(నాదెండ్ల మనోహర్)
ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతో జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై అధికార పక్షంవాళ్లు దాడులకు, బెదిరింపులకు పాల్పడటం అత్యంత హేయకరమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం. తమకు ఎదురే నిలబడకూడదనే వైసీపీ వాళ్ళ ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడ్డ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గ్రామంలో శ్రీమతి చిలకం ఛాయాదేవి గారు ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోంది. ఎస్సీ వర్గానికి చెందినవారిని దుర్భాషలాడి, దాడి చేయడం వైసీపీ అధికార అహంకారాన్ని తెలుపుతుంది. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. ఆ దిశగా పోలీసు అధికారులు ఈ దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టానికి అనుగుణంగా పని చేసి ఎన్నికల సమయంలో పోలీసులు అధికార పక్షానికి అండగా నిలుస్తున్నారనే అపప్రధను తొలగించుకోవాలి.
ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ హడావిడిగా, తప్పుల తడకగా నిర్వర్తిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అమలాపురం నియోజకవర్గంలో సాకుర్రు గున్నేపల్లిలో జనసేన పార్టీ గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం ఎస్.ఈ.సి. నిర్లక్ష్య ధోరణిని తెలియచేస్తోంది. అధికార పక్షానికే వత్తాసు పలకాలి అనుకొంటే కేవలం వైసీపీ గుర్తును మాత్రమే వేసి బ్యాలెట్ పత్రాలు ఇవ్వాల్సింది.
(నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ సీనియర్ నేత)