ఈ రోజు విడుదలైన ‘అరణ్య’ కి ఏవరేజి రిజల్ట్ వచ్చింది. ఏడాది కాలంగా వూరించిన రానా పానిండియా మూవీ ‘అరణ్య’ తీరా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో అంతగా లేదు. సినిమాలనేవి అయితే హిట్, కాకపోతే ఫట్ తప్ప ఇంకో యావరేజి కేటగిరీ లేదనే టాలీవుడ్ నిర్వచనం ప్రకారం ఛూస్తే, ‘అరణ్య’ ని ఏ కేటగిరీ లో చేర్చాలో అర్ధం జేసుకోవచ్చు. దీనికి కారణమేమిటంటే, సరైన కథ లేకపోవడమే. భారీగా విజువల్ హంగామా మీద తప్ప కథ మీద దృష్టి పెట్టకపోవడమే. రానా పాత్రని అద్భుతంగా సృష్టించారు నిజమే గానీ, ఆ పాత్రకి తగ్గ పని లేదు సినిమాలో.
అడవులో నేపథ్యంలో జరిగే ఈ కథలో, మంత్రి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అడవిలో టౌన్ షిప్ నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తాడు. దీన్ని అడ్డుకుంటూ ఏనుగుల సంరక్షకుడు రానా పోరాటం ప్రారంభిస్తాడు. కథ మామూలుదే . దీని కథలా ఆసక్తికరంగా చెప్పలేక పోయాడు దర్శకుడు సాల్మన్ ప్రభు. ఏనుగులతో, పక్షులతో, ఇతర జంతువులతో, చెట్లతో రానా సెంటిమెంట్ సీన్లు తప్ప అసలు కథ కనుమరుగైంది. కథలో సమస్య తాలూకు ఎమోషన్ అదృశ్యమైంది. జంతువులతో అటవీ విహారంగా చూసేందుకే సినిమా మిగిలింది. మొదటి అరగంట ఈ విహారం ఇంకో ప్రపంచంలోకి తీసి కేళ్తుంది అంతవరకే. కొన్ని ముఖ్య పాత్రలు సెకండాఫ్ లో కనిపించవు. కథనం అలా వుంది.
2019 మార్చిలో బాలీవుడ్ నుంచి విద్యుత్ జామ్వాల్ తో ‘జంగ్లీ’ అనే ఫారెస్ట్ మూవీ వచ్చింది. ఏనుగుల్ని సంహరించే ఏనుగు దంతాల స్మగ్లర్స్ ని ఎదుర్కోవడం గురించి కథ. దీనికి కూడా యావరేజి ఫలితమే. 20 కోట్ల బడ్జెట్ కి 24 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ‘అరణ్య’ త్రి భాషా చిత్రం బడ్జెట్ 60 కోట్లు. దీని తెలుగు, తమిళం బాక్సాఫీసు ఫలితం ఈ వారాంతంలో తేలుతుంది. హిందీ విడుదల వాయిదా పడింది.