బాలీవుడ్ లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కోవిడ్ తో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. దేశంలో నిన్న ఆదివారం కోవిడ్ ఇన్ఫెక్షన్లు మొదటిసారిగా లక్ష దాటాయి. ముంబైలో రికార్డు స్థాయిలో 11 వేలు కొత్త కేసులు నమోదయ్యాయి. వెంటనే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం నైట్ కర్ఫ్యూతో పాటు, వారాంతపు లాక్డౌన్ ప్రకటించింది. కోవిడ్ బారిన పడ్డ అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం సోషల్ మీడియాలో “ముందు జాగ్రత్త చర్య” గా ఆసుపత్రి లో చేరినట్టు ప్రకటించాడు. దీనికి ముందు హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు.
అక్షయ్ కుమార్ ఇటీవల రామ్ సేతు షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ షూటింగు సందర్భంగానే కోవిడ్ వాత పడ్డాడు. అంతే గాక రామ్ సేతులో పనిచేస్తున్న 100 మంది సిబ్బందిలో 45 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు. బాలీవుడ్ లో మొదటి సారి షూటింగులో ఇంత భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ అవడం. 100 మందితో కూడిన సిబ్బందితో మద్ ఐలాండ్ లో రామ్ సేతు షూటింగు జరుగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బిఎన్ తివారీ ప్రకారం, పాజిటివ్ గా తేలిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేశారు. వీరిలో 40 మంది జూనియర్ ఆర్టిస్టులు కాగా, మిగతావారు అక్షయ్ మేకప్ టీం, వారి సహాయకులు. ఇప్పుడు షూటింగ్ నిరవధికంగా నిలిపివేశారు.