(టి.లక్ష్మీనారాయణ)
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన కాకుండా వెంకన్న ప్రస్తావన ఎందుకు?
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఓటు ఎందుకు వెయ్యాలి?
1. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వకుండా మోసం చేసినందుకు వేయాలా?
2. కడప ఉక్కు పరిశ్రమను ఎగ్గొట్టినందుకు వేయాలా?
3. రేణిగుంట సమీపంలోని మన్నవరం దగ్గర నిర్మాణంలో ఉన్న బి.హెచ్.ఇ.ఎల్.- ఎన్.టి.పి.సి. విద్యుత్ పరికరాల పరిశ్రమకు స్వస్తి చెప్పినందుకు వేయాలా?
4. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని చేతులు దులిపేసుకొన్నందుకు వేయాలా?
5. విశాఖపట్నంలో నెలకొల్పుతామన్న రైల్వే జోన్ డి.పి.ఆర్.కు కూడా ఆమోద ముద్ర వేయనందుకు వెయ్యాలా?
6. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డి.పి.ఆర్.-2కు ఆమోదం తెలియజేయకుండా ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డుతున్నందుకు వేయాలా?
7. విభజన చట్టం ప్రకారం చెల్లించాల్సిన రు.16,000 కోట్లు రెవెన్యూ లోటు పద్దు క్రింద కేవలం రు.3,900 కోట్లు చెల్లించి, మిగిలింది ఎగ్గొట్టినందుకు వేయాలా?
8. అమరావతి రాజధాని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసకర ఆలోచనలతో వివాదాస్పదం చేసి, నిర్మాణాన్ని ఆపేస్తే శంకుస్థాపన చేసిన మోడీ గారు ఛోద్యం చూస్తూ మౌనంగా ఉంటారా! రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాల భూములిచ్చిన రైతులు, మహిళలు, దళితులు 475 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తుంటే రాజధాని అంశం రాష్ట్ర పరిథిలోనిదని సన్నాయి నొక్కులు నొక్కుతూ మోడీ ప్రభుత్వం హైకోర్టులో రెండు సార్లు ప్రమాణ పత్రాలు దాఖలు చేసినందుకు వేయాలా?
9. అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణాన్ని అటకెక్కుంచినందుకు వేయాలా?
10. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో సమరశీల ఉద్యమం, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకొన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేలం వేసి అమ్మేస్తామని పదేపదే పునరుద్ఘాటిస్తున్నందుకు వేయాలా?
11. ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయమని దగా చేస్తున్నందుకు వేయాలా?
12. రెండు లక్షల కోట్ల విలువజేసే విభజన చట్టంలోని షెడ్యూల్ -9 & 10లో పేర్కొన్న ఉమ్మడి ఆస్తులను పంచనందుకు వేయాలా?
13. కరోనా ఉద్ధీపన పథకం పేరు చెప్పి విద్యుత్ సంస్కరణల ముసుగులో డిస్కామ్స్ ప్రయివేటీకరణ, పురపాలక మరియు కార్ఫోరేషన్స్ లో ఆస్తి పన్నులను పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వేయాలా?
14. రైతాంగ వ్యతిరేక మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్నా, 400 మంది రైతులు మరణించినా చలించనందుకు వేయాలా?
15. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా పెంచుతూ సామాన్యుడి వెన్ను విరిచినందుకు వేయాలా?
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన, చేస్తున్న మోడీ ప్రభుత్వానికి దిమ్మదిరిగేలా ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)