తమన్నా ‘ఎలెవెన్త్ అవర్’ వెబ్ సిరీస్ రివ్యూ!
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ‘ఆహా’ తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంట్రీ నిప్పిస్తూ భారీ స్థాయిలో ‘ఎలెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ ని విడుదల చేశారు. దీనికి ‘గరుడ వే’ ఫేమ్ ప్రవీణ సత్తారు దర్శకుడు. కేవలం 12 గంటల్లో ముగిసే కథగా ఈ వెబ్ సిరీస్ కార్పొరేట్ కంపెనీ నేపథ్యంలో వుంది. ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం…
ఆరత్రికా రెడ్డి (తమన్నా) నేతృత్వంలోని ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లిక్విడేషన్ అంచున వుంటుంది. ఆమెని పదవి నుంచి తప్పించాలని ఆరుగురు మెంబర్లు కుట్ర పన్నుతారు. ఈ కుట్రను ఆమె ఎలా తీపి కొట్టిందన్నదే కథ.
ఆరత్రికా రెడ్డి తండ్రి మధుసూధన్ రెడ్డి (మధుసూధన్ రెడ్డి) ఆరిత్రికా కంటే కొడుకు ఆదిత్యనే ఎక్కువ ఇష్ట పడతాడు. ఆదిత్య అనారోగ్యానికి గురైన నేపథ్యంలో కంపెనీ బాధ్యతలు ఆరాత్రికా చేతిలో పెట్టక తప్పలేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యుత్తును అందించడం ఆరాత్రికా కల. ఆమె పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు రుణం తీసుకుంటుంది. దీనికి అడుగడుగునా ఆటంకాలెదుర్కొంటుంది.
పన్నెండు గంటల్లో చిట్ట చివరి పదకొండవ గంటలో, బోర్డు మెంబర్స్ అందరూ ఆమె పతనం కోసం ఎత్తుగడలు వేస్తోంటే, ఒక వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించడం ఎంత కష్టమో చూపించడానికి తమన్నా పాత్ర ప్రయత్నిస్తుంది. కార్పొరేట్ రంగం అనేది పురుషుల ఆధిపత్య రంగమని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక స్త్రీగా తన సమర్ధతను ప్రతి దశలోనూ నిరూపించుకోవాల్సిన ఆగత్యాన్ని ఎత్తిచూపుతుంది. అయితే ఇదంతా ఉపరితల ప్రయత్నంగానే వుంటుంది తప్ప, కథ లోతుపాతుల్లోకి వెళ్ళి బలమైన సంఘర్షణగా చూపించే ప్రయత్నం చేయలేదు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
ఏ పాత్ర కూడా అనుభూతించేలా, ఆకట్టుకునేలా లేదు. చివరికి అరాత్రికా 12 గంటల కల్లా కార్పొరేట్ కంపెనీ తమన్నా చేజారిపోతుంది. అప్పుడుకూడా ఆమె ముఖంలో తాగిన భావోద్వేగాలు వుండవు.
ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్, ప్రతి ఒక్కటి 20 నిమిషాలు మాత్రమే వుండడం పెద్ద రిలీఫ్. స్క్రీన్ ప్లే కథనం నాన్-లీనియర్ స్ట్రక్చర్ లో వుంది. క్లయిమాక్స్ కూడా ఒప్పించేదిగా లేదు. కార్పొరేట్ సంస్థల పని తీరుపై రీసెర్చ్ చేసి ఈ వెబ్ సిరీస్ తీసినట్టు లేదు. ఇలాటి కథలు ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. మొత్తానికి మిల్కీ బ్యూటీ డిజిటల్ ఎంట్రీ ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి.
―సికిందర్