‘వకీల్ సాబ్’ తర్వాత ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మూవీ ‘లవ్ స్టోరీ’. దీని విడుదల తేదీ ఏప్రెల్ 16. అంటే వచ్చే శుక్రవారం. ఓహ్ బేబీ, వెంకీ మామా, మజిలీ సినిమాలతో 2019 లో రూటులో పడ్డ అక్కినేని నాగార్జున, రెండేళ్ల తర్వాత కన్పిస్తున్న మూవీ లవ్ స్టోరీ. ఇందులో సాయిపల్లవి హీరోయిన్. శేఖర్ కమ్ముల దర్శకుడు. సాయి పల్లనితో నాగ చైతన్య నటించడం ఇదే మొదటి సారి. అయితే ఇప్పుడు ప్రేక్షకులకి నిరాశపర్చే అప్డేట్ ఏమిటంటే, ఇది 16 తేదీన విడుదల కావడం లేదు.
లవ్ స్టోరీ నిర్మాతలు తెలుగు రాష్ట్రాలు – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కరోనావైరస్ మహమ్మారి పరిస్థితి కారణంగా ఏప్రిల్ 16 న విడుదల చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, మే 7 వ తేదీన వుండ వచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం లాక్ డౌన్, 50 శాతం సీటింగ్ ఆంక్షలు వంటివి లేకపోయినా, కోవిడ్ పరిస్థితి చూసి ప్రేక్షకులు సినిమాలకి వెళ్ళడం తగ్గింది. అటు తమిళనాడులో నేటి నుంచి 50 శాతం సీటింగ్ ఆంక్షలు విధించేశారు. దీంతో నిన్న విడుదలైన ధనుష్ నటించిన ‘కర్ణన్’ కి దెబ్బ పడింది. ఇది నిన్న సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.జాతీయ మీడియా కూడా దీన్ని ఆకాశానికేత్తేసింది. తీరా ఇప్పుడు థియేటర్లతో పరిస్థితి ఇలా మారింది.
మే 7వ తేదీకైనా లవ్ స్టోరీ విడుదలయ్యే పరిస్థితి వుంటుందా? 50 శాతం సీటింగ్ ఆంక్షలు మెడ మీద కత్తిలా వేలాడుతోంది. కోవిడ్ పరిస్థితి ఇలాగే వుంటే ప్రేక్షకులు కూడా రిస్కు తీసుకోరు. చూద్దాం ఏం జరుగుతుందో. లవ్ స్టోరీ లో ఇంకా చిత్రంలో ఈశ్వరీ రావు, దేవయాని, రాజీవ్ కనకాల సహాయక పాత్రల్లో నటించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సంగీతం పవన్ సిహెచ్, విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు.