్షాకాలంలో తప్ప ప్రవహించదు. రోడ్డుకు ఇరువైపులా పచ్చని అరటి, బొప్పాయి తోటలు.
మధ్యలో చిన్న చిన్న గ్రామాలు. చివరనున్న గంగరాజుపాడు నుంచి అంతా అడవే.
సరిహద్దుగా అటవీశాఖ ఏర్పాటు చేసిన పెద్ద గేటు.ఎటుచూసినా ఎత్తైన ఎండిపోయిన చెట్లు.
మధ్యలో రాళ్లు రప్పలతో నిండిన దారి.అడవిలో మరికొన్ని దారులు.
ఏ దారెటుపోతుందో ఎవరికీ తెలియదు ; అటవీశాఖకు, కొందరు సాహసికులకు తప్ప. రాళ్ళు రప్పలు, బండరాళ్ళతో నిండిన ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో కొండలు ఎక్కుతూ, దిగుతూ సాగిపోతున్నాం.
కొంత దూరం వెళ్ళాక అడవి అంతా పచ్చదనం పరుచుకుంది.ఎటు చూసినా ఎర్రచందనం వృక్షాలు, దట్టమైన వెదురు పొదలు.
మండు వేసవిలో కూడా అక్కడ చల్లదనం. వెదురు చిగుర్లను, మొవ్వలను తినేసిన ఏనుగులు వాటిని విరిచిపడేసిన ఆనవాళ్ళు. వెదుర్లు దారికడ్డంగా పడిఉన్నాయి.
అక్కడక్కడా ఏనుగు లద్దెలు. చాలా రోజుల క్రితం వేసినట్టు కొన్ని ఎండిపోయి ఉన్నాయి.
ఈ ప్రాంతంలో ఏనుగులు నిన్నమొన్నటి దాకా సంచరించిన ఆనవాళ్లుగా మరికొన్ని పచ్చిగా పడి ఉన్నాయి. ఏనుగులు ఉన్నాయన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది.
ఏ క్రూర జంతువునుంచైనా తప్పించుకోగలుగుతాం.పదిమంది ఉంటే చాలు, మనల్ని చూసి ప్రాణభయంతో అడవి జంతువులు పారిపోతాయి.ఏనుగులు వేటికీ వెరవవు. ఎదురుపడితే, వాటిని తప్పించుకోవడం సాధ్యం కాదు.
కంగుమడుగు ప్రవ హించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.ఎడమ దిక్కునున్న కొండవైపు వెళితే గుంజన జలపాతం.నీళ్ళు కనిపించకపోయినా భూమిపొరల్లో తేమ.మూడేర్ల కురవ మొదలైంది. మూడు ఏర్లు కలిసిన ప్రాంతం. అందుకే ఇది మూడేర్ల కురవ అయ్యింది.
అడవి అంతా పచ్చదనం. అతికష్టంపైన అక్కడి వరకే వాహనాలు వెళ్ళగలిగాయి. జాతీయ రహదారి నుంచి ఈ ప్రయాణం ఇరవై కిలోమీటర్లే.
ఆ ఘాట్ రోడ్డంతా రాళ్ళు రప్పలు, మధ్యలో నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చిన కొండ రాళ్ళు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనం దొర్లుకుంటూ లోయలోకి పడిపోతుంది.మూడేళ్ళ కురవకు చేరుకోవడానికి వాహనాల్లో మూడున్నర గంటలు పట్టింది.అక్కడ నుంచి నడక.
ఇరువైపులా ఎత్తైన కొండలు. మధ్యలో ఎండిపోయిన ఏరు.కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఎత్తైన రాతి కొండ.నిట్టనిలువునా ఎవరో చెక్కినట్టున్న ఆ రాతి కొండపై నుంచి వర్షాకాలంలో జలపాతం జాలువారిన ఆనవాళ్ళు. అదే మూడేర్ల కురవ జలపాతం.ముందుకు సాగితే ఎన్ని ప్రకృతి అందాలో!
రెండు వైపులా ఎత్తైన కొండల వరుస.నీటి ప్రవాహానికి కొండ అంచుల్లో ఏర్పడిన వింత వింత రూపాలు.
ఉలితో చెక్కినట్టున్న కొండ అంచులు. వాటి అంచుల్లో ఎత్తైన వృక్షాలు. రెండు కొండల మొదట్లో ప్రవహిస్తున్న సెల ఏర్లు. రెండు కొండల నడుమ నుంచి మూడు కిలోమీటర్లు నడిచాక పెద్ద నీటి మడుగు మొదలవుతుంది.
ఆ నీటి మడుగు వద్దే బూట్లు, బ్యాగులు, ఇతర సామాగ్రి వదిలేశాం.అక్కడి నుంచి ఆ మడుగులో ఈదుకుంటూ ముందుకు సాగాం.ఈత రాని వాళ్ళకోసం గాలి నింపిన ట్యూబుల పై కూర్చోబెట్టి, తాళ్ళతో ఆవలి ఒడ్డు నుంచి లాగారు.ఈత వస్తే ఇబ్బందే లేదు. ఈత రానివాళ్ళు ట్యూబుల మధ్య కూర్చుని మడుగు దాటడం సాహసమే!
మడుగు ఆవలే బూట్లు వదిలేశాం. ఒట్టి కాళ్ళతో నడక.అరికాళ్ళలో గుచ్చుకుంటున్న గులక రాళ్ళు.
నీళ్ళలోంచి కూడా నడక. నీళ్ళలోనూ గుచ్చుకుంటున్న గులక రాళ్ళు! నారాయణ తీర్థాన్ని చూడాలన్న కుతూహలం చెప్పులు లేకుండా నడిచే బాధను లెక్కచేయలేదు.గులకరాళ్ళలో అలా రెండున్నర కిటోమీటర్ల నడిచాం.
నిజానికి ఆ బాధను భరించలేక నడవలేనివారు ఆగిపోతారు. సాహసికులు సాగిపోతారు.మా పాతిక మందిలో అంతా సాహసికులే!
ఇలా అనేక మడుగులు ఈదుకుంటూ, గులక రాళ్ళపై రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాక, మహాద్భుతమైన నారాయణ తీర్థం మన కోసమే ఎదురు చూస్తున్నట్టుంది.
మనుషుల కోసం మొహంవాచి పోయినట్టుంది.కండలు పెరిగిన తన కొండల బాహువులను చాచి ఆహ్వానిస్తోంది. ఎంత పెద్ద నీటిమడుగో!ఆ మడుగును చుట్టుముట్టినట్టు అర్ధచంద్రాకారంగా ఎత్తైన కొండ.
ఎదురుగా ఆ కొండపైనుంచి జాలువారుతున్న జలపాతం.ఆ నీటిమడుగులో ఈదుకుంటూ ఆ జలపాతం వద్దకు వెళ్ళాం.మా బృందంలో మధు వంటి కొందరు సాహసికులు జలపాతం పక్కనుంచి అంచులు పట్టుకుని కొండ పైకెక్కారు.
జలపాతం పైన ఒక పెద్ద బండరాతికి తాడుకట్టి మడుగులోకి వదిలారు.ఆ తాడుపట్టుకుని కొండ ఎక్కాం.
తాడుపట్టుకుని ఎక్కుతున్నప్పుడు ఏమాత్రం జారినా నీటిమడుగులో ఢమాల్న పడిపోవాల్సిందే!
మా అందరిలో పెద్దవారైన డెబ్భై రెండేళ్ళ భూమన్ కూడా తాడుపట్టుకుని ముప్ఫై అడుగుల కొండెక్కారు.
ఈత రాని వాళ్ళను కూడా జాగ్రత్తగా తాడుతో కొండెక్కించారు.ఆ సాహసం చేయలేని వాళ్ళు నీటి మడుగు ఆవలే ఆగిపోయారు.
జలపాతం దుముకుతున్న చోటి నుంచి చూస్తే ఎంత అద్భుతం! ఎంత సాహసం! ఆ జలపాతం పైన మరో పెద్ద నీటి మడుగు! ఆ నీటి మడుగును మూడువైపులా చుట్టుముట్టినట్టు మరో చిన్న కొండ.
ఆ కొండకు ఉన్న సొరంగం చాలా భాగం నీటితో నిండి ఉంది.ఆ సొరంగం నుంచే గుండంలోకి నీటి ప్రవాహం వచ్చిపడుతోంది. మాలో కొందరం ఆ కొండపైకి ఎక్కి నీటి గుండంలోకి దూకాం.
నిత్యం పారే నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఆ నీటి గుండంలో ఎంత సేపు ఈదినా తనివితీరడంలేదు.
ఎంత సేపుంటాం! తిరుగు ప్రయాణం కావాలి కదా! చీకటి పడడకముందే అడవి దాటాలి. మళ్ళీ తాడుపట్టుకుని కింద ఉన్న నీటి గుండంలోకి దిగాం.నారాయణ తీర్థానికి మళ్ళీ రాగలమో!? రాలేమో!?
ఈ ప్రకృతి సిగలో తురిమిన తీర్థానికి నమస్కారం చేశాం.నీటి గుండాన్ని ఈదుకుంటూ మళ్ళీ ఆవలి ఒడ్డుకు చేరాం. పాదరక్షలు లేకుండా గులకరాళ్ళపైన మళ్ళీ అదే నడక!
నీటి మడుగుల్లోనుంచి మళ్ళీ అదే ఈత.బట్టలు తొడుక్కుని,బూట్లు వేసుకుని అడుగులు వేస్తుంటే ఎంత ఆనందమో! ఒట్టికాళ్ళతో గులకరాళ్ళపైన నరకాన్ని తలపించే నడక తప్పింది.ఇంటి ముఖం పట్టిన ఎద్దుల్లాగా, అడుగులు కూడా వడివడిగా పడుతున్నాయి. చీకటి పడకముందే వాహనాల వద్దకు చేరుకున్నాం.
అడవి అందాల్ని ఆస్వాదించాం.కొండల గంభీరాన్ని గుండెల నిండా నింపుకున్నాం. ఊపిరి తిత్తుల నిండా స్వచ్ఛమైన కొండగాలిని పీల్చుకున్నాం.మనసు నిండా ఆనందాన్ని దట్టించాం.ప్రకృతి అనుభూతులను సంపూర్ణంగా ఆస్వాదించాం.మా వాహనాలు వచ్చిన అడవి మార్గం గుండా మళ్ళీ బయలు దేరాయి.
ఎక్కడో దూరంగా ఏనుగుల ఘీంకారం వినిపించింది.ఏనుగుల బారిన పడకుండా అడవిని దాటుకుంటున్నందుకు ఒకటే ఆనందం. ” ఏనుగులను తరిమేశాం !” అన్నారు భూమన్. “మనల్ని చూసి అడవి జంతువులన్నీ పారిపోయాయ్” అన్నాను నేను. చీకట్లోనే ఆ అడవి మార్గంలో మా వాహనాలు ముందుకు సాగాయి.
మామండూరు మెయిన్ రోడ్డు ఎక్కేసరికి రాత్రి ఎనిమిదయ్యింది. అంత వరకు మా సెల్‌ఫోన్లన్నీ మూగవోయాయి. ఒక్కొక్క సెల్‌ఫోన్ మోగడం మొదలు పెట్టింది. నాగరికత ఆనవాళ్ళు లేని స్వచ్ఛమైన అడవి నుంచి, మళ్ళీ ఈ కాంక్రీటు వనంలోకి భారంగా వచ్చిపడ్డాం.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)