ఆంధ్రాలో భారత్ బంద్ విజయవంతం

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ప్రతిపాదను మానుకోవాలని నేడు ఆంధ్రలో జరుగుతున్న భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతునీయడంతో బంద్ విజయవంతమయింది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.  అవి డిపోలకే పరిమితమయ్యాయి.వాణిజ్య, వర్తక సంఘాలు,విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలిపాయి.

తెల్లవారుజాము నుంచే రాజకీయ పార్టీల నేతలు  రోడ్లెక్కి బంద్  నిర్వహిస్తూ  నిరసనలు తెలుపుతున్నారు.

విశాఖపట్నంలో భామద్దిలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకొన్నారు. దీంతో బస్సులు నిలిచిపోయాయి.

విబెజవాడలో భారత్ బంద్‌లో ప్రభావం ఉదయం 6.00గంటల నుండే కనిపిస్తూ ఉంది.   పండిట్ నెహ్రు బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగి బంద్ పాటించేలా చేస్తున్నారు.   వాణిజ్య, వర్తక సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపి దుకాణాలు, మాల్స్  మూసేశారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు, వ్యాపారాలు బంద్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉంది.

అనంతపురం జిల్లా అనంతలో  భారత్ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.  మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రోడ్లపైకి రానున్నాయి. భారత్ బంద్‌కు టీడీపీ మద్దతు తెలిపింది. ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ వద్ద బంద్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి పాల్గొన్నారు.

గుంటూరు,పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కడప తదితర  జిల్లాలలో కూడా బంద్ విజయవంతగా  కొనసాగుతోంది.  ఆర్టీసీ బస్సులు  బయటకు రావడం లేదు.  హోటల్స్,  వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు,  ప్రభుత్వ పాఠశాలలు , కాలేజీలకు  మేనేజ్ మెంట్లు సెలవు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *