‘మన్మథుడు 2’ తర్వాత కింగ్ నాగార్జున నటించిన టెర్రరిజం థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ ఏప్రెల్ 2 వ తేదీ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ వారం విడుదలవుతున్న తెలుగు మూవీ ఇదొక్కటే. ఇది కాక ఏకంగా నాలుగు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళ కన్నడ ఇంగ్లీషు డబ్బింగులు.
ఏప్రెల్ 1 వ తేదీన పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ డబ్బింగ్ ‘యువరత్న’ విడుదల కాబోతుండగా, 2 వ తేదీ కార్తీ నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్’ వస్తోంది. ఈ రెండు సినిమాలు ఒరిజినల్స్ తో బాటే అదే రోజున తెలుగులో విడుదల వుతున్నాయి. కాగా, ఏప్రెల్ 2 వ తేదీనే ఇప్పటికే తమిళంలో విడుదలైన విజయ్ సేతుపతి, నిహారిక నటించిన తెలుగు డబ్బింగ్ ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ విడుదలకి సిద్ధం చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
అలాగే హాలీవుడ్ మూవీ ‘లెగసీ ఆఫ్ లైస్’ను కూడా నెట్ 5 సంస్థ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 2న రాబోతోంది. స్కాట్ ఆడికిన్స్, యూలియా, అన్నా బత్కెవిచ్, ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. దీన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఏజెంట్ ఎం-6’ పేరుతో విడుదల చేస్తున్నారు.
ఇలా నాగార్జున ‘వైల్డ్ డాగ్’తో పాటు నాలుగు డబ్బింగ్ సినిమాలు విడుదల వుతున్నాయి. ఈ డబ్బింగుల్లో కార్తీ నటించిన సుల్తాన్ కి ఎక్కువ ఓపెనింగ్స్ వుండొచ్చు. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. ‘వైల్డ్ డాగ్’ తో దీనికి పోటీ వుంటుందనడం కరెక్టు కాదు గానీ, దీని కలెక్షన్లు దీనికుంటాయి, దాని కలెక్షన్లు దాని కుంటాయి.
పోతే ఇదే ఏప్రిల్ 2నే ఇంకో తెలుగు మూవీ రావాల్సి వుంది. గోపీచంద్ – తమన్నాలు నటించిన ‘సీటీమార్’ మాస్ మసాలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.