పవన్ సాబ్ పవర్- ( ‘వకీల్ సాబ్’ రివ్యూ)
రచన,దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతీ హాసన్,నివేదా థామస్, అంజలీ, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, ముకేష్ రుషి, షాయాజీ షిండే తదితరులు
సంగీతం : ఎస్ తమన్, ఛాయాగ్రహణం : పిఎస్ వినోద్
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నిర్మాతలు: దిల్‌రాజు,శిరీష్
(సికిందర్)
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మొత్తానికి విడుదలైంది. ఇది హిందీ ‘పింక్’ కి రీమేక్ అని తెలిసిందే. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’ తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది. కారణం అది యువతుల కథ కావడం. హైదారాబాద్ లో తెలుగు కుటుంబాలు, తెలుగు యువతులు విపరీతంగా చూశారు. పవన్ కళ్యాణ్ తో రీమేక్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ సినిమాగా వుంది. దీనివల్ల యువతుల సినిమా అన్న బ్రాండింగ్ తొలగింది. ఫ్యాన్స్ కోసం, మాస్ కోసం, చాలా మార్పులు చేసిన రీమేక్ గా ఇది ప్రేక్షకుల ముందు కొచ్చింది. పైగా పవన్ పోలిటికల్ లీడర్ కూడా కావడంతో ఆ పొలిటికల్ క్యారక్టర్ గా కూడా వకీల్ సాబ్ మారాడు. ఇలాటి మార్పులతో పవన్ మూవీ ఎలా వుందో చూద్దాం.
కథ
పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి) దివ్య (అనన్య) హైదరాబాద్‌లో రూమ్‌మేట్స్. వీళ్ళ స్వంత కుటుంబాలు, నేపథ్యాలు భిన్నంగా ఉంటాయి. ఒక రోజు వంశీ అనే ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే వెళ్తారు. అక్కడ వంశీ పల్లవితో అసభ్యంగా ప్రవర్తిస్తే బాటిల్ తో కొట్టి గాయపరుస్తుంది. దాంతో హత్యాయత్నం కేసులో యిరుక్కుంతుంటుంది. వంశీ రాజకీయ నాయకుడి కొడుకు. ఇలా ఈ కేసులో ఇరుక్కున్న ముగ్గుర్నీ వకీల్ సాబ్ (పవన్ కళ్యాణ్) కోర్టులో ఎలా కాపాడాడన్నది మిగతా కథ.
నటనలు – సాంకేతికాలు
అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్ర పోషించడం ఎవరికైనా కష్టమే. ‘పింక్’ లో అమితాబ్ బై పోలార్ డిజార్డర్ తో మానసికంగా, వాతావరణ కాలుష్యంతో శారీరకంగా సతమతమయ్యే వృద్ధ లాయర్ పాత్రలో పవర్ఫుల్ గా కనిపిస్తాడు. కోర్టు సీన్లలో అతడి రియలిస్టిక్ నటన కదిలించేదిగా వుంటుంది. అయితే సినిమాని తను డామినేట్ చేయడు. కథని యువతుల కథ గానే వుంచుతూ వెనుక వుండి నడిపిస్తాడు.
పవన్ కళ్యాణ్ కి తెలుగులో వున్న భారీ ఇమేజితో బాటు, రాజకీయ ఇమేజి కథని డామినేట్ చేశాయి. రాజకీయ డైలాగులు కూడా కొట్టడంతో యువతుల కథ పక్క దారి పట్టింది. పైగా మాస్ ఫైట్స్ కూడా పెట్టారు. సాంగ్స్ కూడా పెట్టారు. వీటన్నితో తెలుగు ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తాడనడంలో సందేహం లేదు. కాసేపు కథని పక్కన బెడితే, పవన్ ని బాగా ఎంజాయ్ చేయ వచ్చు.
నివేదా థామస్, అంజలి, అనన్య సానుభూతి పొందే పాత్రల్లో సముచితంగా నటించారు. లాయర్ గా ప్రకాష్ రాజ్, ఇంకో లాయర్ గా సత్యదేవ్ నటించారు.
సాంకేతిక విభాగాల్లో తమన్ నీటైన సంగీతం ఇచ్చాడు. ‘మగువ’ అనే సాంగ్ తో మెలోడీ పరంగా మెప్పించాడు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం బడ్జెట్ కి తగ్గ హై క్వాలిటీతోనే వుంది. ‘’23 కోట్ల బడ్జెట్ అయితే, ‘వకీల్ సాబ్’ కి 70 కోట్లు ఖర్చు పెట్టారు. 23 కోట్ల ‘పింక్’ అప్పట్లో 107 కోట్లు వసూలు చేస్తే, 70 కోట్ల ‘వకీల్ సాబ్’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి
చివరి కేమిటి?
‘వకీల్ సాబ్’ ఫస్టాఫ్ బలహీనం, సెకండాఫ్ బలం. ఫస్టాఫ్ లో పవన్ లాయర్ వృత్తి ఎందుకు మానేశాడో చెప్పడానికి సుదీర్ఘ మైన ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ తో శృతీ హాసన్ కన్పిస్తుంది. రెండు పాటలు కూడా పెట్టారు. సినిమాకి ఈ బలహీ న ఫ్లాష్ బ్యాకే చాలా మైనస్. పైగా పవన్ స్టూడెంట్ గా కూడా కనిపిస్తాడు!
సెకండాఫ్ లోనే కథతో కోర్టు సీన్లు వుండడంతో డైలాగ్ పవర్ తో విజృంభిస్తాడు. అతడికి ప్రత్యర్ధి ప్రకాష్ రాజ్. ఈ డైలాగుల్లో రాజకీయ డైలాగులు కూడా దొర్లుతాయి. చివ రికి అమ్మాయిలు నిర్దోషులని రుజువు చేసి ఒక క్లైమాక్స్ ఫైటుతో ముగిస్తాడు.
దర్శకుడు వేణూ శ్రీరామ్ కి ‘పింక్’ ని పవన్ తో రీమేక్ చేయడమన్నది కత్తి మీద సాము. ఫ్యాన్స్ వరకూ ఈ సాము గెలిచాడు. కానీ యువతుల కథతో యువకులకి వెళ్లాల్సిన చెంప పెట్టు లాంటి ‘పింక్’ సందేశం మిస్సయ్యాడు.