(వడ్డేపల్లి మల్లేశము)
భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు 58 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రాష్ట్రాలలో 60 సంవత్సరాల వరకు ఉన్న మాట కూడా వాస్తవమే. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు సంబంధించిన నిర్ణయం చేసేటప్పుడు రాష్ట్ర బడ్జెట్, నిరుద్యోగులు సంఖ్య,వారికి ఉపాధి కల్పించడం, పేదరికము వంటి అనేక అంశాలు కొలమానాలుగా భావించాల్సి ఉంటుంది.
కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలు ఏవి పట్టించుకోకుండా, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయకపోయినా కేవలం రెండవ సారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కారణంగా మాత్రమే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు గా ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఏ వర్గ ప్రయోజనం కోసమో అర్థం కావడం లేదు.
ఉద్యోగ విరమణ వయస్సు
మన రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ రంగంలో మూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక అంచనా. ఉద్యోగ అర్హత వయసుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు కూడా శాస్త్రీయంగా నిర్ణయించబడి ఉన్నది. ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాలలో కూడా తెలంగాణతో సహా ఉద్యోగ అర్హత వయస్సును పెంచి చివరి దశలో ఉన్నటువంటి అనేక మంది అర్హులైన అటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు జరిగినవి.
కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా ఇంటికొక ఉద్యోగం పేరుతో ఎన్నికల సందర్భంగా ప్రకటించినప్పటికీ పోలీస్ డిపార్ట్మెం
ట్ లో తప్ప మిగతా రంగాల్లో ఉద్యోగాలను నామమాత్రంగానే భర్తీ చేసింది. ఇప్పటికి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
విశ్వవిద్యాలయ విద్యార్థులతో సహా పట్టభద్రులు, పాఠశాల, కళాశాల స్థాయి వరకే చదువుకున్న నిరుద్యోగ యువత, సకల జనుల, సబ్బండ వర్ణాల సహకారం పోరాట బాటతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన విషయాన్ని టిఆర్ ఎస్ ప్రకటించింది ఈ సహకారాన్ని పొందిన టిఆర్ఎస్ పార్టీ తన ఏలుబడిలో నియామకాలను కొనసాగించి తెలంగాణ యువతకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ వైపుగా ఒక్క అడుగు కూడా పడలేదు.
గత 23 సంవత్సరాలుగా ఉద్యోగ వర్గంలో తరచుగా పత్రికల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60, 61 సంవత్సరాలకు పెంచనున్నట్లు పలుమార్లు పత్రికలు టీవీల లో కథనాలు వస్తూనే ఉన్నవి. కానీ బుద్ధి జీవులైన ఉద్యోగ సంఘాలు ,ఉపాధ్యాయ సంఘాలు ఏనాడు కూడా తాము కోరని ఉద్యోగ విరమణ వయసు పెంపుదల సరికాదని, నిరుద్యోగ యువతకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకు పోయిన దాఖలా లేదు.
ప్రభుత్వ ప్రకటన అంతరార్థం ఏమిటి?
ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు జరిపిన ప్రతిసారి కూడా ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచనున్నట్లు ప్రకటన వెలువడుతున్నది. వేతన హెచ్చింపు తో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కంటెంట్ వర్కర్స్ వేతనాల పెంపుదలకు డిమాండ్ చేయడం మాని ఉద్యోగ విరమణ వయస్సు పెంపును విని విన్నట్లుగా నటిస్తూ, ప్రభుత్వం ప్రకటించే వరకు పట్టించుకోకపోవడమే కాకుండా ఇప్పటికి కూడా తమ సామాజిక నైతిక బాధ్యతను గుర్తించినట్లుగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కనబడడం లేదు.
సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా ఒకవైపు చెప్పబడుతూ ఉంటే ఉద్యోగంలో ఉన్న వారికే మరొక మూడు సంవత్సరాలు ఉద్యోగ విరమణ పెంచడం లో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించగా పోవడాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వ పెంపుదలకు మీరే బాధ్యులు అని హెచ్చరిస్తున్నారు కూడా.
మరొకవైపు రాబోయే మూడు సంవత్సరాలలో దాదాపుగా 30 నుండి 40 వేల మంది వరకు ఉద్యోగులు విరమణ చేసే అవకాశం ఉంది. వారికి దాదాపుగా అరవై వేల నుంచి లక్ష కోట్ల వరకు ఉంటాయి. ప్రభుత్వ లోటు బడ్జెట్ సాకుతో ఉద్యోగ విరమణ వయస్సును పెంచి బాధ్యత నుండి తప్పించుకోవడానికి చేసిన ఎత్తుగడగానే దీనిని భావించాలని అనేకమంది మేధావులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
సామాజిక బాధ్యత మరచిన ప్రభుత్వం
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాలలో మిగతా కిందిస్థాయిలో చదువులు పూర్తి చేసినటువంటి అర్హులైన నిరుద్యోగులు ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అనేకమంది నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు మనకు ఒక వైపు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు పార్టీ కార్యకర్తలు కూడా విశ్వవిద్యాలయాలలో కి ఏనాడు కూడా వెళ్ళిన దాఖలా లేదు.
అంటే నిరుద్యోగ యువతని విశ్వవిద్యాలయాల విద్యార్థులందర్నీ కూడా ప్రభుత్వము శత్రువులుగా చూసి కక్షసాధింపు గానే వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టకపోవడం జరుగుతున్నది.
ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం తోపాటు ఉద్యోగాలకు అర్హులైన వారికి అవకాశాలను కల్పించేందుకు ఖాళీలను భర్తీ చేసి ఉపాధి కల్పించ వలసిన సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉన్నది.
కానీ ఇప్పటికీ స్పష్టమైన విధానం లేదు. ఈ కారణంగా కారణంగా అనేక మందికి ఉద్యోగాలేవు. ఉపాధి లేకపోవడంతో స్వయం ఉపాధి వెతుక్కునే క్రమంలో పెట్టుబడులు లేక పేద కుటుంబాలకు చెందిన వారు ఎంతో మంది అలమటిస్తున్నారు. వారికి రుణ సౌకర్యం గాని ప్రభుత్వ ఆర్థిక సహకారం లభించడం లేదు ఇదంతా కూడా యువత నిరాశ కావడానికి కారణం అవుతున్నది.
చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలి
ఉద్యోగ విరమణ వయసు ఉద్యోగుల డిమాండ్ కానప్పుడు, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ప్రకటించినప్పుడు, చిత్తశుద్ధి, సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదన విరమించుకునే విధంగా ఒత్తిడి చేయాలి. అప్పుడు మాత్రమే సమాజము ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం పట్ల హర్షిస్తారు.
మరీ ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్ ల ఉద్యోగులు కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి ప్రతినిధులు. వేల రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు లంచాలు గా తీసుకునే ఉద్యోగులన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ అవినీతిని కట్టడి చేయలేని ప్రభుత్వం వారికి మరింత తోడ్పడే విధంగా ఉద్యోగ విరమణ వయసు నుంచి మూడు సంవత్సరాల పాటు మరింత సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం బాధ్యతారాహిత్యం కాదు అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది.
బాధ్యతాయుతమైన పదవులు ఉన్న వివిధ సంఘాల బాధితులకు వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇటువంటి ప్రకటన వెలువడగానే పాలాభిషేకాలు ,అభినందనలు, సంబరాలు డాన్సులతో ఎగిరి గంతులు వేయడం ఎవరి ప్రయోజనం కోసం? దీనిని సామాన్య ప్రజానీకం గుర్తిస్తూనే ఉన్నది.
నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నట్లు పేద ప్రజానీకం ఉద్యోగుల సౌకర్యాలను ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వల్ల జరిగే ఎటువంటి అదనపు ప్రయోజనాలను అర్థం చేసుకున్ననాడు, వేతన వ్యత్యాసము తో పాటు ఆదాయ వ్యత్యాసాలను కూడా గమనించి ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉంది. ఈ విషయాన్ని అటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇప్పటికే కరీంనగర్లో ఏనుగు మల్లారెడ్డి అనేప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడువు ముగియగానే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఇతర ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా తన దారిలో నడవాలని విజ్ఞప్తి చేశారు. దీనిని సామాజిక మీడియా ద్వారా అంతా చూసే ఉంటారు. దయచేసి ఆయన సూచనను అందరు గమనించండి. ప్రజల డిమాండ్ ను ప్రజల బాగోగులను పట్టించుకోని ప్రభుత్వం, సంఘాలు తమ బాధ్యతలు నిర్వహించి సామాజిక కార్యకర్తలు గా నిలిచిపోవాలని నా మనవి
(రచయిత సామాజిక విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కవి, రచయిత హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ,సెల్ 9014206412)