(చందమూరి నరసింహారెడ్డి)
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 8 న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సంచలనంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకొని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎన్నికల బహిష్కరణ ఎంతమేరకు సమంజసమన్నది చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పక్షాలు వారి వారి అభిప్రాయాలను ఎవరికి వారు సమర్థించుకొంటున్నారు. ఎన్నికల బహిష్కరణ పై ఎవరెన్ని చెప్పినా ,ఎంత సమర్థించుకోవాలనుకొన్నా , ఎన్ని కారణాలు చెప్పినా ప్రజాస్వామ్యం లో సరైన నిర్ణయం కాదన్నది మాత్రం వాస్తవం.
ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చూపిన కారణాలను ఓ సారి పరిశీలించి విశ్లేషణచేస్తే చంద్రబాబు చర్య తొందరపాటు చర్యగాను , చారిత్రాత్మక తప్పు గాను కన్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్త్రసన్యాసం మంచిదేనని ఆపార్టీలోకొందరు సమర్థించుకొంటున్నారు. అది వారికి వారు నచ్చజెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప సమర్థనీయం కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమీషనర్ గా ప్రమాణస్వీకారం చేసిన నీలంసహాని ఏకపక్షనిర్ణయం , ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు ప్రకటించారు.
కొత్త ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టిన రోజే ఎన్నికల నోటిఫికేషన్ జారీచేశారని, నోటిపికేషన్ జారీ చేశాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని అన్నారు.వాళ్లు తీసుకునే అప్రజాస్వామిక, ఆరాచక చర్యలకు మేం వెళ్లి ఆమోదముద్ర వేయాలా? అది ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ పార్టీల్ని అవమానించడం కాదా” అని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆమె ఏమైనా విశ్రాంత న్యాయమూర్తా అని ప్రశ్నించారు. ‘నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు. విశ్రాంత ఐఏఎస్ లు ప్రభుత్వ పెద్దల దగ్గర పనిచేసి ఉంటారు. కాబట్టి, వారు. ఎస్ఈసీలుగా ఉంటే నిష్పాక్షికంగా పని చేయలేరని, అందుకే విశ్రాంత న్యాయమూర్తి ఎస్ఈసీగా నియమించాలని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు నాలుగు వారాల ముందే కోడ్ అమల్లోకి తేవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి ప్రస్తుత ఎస్ఈసీ కట్టుబడరా? ఒక్కో ఎస్ఈసీకి ఒక్కో రూల్ ఉంటుందా? కోర్టు తీర్పులు ఇంత స్పష్టంగా ఉంటే ఇష్టానుసారం చేసే అధికారం ఎస్ఈసీకి ఎవరిచ్చారన్నారు? ఇలా అనేక కారణాలు చెబుతూ ఎన్నికల బహిష్కరణ విషయాన్ని చంద్రబాబు సమర్థించుకొంటున్నారు.
గత ఏడాది మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేశారు. కరోనా ఉదృతి కారణంగా అర్థాంతరంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. దీనిపై అధికార పార్టీ రాద్దాంతం చేయడం పలు వివాదాలు చెలరేగడం , కోర్టులకెక్కడం చాలా జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. నిమ్మగడ్డ ఆద్వర్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ఎక్కడ ఆగిందో అక్కడినుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగించి ఏలాంటి ఉద్రిక్త సంఘటనలు లేకుండా విజయవంతం చేశారు. ప్రభుత్వం కూడ సహకారాన్ని అందించినట్లు పదవీవిరమణ సందర్భంగా పేర్కొన్నారు. అప్పుడు లేని అభ్యంతరం పరిషత్ ఎన్నికల్లో ఎందుకొచ్చింది? పరిషత్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం లో ఏమేరకు సమంజసం?. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిన నాటికి కొన్ని స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. వాటి పై కోర్టు కెళ్లడం కోర్ట్ ఏకగ్రీవమయిన వారికి డిక్లరేషన్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితిలో రీ నోటిఫికేషన్ ఏలా ఆమోదయోగ్యమౌవుతుంది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడినుంచి ప్రారంభించడానికి నూతన ఎస్ ఈ సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చాక అఖిలపక్ష సమావేశం ఎందుకని ముందే ఏర్పాటు చేయవచ్చు కదా అన్నారు. ఆ విషయం ప్రశ్నించవచ్చు పోరాటం చేయవచ్చు తప్పులేదు. అందుకు ఎన్నికల బహిష్కరణ పరిష్కారం కాదు కదా. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పై హైకోర్టులో తెదేపా పిటిషన్ వేసిందని తెలిపావు అది నీ హక్కు . కోర్ట్ తీర్పు రాకనే ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకొన్నట్లు. ఇక విశ్రాంత న్యాయమూర్తిని ఏస్ ఈసీ గా నియమించకుండా మాజీ ఐఏయస్ ను నియమించడాన్ని కారణం గా చూపడం పద్దతిగాలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా సవరణలు చేసి మాజీ ఐఏఎస్ ను నియమించింది. నిమ్మగడ్డ ను మీరు నియమించినప్పుడు ఆయన మీ ప్రభుత్వం లో పనిచేసిన వారే కదా. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు నాలుగు వారాల ముందే కోడ్ అమల్లోకి తేవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయన్నారు . అలాంటప్పుడు ఇటీవల జరిగిన మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎందుకు ప్రశ్నించలేదు. వాటిని ఆమోదించి ఎన్నికల ప్రక్రియ లో ఎందుకు పాల్గొన్నారు. వాటి ఫలితాలు తాలూకు మీకు అనుకూలంగా లేనందున ఎన్నికల బహిష్కరణకు ఉపక్రమించారని విమర్శలు చేయడానికి ఎదుటి పార్టీలకు మీరే అవకాశం కల్పించారు.
ప్రజాస్వామ్యం లో ఎన్నికలే కీలకం
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేది ఎన్నికల్లో పాల్గొనడం కోసమే. ప్రజాక్షేత్రం లో పాల్లొని ప్రజాతీర్పును గౌరవించడం పద్దతి. గెలుపోటములు సహజం. ఓటమిని తట్టుకోగలగడమే నిజమైన విజయం. పరీక్షల్లో పాల్గొనడమే విద్యార్థి లక్ష్యం .ఫలితాలు ఎలాగైనా ఉండవచ్చు. ఫెయిల్ అయితామని భయంతో పరీక్ష హజరుకాకపోవడం ఆత్మహత్యాసదృశ్యమే.
40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని కొద్ది రోజులు కూడ పూర్తికాకనే తెలుగు దేశం పార్టీ కి భూస్థాపితం కావడానికి రోజులు దగ్గరపడ్డాయని ఆపార్టీ నే చెప్పకనే చెబుతోంది. ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవడానికి కాకమ్మ కబుర్లు చెబుతోంది. ఎన్నికల్లో జయాపజయాలను ఎదుర్కొనే సత్తా రాజకీయ పార్టీలకు ఉండాలి. ఆ సత్తా లేకపోతే కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం కోల్పోవడం ఫలితంగా పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. రాజకీయాల్లో హత్యలు ఉండవు .ఆత్మహత్యలే ఉంటాయి. నేడు తెలుగు దేశం చేసుకొన్నది కూడ అదే. ఓటమి ని తట్టుకొని తిరిగి ప్రయత్నం చేయగలిగినవాడే గొప్పవాడు. ఓటమికి భయపడి పోటీ నుంచి తప్పుకొంటే శాశ్వతంగా ఓటమిని అంగీకరించడమే. అలా అంగీకారాన్ని తెలిపినప్పుడు తెలుగు దేశం పార్టీ ఏదో ఒక పార్టీ లో విలీనం కాక తప్పదు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనకూడదన్న నిర్ణయంతో రాజకీయంగా పతనం ప్రారంభమైనట్లే. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని బెంబేలెత్తి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పలాయనం చిత్త గించడం టీడీపీ పాలిట ఆత్మహత్యా సదృశంగా మారుతోంది. టీడీపీలో ముసలం పుట్టి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. మండల ,గ్రామస్థాయినాయకులు ,కార్యకర్తలు పార్టీకి దూరమౌతారు. నిర్వీర్యం అవుతారు. పార్టీ అధ్యక్షుడు చేసిన నిర్ణయం సరైంది కాదనీ ఆపార్టీ నేతలే చెబుతున్నారు. నిర్ణయాన్ని ధిక్కరించి కొన్న చోట్ల స్థానిక నాయకులు ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పడం విభేదాలున్నట్లు ఒప్పుకోక తప్పదు. స్థానికంగా బలమున్న చోట్ల మీరు ఎన్నికల్లో పాల్గోనమని సంకేతాలున్నట్లు ఆపార్టీ పెద్దలు కొందరు చెబుతున్నారు . అదే వాస్తవమైతే పరోక్షంగా రాష్ట్రంలో తమ బలం సన్నగిల్లిపోయినందునే పోటీనుంచి తప్పుకొన్నట్లు సంకేతాలు వెళతాయి.
సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరై అసమ్మతి వ్యక్తం చేసి జిల్లా లో బలమైన స్థానాల్లో పోటీలోఉంటామని సంకేతాలిచ్చారు. జ్యోతుల నెహ్రూ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి నిరసన ప్రదర్శించారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న రాజకీయ పార్టీ ప్రాథమిక ధర్మాన్ని టీడీపీ విస్మరించింది.ఏలాగు అనుకూలఫలితాలురాని ఎన్నికల్లో ఎందుకు పార్టీ ధనం ఖర్చు చేయాలని ఆలోచించారని ఎదుటి పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి కోణంలో తెలుగు దేశం ఆలోచించి ఉంటే చాలా పెద్ద తప్పిదమే అవుతుంది.
చంద్రబాబు ఇక పార్టీని అధికారంలోకి తేవడం కల్లేనని శ్రేణులు నీరుగారిపోతారు. ఈ ఏడాది మార్పిలో జరిగిన మునిసిపల్ ఎన్నికలు చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన 11 మునిసిపల్ కార్పొరేషన్లను 75 మునిసిపాలిటీలలో 74 మునిసిపాలిటీ లను కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ చూడని ఫలితాలివి. ఈభగపాటును జీర్ణం చేసుకోవడం ఎవరికైనా కొంత కష్టమే కావచ్చు అలాగని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను బహిష్కరించండం పరిష్కారం కాదు.
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న 660 మండల పరిషత్ ల్లో ఏలాగు అభ్యర్థులున్నారు. పోరాటం చేసి ఏదో ఒకమేరకు గెలుపు సాధించాలి. క్యాడర్ ను నిలుపుకోవాలి.అలాకాకుండా విశ్వాసం సన్నగిల్లిపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఏ పార్టీ అయినా తమ కార్యకర్తలను కాపాడుకోగలదు. అందుకే గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. అందుకు భిన్నంగా చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయిం టీడీపీకి రాజకీయంగా ఆత్మహత్యా సదృశమనని, చారిత్రక తప్పిదమని విశ్లేషకులు తేల్చి చెబు తున్నారు.
(ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)