తిరుపతిలో ఓటేసే ముందు ఆంధ్రులు విజ్ఞత ప్రదర్శించాలి: టి. లక్ష్మీ నారాయణ

(టి.లక్ష్మీనారాయణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీని, కడప ఉక్కు ఫ్యాక్టరీని, రామాయపట్నం ఓడ రేవును ఎగ్గొట్టి, నిర్మాణంలో ఉన్న మన్నవరం విద్యుత్తు పరికరాల పరిశ్రమను ఆపేసి, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన దగాకోరులకు గుణపాఠం చెప్పాలి.

రాష్ట్ర ప్రభుత్వం గాలేరు – నగరి ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణాన్ని అటకెక్కించి తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిథిలోని ప్రజానీకానికి తీరని అన్యాయం చేసింది.

రాష్ట్ర రాజధాని అమరావతిని ఒకరు ధ్వంసం చేస్తుంటే, మరొకరు ఛోద్యం చూస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థం చేసిన పాలక పార్టీలకు గూబగుయిమనిపిస్తూ ఓటు ఆయుధంతో సమాధానం చెప్పాలి.

రత్నప్రభగారు గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారని ఊరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపబడున శ్రీమతి నిర్మలాసీతారామన్ గారు చేసిందేంటో ఒకసారి గుర్తు చేసుకొందాం. ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అన్న నోటితోనే తాజాగా పుదుచ్చేరీ ఎన్నికల ప్రచారంలో ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశాన్ని తన అధికారులతో చర్చిస్తానని వాగ్ధానం చేసింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డి.పి.ఆర్.-2 కు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి ఆమోద ముద్రవేస్తే నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మోకాలడ్డి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100కు 100% అమ్మేస్తామంటూ నిర్మలా సీతారామన్ గారే పునరుద్ఘాటించారు.

సురేష్ ప్రభు గారిని రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక చేసినప్పుడు రైల్వే శాఖ మంత్రినే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చామని గొప్పగా చెప్పారు. విశాఖలో నెలకొల్పుతామన్న రైల్వే జోన్ ను అసలు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలొస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచి, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచి, పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశానంటేలా పెంచారు. వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడి వెన్ను విరిగింది. ధరలు పెంచినందుకు పాలక పార్టీలకు ఓట్లు వేయాలా?

ప్రజల నిజజీవితాలను ప్రభావితం చేస్తున్న సమస్యల నుండి దృష్టి మళ్ళించడానికి తిరుమల పవిత్రతను అంటే దేవుడ్ని, మతాన్ని రాజకీయ ఆయుధాలుగా మలచుకొని, రాజకీయ లబ్ధిపొందాలన్న దుర్మార్గపు రాచక్రీడ ఆడుతున్నారు.

2014 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఇచ్చిన వాగ్ధానాలనే మరచిన, మాట తప్పిన నరేంద్ర మోడీ గారు తిరుపతి పవిత్రతను కాపాడుతారా!

ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి, ప్రజలు మరియు రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న వారికి గుణపాఠం నేర్పాలి.

(టి లక్ష్మినారాయణ, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ వ్యాఖ్యాత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *