వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మాంచి రోజు. ఎందుకుంటే ఇబ్బందిపెట్టే మూడు సమస్యలు పరిష్కారమయ్యాయి.
పార్టీ కార్యర్తలకు మొదటి ముఖ్యమయిన వార్త, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారనేది.
సాధారణంగా ముఖ్యమంత్రులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయరు. పూర్వమ్ ఉప ఎన్నికల్లో రూలింగ్ పార్టీలు తప్పనిసరిగా గెలిచేవి. అందుకే జాతీయనాయకులు గాని, ముఖ్యమంత్రులు గాని ప్రచారానికి వచ్చే వారు కాదు. ఇపుడు పరిస్థితి మారిపోయింది. గెలుపు తథ్యమయినా ఆధిక్యతలో రికార్డు సృష్టించాలనో,ఓటమి పొరపాటున కూడా ఎదురు కాకూడదనో ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తున్నారు.
ఉదాహరణకు తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందొక సారి వచ్చి హాలియాలో ప్రసంగించారు. ఇపుడు ప్రచారం మధ్యలో ఏప్రిల్ 14న మరొకసారి కెసిఆర్ హాలియా వస్తున్నారు. ఆయనకు రెండు సమస్యలున్నాయి. ఒకటి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడం, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడంతో బిజెపి అక్కడ విజృంభిస్తున్నది. అందువల్ల బిజెపికి మరొకఅవకాశం ఇవ్వరాదు. భారీ అధికత్య చూపించి బిజెపితో పాటు, విమర్శకులందరి నోర్లు మూయించాలని కెసిఆర్ అక్కడ ప్రచారం చేస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయానికివస్తే, తిరుపతి లోక్సభ సీటును నిలుపుకోవడం మే కాదు, మూడులక్షల వోట్ల మెజారిటీ తెచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందువల్ల జగన్ కూడారంగంలోకి దిగాల్సి వస్తున్నది. గత సారి 2019లో వైసిపి అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావుకి 2,28,376వోట్ల మెజారిటీ వచ్చింది. ఆయన కోవిడ్ తో మరణించడంతో ఇపుడు ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది. విపరీతంగా సంక్షేమపథకాలను అమలు చేసినందున ఈమెజారిటీ 3 లక్షలు దాటక పోతే ఎలా అని జగన్ గీత గీశారు.
ఇక వైసిపి కార్యకర్తలకు ఈ రోజు వచ్చినరెండో మంచివార్త, జడ్ పి ఎన్నికలను రేపుజరపాలని ఆంధప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులివ్వడం.
నిన్న సింగిల్ జడ్జి బెంచ్ ఎన్నికలకు 48 రోజు గడువు ఉండాలని, ఇది సుప్రీంకోర్టు నియమమని చెబుతూ ఏప్రిల్ 8న జరగాల్సిన ఎన్నికలమీద స్టే ఇచింది. దీనిని ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. కేసును 15 కు వాయిదావేస్తూ ఎన్నికలు జరపవచ్చని డివిజన్ బెంచ్ ఆదేశించింది . దీనితో రెండు మూడు రోజులుగా ఇళ్లిళ్లకు తిరిగి పంపంకాలు చేస్తున్న అభ్యర్థులు వూపిరి పీల్చుకున్నారు. ఈ ఉత్తర్వులతో వైసిపి కార్యకర్తలు, రూలింగ్ పార్టీ అభ్యర్థులు పండగ చేసుకుంటున్నారు.
ఇక మూడో వార్త, పార్టీ రెబెల్ ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిలు కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ని సిబిఐ కోర్టు తిరస్కరించింది.
జగన్ ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఆయన సిబిఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించినా విపరీతంగా వ్యతిరేక ప్రచారం వచ్చేది.
ఎందుకంటే, మొన్ననే బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ సునీల్ దేవ్ ధర్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్ కు ఎపుడైనా బెయిలు రద్దు కావచ్చని అన్నారు. ఢిల్లీకి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటం పెద్ద చర్చకు దారితీసింది. సునీల్ దేవ్ ధర్ కు ఎదైనా రహస్యసమాచారం తెలుసా? జగన్ బెయిల్ నిజంగానే రద్దవుతుందా అనే అనుమానం పార్టీలో మొదలయింది. ఈ స్టేట్ మెంట్ జాతీయ స్థాయిలో కూడా బాగా ప్రచారమయింది. మీడియా బాగా హైలైట్ చేసింది. అందువల్ల దీనిని పార్టీ విస్మరించలేకపోయింది.
ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డంతటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి దీనిని ఖండించాల్సింది. సునీల్ దేవ్ ధర్ ప్రకటన తర్వాత రఘురామ కృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి కలకలం సృష్టించారు. ఇపుడుకోర్టు ఈ పిటిషన్ ని స్వీకరించకుండా తిప్పిపండంతో వైసిపి నేతలు,కార్యకర్తులు నింపాదిగా ఊపిరిపీల్చుకోవచ్చు.