పానిండియా స్టార్ ప్రభాస్ కొత్త న్యూస్ తో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు. హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన యాక్షన్ హిట్ ‘రాంబో’ రీమేక్ లో నటించేందుకు అంగీకరించినట్టు బాలీవుడ్ నుంచి న్యూస్. దీంతో ప్రభాస్ పానిండియా ఫ్యాన్స్ కి పట్టరాని జోష్ వచ్చింది. ప్రభాస్ గురించి ఏ కొత్త విషయం తెలిసినా జోష్ తో వూగిపోవడం వీళ్ళకి అలవాటే. నిజానికి ‘రాంబో’ రీమేక్ లో బాలీవుడ్ యాక్షన్ స్టార్, జాకీ ష్రాఫ్ కొడుకు, టైగర్ ష్రాఫ్ నటించాల్సింది. కానీ ఒప్పుకున్న నాల్గు సినిమాలతో డేట్లు కుదరక ఈ రీమేక్ నుంచి తప్పుకున్నాడు. టైగర్ ష్రాఫ్ గణపథ్ పార్ట్ 1, 2, హీరోపంతి 2, బాఘీ 4 లకు డేట్స్ ని లాక్ చేయడంతో, కనీసం 2023 వరకు ‘రాంబో’ లో నటించే పరిస్థితి లేదు. అందుకని తప్పుకున్నాడు.
దీంతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ‘రాంబో’ రీమేక్ కి పానిండియా అప్పీల్ వుంటుందని ప్రభాస్‌ని సంప్రదించాడు. ప్రభాస్ లాంఛనంగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నాల్గు పానిండియా సినిమాలతో బిజీగా వున్న విషయం తెలిసిందే. ఇవి పూర్తయ్యాకే ‘రాంబో’ రీమేక్ లో నటిస్తాడు. సిద్ధార్థ్ కూడా వేచి వుండేందుకు సిద్ధమయ్యాడు. షారుఖ్ ఖాన్ తో తను దర్శకత్వం
వహిస్తున్న ‘పఠాన్’ ని ఇంకా పూర్తి చేయాల్సి వుంది.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం వుంది. సిల్వెస్టర్ స్టాలోన్ హాలీవుడ్ కల్ట్ యాక్షన్ డ్రామా ‘రాంబో’ కథతో ఇదివరకే తెలుగులో సినిమా వచ్చింది. ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో 1983 లో చిరంజీవితో ‘ఖైదీ’. ఇది చిరంజీవిని స్టార్ గా మార్చేసింది. పరుచూరి బ్రదర్స్ రచన చేసిన ఈ మ్యూజికల్ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో అతి పెద్ద సంచలనం. ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూనే వుంటారు.
అయితే దీని హాలీవుడ్ టైటిల్ ‘రాంబో’ కాదు, ‘ఫస్ట్ బ్లడ్’. రాంబో అనేది ఇందులో నటించిన స్టాలోన్ పాత్ర పేరు. ఇది 1982 లో విడుదలైంది. దీనీ సీక్వల్ గా, 1985 లో ‘: ఫస్ట్ బ్లడ్ పార్ట్ టూ’ అని 1985 లో వచ్చింది. మరో సీక్వెల్ గా ‘రాంబో 3’ 1988 లో వచ్చింది. మరో సీక్వెల్ గా ‘రాంబో’ అని 2008 లో విడుదలైంది. ఇది బర్మా రాజకీయ నేపథ్యంలో వుంటుంది.
ఇప్పుడు ప్రభాస్ తో రీమేక్ ఏ రాంబో అయివుండొచ్చు అంటే మొదటిదే అయివుంటుందని వూహించవచ్చా? పోతే ఒక్కో పానిండియా మూవీకి ప్రభాస్ పొందుతున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా 100 కోట్లు! ఇది ఇండియాలోనే టాప్.