రేపు శుక్రవారం రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండూ ప్రముఖ స్టార్స్ వే. నితిన్ తో ఒకటి, రానాతో ఒకటి. రెండూ వేర్వేరు మేకింగ్స్ కాబట్టి పోటీ లేదు. దేని ఓపెనింగ్స్ దానికుంటాయి. నితిన్ నటించిన ‘రంగ్ దే’, రానా నటించిన ‘అరణ్య’ – రెండిటి పట్లా ప్రేక్షకులకి ఆసక్తి వుంది. గత వారం విడుదలైన నాల్గు సినిమాలూ సరైనవి కావు, ప్రేక్షకులు వాటివైపు కన్నెత్తి చూడలేదు. రెండు వారాల క్రితం ‘జాతి రత్నాలు’ విడుదల తర్వాత నితిన్, రానా సినిమాలు మళ్ళీ హడావిడీ చేసే అవకాశం లభించింది. నిన్న కొద్దిలో థియేటర్ల మూసివేత ప్రమాదాన్ని తప్పించుకుని ఊపిరి పీల్చుకున్న ఈ రెండిటి నిర్మాతలు, దర్శకులూ ఇక బాక్సాఫీసు మీద దృష్టి పెట్టారు.
నితిన్ ‘రంగ్ దే’ రోమాంటిక్ మూవీ. ఇందులో నితిన్ తో ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. ఇది ప్రధానాకర్షణ అయింది. దీని దర్శకుడు అట్లూరి వెంకీ అయితే, ఛాయాగ్రాహకుడు ప్రసిద్ధ పీసీ శ్రీరామ్. 2004 లో రాజమౌళి దరకత్వంలో ‘సై’ హిట్ తర్వాత, 2005 నుంచీ 2011 వరకూ ఆరేళ్ళూ 12 వరస ఫ్లాపులతో బెంబేటెత్తిన నితిన్ ని తిరిగి నిలబెట్టింది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2012 లో వచ్చిన ‘ఇష్క్’ మాత్రమే. దీని తర్వాత నుంచి నితిన్ దారిలో పడ్డాడు. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్ అయితే ఛాయాగ్రహకుడు పీసీ శ్రీరామే. ఇష్క్ తో తిరిగి హిట్ సాధించిన నితిన్ తో తిరిగి పదేళ్ళ తర్వాత ఇప్పుడు పీసీ శ్రీరామే. ఇలా సినిమాకి కొన్ని ప్రత్యేక ఆకర్షణలు చేకూరాయి. దర్శకుడు వెంకీ ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్నూ’ అనే రెండు ప్రేమ సినిమాల దర్శకుడు. ఇక సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. నిర్మాత సీతారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ.
అయితే గత సంవత్సరం ‘రంగ్ దే’ ప్రారంభమైనప్పుడు, ఇది సల్మాన్ దుల్కర్ నటించిన ‘చార్లీ’ (2015) మలయాళంకి రీమేక్ అని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదెంత వరకూ నిజమో రేపు తెలుస్తుంది.
రానా నటించిన ‘విరాట పర్వం’ వచ్చేనెల విడుదల కాబోతోంది. ఈ లోగా చాలా కాలంగా పెండింగ్ లో వున్న ‘అరణ్య’ రేపు విడుదల చేసేస్తున్నారు. 2000 ఏప్రెల్ లో విడుదల కావాల్సి వుండగా, కోవిడ్ లాక్ డౌన్ తో ఈ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రం విడుదల ఆగిపోయింది. ఇప్పుడు కూడా కోవిడ్ రెండో వేవ్ తో మళ్ళీ హిందీ విడుదల ఆగిపోయింది. తెలుగులో మళ్ళీ నిన్నతెలంగాణాలో థియేటర్ల మూసివేత ప్రమాదాన్ని తప్పించుకుని ఎట్టకేలకు విడుదలవుతోంది.
ఇది పూర్తిగా అడవుల నేపథ్యంలో తరిగిపోతున్న ఏనుగుల సంఖ్యకి సంబంధించిన ఫారెస్ట్ యాక్షన్ మూవీ. ఏనుగు దంతాల స్మగ్లర్ల దురాగతాలు ఇందులో చూపించి వుండొచ్చేమో. దీనికి సాల్మన్ ప్రభు అనే తమిళ దర్శకుడు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో ‘కాదన్’, పేరుతో విడుదలవుతోంది.