‘’ఉద్యోగాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విద్యార్ధి, నిరుద్యోగ వ్యతిరేక వైఖరికి సునీల్ నాయక్ బలైపోయాడు. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్యే’ ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ అని ఆరోపించారు
నిరుద్యోగంతో బాధపడి,తెలంగాణలో ఉద్యోగం వస్తుందన్న ఆశ సన్నగిల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసి గతవారం రోజులుగా నిమ్స్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి, చివరికి నిరుద్యోగి సునీల్ నాయక్ ప్రాణం కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్ లో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శ్రవణ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
‘’తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న సంఘనటలు మనకు తెలుసు. కానీ నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న చరిత్ర చూస్తున్నాం. దీనికి కారణం సీఎం కేసీఆర్ కాదా? దయచేసి తెలంగాణ సమాజం ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి, అని దాసోజు శ్రవణ్ కోరారు.
‘’గత పదిరోజులుగా చూసుకుంటే గజ్వేల్ లో కొప్పుల రాజు అనే యువకుడు నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ లో గొల్ల నరేష్ అనే మరో యువకుడు నిరుద్యోగం కారణంగా నిరాశతో ఆత్మ బలిదానం చేసుకున్నాడు. చక్కగా చదువుకొని గొప్ప భవిష్యత్ కోసం కలలుగన్న సునీల్ నాయక్ నిరుద్యోగంతో ఆత్మహత్యకు పాల్పడి వారం రోజులుగా చావుబ్రతుకులతో పోరాడి చివరి కన్నుమూశాడు. ఇవేవీ ఆత్మ హత్యకాదు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేసిన హత్య’’ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నదని ఆయన అన్నారు.
ఎందుకింత శాడిజం?
తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పది రోజుల్లో ముగ్గురు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ? లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదు ? తెలంగాణ ఉద్యమ సమయంలో చెట్లకు ఉరి వేసుకున్న విద్యార్ధి, నిరుద్యోగల శవాలు గుర్తుకు రావడం లేదా కేసీఆర్ ? రెండువందల కీ.మీ వేగంతో వస్తున్న రైళ్ళకు ఎదురెళ్ళి రైళ్ళని గుద్దుకొని చనిపోయిన వారి రక్తపు మడుగులు, శవాల ముక్కలు గుర్తుకు రావడం లేదా ? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని పెట్రోల్ పోసుకొని చనిపోయిన విద్యార్ధుల చితి మంటలు గుర్తుకు రావడం లేదా కేసీఆర్ ? ఎందుకింత శాడిజం ? ఎందుకింత దాష్టికం ? అని ప్రశ్నించారు దాసోజు.
‘’తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్ ఆస్తులు అడగడం లేదు. ఫాం హౌస్ కావాలని కోరడం లేదు. తమకు రాజ్యంగా బద్దంగా రావాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నారు. ఉద్యోగ కల్పన రాజ్యంగ భాద్యత. ఆ భాద్యతని మర్చిపోయి కేసీఆర్ తన శాడిజంని చూపిస్తున్నారు. ఇది కేసీఆర్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ. కేసీఆర్ ఉన్మాదానికి పరాకాష్ట’’ అని ద్వజమెత్తారు దాసోజు.
‘’కేసీఆర్ కూర్చున్న ప్రగతి భవన్ మొత్తం తెలంగాణ ఉద్యమకారుల చెమట నెత్తురు నిర్మితమైయింది. అలాంటి ప్రగతి భవన్ లో కూర్చుని కేసీఆర్ తింటున్న ప్రతి ముద్దా కూడా విద్యార్ధి, నిరుద్యోగ, అమరవీరుల రక్తంముద్ద అనే నిజం గుర్తుపెట్టుకోవాలి. భాద్యత తెలుసుకొని ఉద్యోగాలు కల్పించాలి.’’ అని డిమాండ్ చేశారు దాసోజు.
బిడ్డకు ఉద్యోగం లేకపోతే విలవిల్లాడిన కెసిఆర్
కేసీఆర్ బిడ్డ కవితకు ఆరు నెలలు ఉద్యోగ లేకపోతే విలవిలలాడి కిందామీద పడి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇప్పించారు. మరి తెలంగాణ బిడ్డలు మీ కంటికి కనిపించడం లేదా ? వాళ్ళకి ఉద్యోగాలు రావద్దా ? ఏడేళ్ళు గడిచిపోయాయి. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఎందుకు భర్తీ చేయడం లేదు. ఏం పాపం చేసుకున్నారు తెలంగాణ బిడ్డలు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కేసీఆర్’ అని సుచించారు దాసోజు. ఉద్యోగ కల్పనపై కేసీఆర్ సర్కార్ కి ఒక పాలసీ అంటూ ఉందా ? ఒక ప్రణాళిక ఉందా ? ఉద్యోగాలు కల్పించడం మీకు చేతకాకపోతే ఒక్క వారం రోజులు అధికారం మాకు ఇవ్వండి. ఖాళీగా వున్న లక్షల ఉద్యోగాలని వారంలో రోజుల్లో భర్తీ చేసి చూపిస్తాం.’’ అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు దాసోజు.
తెలంగాణ కలల్ని నాశనం చేసిన కేసీఆర్
తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులు, యువత రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఏడేళ్ళు పోరాటం చేశారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్ళు అవుతున్నా ఉద్యోగాలు కల్పించక శాడిజం చూపిస్తున్నారు కేసీఆర్. పద్నాలుగు ఏళ్ళు పాటు తెలంగాణ బిడ్డల జీవితాల్ని నాశానం చేశారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధి, నిరుద్యోగుల శవాల్ని మోసుకుంటూ గన్ పార్క్ దగ్గర వుంచినపుడు ‘తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి దుస్థితి రావద్దు. అందరికీ ఉద్యోగాలు రావాలి. తెలంగాణ బిడ్డల భవిష్యత్ బంగారం కావాలి’’ అని కలలు కన్నవాడిలో నేను ఒకడ్ని. కానీ నేడు కేసీఆర్ ఆ కలలన్నీ బూడిద చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.
కేసీఆర్ డ్రామాని ప్రజలు గ్రహించాలి
‘’కేసీఆర్ భాద్యత రాహిత్యనికి టీఎస్పీయస్సీ అద్దం పడుతుంది. ఎలా అంటే.. టీఎస్పీయస్సీ లో చైర్మన్ లేరు. మెంబర్లు లేరు. కనీస కోరం లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చే అర్హత వుండదు. భర్తీ చేయడం కుదరదు. ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ డ్రామాలాడుతున్నారు. నాలుగు లక్షల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వుండగా యాబై వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశారు. దానికి కూడా అతిగతి లేదు. ఉద్యోగాలు కల్పించాలానే చిత్తశుద్ధి కేసీఆర్ కి లేదు. కేవలం ప్రజలని మభ్య పెడుతూ ఉన్మాద ఆనందం పొందే వ్యక్తి కేసీఆర్’’ అని ధ్వజమెత్తారు దాసోజు.
కేటీఆర్ కి దొంగ లెక్కలు మాత్రమే తెలుసు
‘’టీఎస్ ఐ పాస్ మీద మేము 15లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ దొంగ లెక్కలు చెప్పడం అందరికీ తెలుసు. కేటీఆర్ కి సూటి ప్రశ్న .. టీఎస్ ఐ పాస్ మీద మేము 15లక్షల ఉద్యోగాల్లో ఎంత మంది తెలంగాణ బిడ్డలు వున్నారు ? దీనికి మాత్రం సమాధానం చెప్పరు. చర్చకు రమ్మంటే రారు. కేటీఆర్ కేవలం దొంగ లెక్కలు మాత్రం చెప్తారు’’ అని మండిపడ్డారు దాసోజు.
కాంగ్రెస్ పార్టీ మీకు అండగా వుంది:
తెలంగాణ విద్యార్ధి, నిరుద్యోగులకు విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా వుంటుంది. మీ కోసం పోరాడుతుంది. మీకు ఉద్యోగాలు వచ్చే వరకూ కొట్లాడుతుంది. రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేయదో చూద్దాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రులు, ప్రజా ప్రతినిధులని నడిరోడ్డుపై కాలర్ పట్టుకొని ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదిద్దాం. కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాదిద్దాం. దయ చేసి ఆత్మబలిదానాలు మాత్రం ఎవరూ చేసుకోవద్దు’’ అని చేతులు జోడించి కోరారు దాసోజు.