ప్రధాన మంత్రి నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ లాక్ డైన్ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినా, దేశమంతా లాక్ డౌన్ భయం పీడిస్తూ ఉంది. లాక్ డౌన్ లేకపోయినా, కేసులు పెరిగే కొద్ది కరోనా వ్యాప్తి నివారణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగాఆంక్షలు విధిస్తున్నాయి.
కొన్ని చోట్ల బజార్లు కూడా పాక్షిక బంద్ పాటిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూసాధారణమవుతున్నది. నైట్ కర్ప్యూ విధించడం, సినిమా హాళ్లు, బార్లు, రెస్టరాంట్లు, హోటెళ్ల మీద ఆంక్షలు విధిస్తే లక్షాది మంది వలస కూలీలకు జీతాలు తగ్గించడమో, కొందరిని ఉద్యోగాలనుంచి తొలగించడమే చేస్తారు.ఈ సంక్షోభం మొదలయింది. దీనితో ప్రధానమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా వలస కూలీలలో నమ్మకం కుదరడం లేదు. పరిస్తితి అంతిమంగా లాక్ డౌన్ దాకా వస్తుందని, అపుడు తాము తమ తమ వూర్లకు పారిపోవలసి వస్తుందని కూలీలు సర్వత్రా భయపడుతున్నారు. ముఖ్యంగా ఇపుడు లాక్డౌన్ అమలులో ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలనుంచి కూలీల వలస ప్రారంభమయిందని వార్తలు వస్తున్నారు.
గత ఏడాది ఇదేసమయంలో లాక్ డౌన్ విధించడం లక్షలాది మంది కూలీలు నానా అగచాట్లు పడి వందలకిలో మీటర్లు నడచుకుంటూ వూరి బాటపట్టారు. దారి పొడుగునా ఆకలితో అలమటించారు. అనేక మంది ప్ర మాదాలలో చనిపోయారు. ఈ పీడ కల ఇపుడు కూడా గుర్తొచ్చి, ఢిల్లీ, ముంబై వంటటి పట్టణాలనుంచి వలస కూలీలు మళ్లీ ఇంటి ముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వూర్లకు వెళ్లిపోతున్న కూలీలతో ఢిల్లీ ఆనంద్ విహార్ బస్ టర్మినల్ కిటకిటలాడుతూ ఉంది.మరొక లాక్ డౌన్ వచ్చే ప్రమాదం కనపడుతూ ఉందని, అందుకే అదొచ్చే దాకా ఉండకుండా వెళ్లిపోతున్నామని వాళ్లు చెప్పారు. చివరి క్షణంలో పరుగుపెట్టి, డబ్బుల్లేక, తిండి లేక, వూర్లకు చేరుకునేందుకు రవాణా సౌకర్యం లేక కష్టాలు పడకుండా ఇపుడు తాము ముందుగా జాగ్రత్తపడుతూ వెళ్లిపోతున్నామని వారు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అంక్షలు విధించడం, రాత్ర్రిపూట కర్ఫ్యూ విధించడంతో లాక్ డౌన్ భయం మొదలయింది. ఢిల్లీ లో రాత్రి పది నుంచి ఉదయం అయిదువరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇది ఏప్రిల్ నెలాఖరు దాకా ఉంటుంది.
పుణేలో బార్లు, రెస్టారంట్ల, హోటెళ్లను మూసేస్తున్నందున కనీసం 50 శాతం మంది కూలీలు తమ తమ వూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పుణే హోటెలియర్స్ అసోసియేషన్ తెలిపింది.
హైదరాబాద్ లో బేగం బజార్ స్వచ్చందంగా కరోనానివారణ ఆంక్షలు పాటిస్తూ మార్కెట్ ని సాయంకాలమే మూసేయాలని నిర్ణయించారు. ఈ బజార్లో సాయంకాలం పూట వ్యాపారం జోరుగా సాగుతుంది. దానివదులుకుంటూ ఆంక్షలు విధించాలనుకోవడం ఇది గొప్ప నిర్ణయమే అయినా, అది కూలీల బతుకుదెరువు మీద ప్రభావం చూపుతుంది. కోర్టు ఆదేశించినట్లు తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లలాగానే బార్లు, రెస్టరాంట్లను మూసేయడమో, రాత్రి పూట 9 గంటలకే బంద్ చేయడమో చేస్తే ఏమవుతుంది?
మహారాష్ట్ర లో కరోనా కేసులు రోజూ 60 వేల దాకా కనబడుతున్నాయి.దీనితో మంగళవార నుంచి నైట్ కర్ఫ్యూ మొదలయింది. దీనితో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వీళ్లంతా ఉత్తర ప్రదేశ్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేందు రైల్వేస్టేషన్లలో క్యూ కట్టారు.
పోసిటివ్ కేసులు పెరుగుతున్నందున భయంతో ప్రజలు మొదట మాల్స్ కి, రెస్టరాంట్లకు, హోటళ్లకు, బార్లకు రావడం మానేస్తారు. దీని బిజినెస్ పడిపోతుంది. కార్మికులను, ఉద్యోగులను తగ్గిస్తారు. ఉన్నవారికి జీతాలుకట్ చేస్తారు.వలస కూలీలను రేషన్ కార్డులుండవు, వారికి పెన్షన్లు ఉండవు కాబట్టి, ఈ వూర్లో కష్టపడటం కంటే, సొంతవూరు పోతేనే మంచిదని భావిస్తారు. ఈఆలోచన వస్తే చాలు వాళ్లంతా వెళ్లిపోవడం మొదలువుతుంది. ఇది లాక్ డౌన్ లేకపోయినా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
దీన్నుంచి తప్పించుకోవాలనుకుంటే ప్రభుత్వాలు వెంటనే కూలీలు వెనక్కివెళ్లిపోకుండా వాళ్ల కు ఉపాధి హామ కల్పించడం, టీకాలు వేయడం మొదలుపెట్టి భరోసా ఇవ్వాలి.
(ఫీచర్డ్ ఫోటో గత ఏడాది నాటిది)