రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన ‘సేవ్ అమరావతి’ నిరసనలు 463వ రోజుకు చేరుకున్నాయి. అయితే, ఈ ఉద్యమానికి సేవ్ వైజాగా స్టీల్ ఉద్యమం కూడా జోడయింది. అమరావతి రైతులు ఇపుడు విశాఖ స్టీల్ ప్రయివేటీకరణను నిలిపివేయాలని కోరుతూ ” విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదం చేయడం కొత్త పరిణామం.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు.
కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతుందని, ఈ విషయంలో సడలింపు ఉండదని వారు చెబుతున్నారు.
ఢిల్లీ సరిహద్దున పోరాటం దీర్ఘకాలిక పోరాటం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతలనుంచి అమరావతి రైతులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. ఈ మధ్య అమరావతి రైతులు ఢిల్లీ వెళ్లి అక్కడి రైతులకు సంఘీభావం కూడా ప్రకటించి వచ్చారు. అప్పటినుంచి వీరిలో కూడా దీర్ఘకాలికపోరాట స్ఫూర్తి పెరిగింది.
తమ పోరాటానికి విశాల ప్రజానీకం మద్దతు కూడ గట్టుందుకు కూడా వీరు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి కూడా వారు మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్క పరిరక్షణ సాధిస్తామని అమరావతి రైతులు శపథం చేశారు.
అమరావతి దీక్షలలో ఇపుడు కొత్త గా వినిపిస్తున్న నినాదం ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు”. ఈ నినాదంతో ఇపుడు దీక్షా శిబిరాలు ప్రతిధ్వనిస్తున్నాయి.