బాలీవుడ్ లో వరుసగా కోవిడ్ నటులు కొలువు దీరుతున్నారు. ఈ వరుసలో తాజాగా ఈ రోజు పరేష్ రావల్ చేరిపోయాడు. ఈయన కేసు విచిత్రమైనది. వాక్సిన్ వేసుకున్న కొద్ది రోజులకే కోవిడ్ బారిన పడ్డాడు. వెంటనే ‘దురదృష్టవశాత్తూ నేను కోవిడ్ 19 పాజిటివ్ కి సర్టిఫై అయ్యాను. గత 10 రోజులుగా నాతో సన్నిహితంగా వున్న వారందరూ కోవిడ్ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నానని మార్చి 9 న విజయ చిహ్నం చూపిస్తూ గర్వంగా ట్వీట్ చేశాడు. ఈ రోజు కోవిడ్ బాధితుడినని ట్వీట్ చేశాడు.
మార్చి 24 న అమీర్ ఖాన్ కోవిడ్ పాజిటివ్ రిపోర్టు చేశాడు. అదే రోజు మాధవన్ కూడా పాజిటివ్ నని ట్వీట్ చేశాడు. మార్చి 22న కార్తీక్ ఆర్యన్ పాజిటివ్ అయ్యాడు. వారం రోజుల్లో మొత్తం నల్గురయ్యారు. ఇది సెకండ్ వేవ్ సంగతి. కోవిడ్ మొదటి వేవ్ లో బాలీవుడ్ నటుల సంఖ్య ఎక్కువుంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, నీతూ కపూర్, కణికా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, కృతీ సానన్, జెనీలియా, మలైకా అరోరా…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా వుంది. ఇక బాలీవుడ్ నిర్మాతలూ ఇతర ప్రముఖులూ సరేసరి. అయితే అదృష్టమేమిటంటే అందరూ కోలుకున్నారు.