తెలంగాణకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రజలకోసం పోరాడతానని ప్రకటించారు. ఇది ఆశ్చర్యంగా ఉంది కదూ! నిజం, సీనియర్ ఐపిఎస్ అధికారి (విఆర్ ఎస్) వినయ్ కుమార్ సింగ్ ఈ ప్రకటన చేశారు. అంతేకాదు, బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదని, తెలంగాణ అవినీతిలో రెండో స్థానంలో ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఇంకాముందుకు వెళ్లి తెలంగాణలో కుటుంబపాలన సాగుతున్నదని కూడా అన్నారు.
ఆయన ప్రకటనలో తెలుగులో ఉంది. భావాలు స్పష్టంగా ఉన్నా భాషలో అన్వయం లోపించింది. . ఆయన చెబుతూంటే చెప్పినది చెప్పినట్లు ఎవరో టైప్ చేశారు.
తనను వేధిస్తున్న విధాన్ని ఆయన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. ‘నేను ఉద్యోగ రీత్యా ఎన్నో మందు పాత్రలు పేలుడులోంచి తప్పించుకున్నాను. అందుకు బదులుగా నాకు మిగిలింది అనేక రకములైన అప్పులు. బ్యాంకు ఖాతాలో సున్నా. నా యొక్క చెమట రక్తమును నిబద్ధతతో పనిచేస్తే కృషికి పథకాలు ఇవ్వక, ప్రమోషన్లు ఆపడం పోస్టింగ్ ఇవ్వకుండా చార్జ్ మెమోలు ఇవ్వడం అదియో కాకుండా పెన్షన్ జిపిఎఫ్ గ్యాచుటీ తదితరవి కూడా ఇవ్వలేదు… నేటి తెలంగాణ ప్రభుత్వం మంచి అధికారులను నచ్చలేదు. ఇంకనూ వారిని చెత్తపదవుల్లోకి నెట్టంది. వెంబడించి శిక్షించుతున్నది.’
వికె సింగ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన విఆర్ ఎస్ తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన పంజాబ్ ప్రభుత్వం సలహాదారుగా ఉంటున్నారు. తెలంగాణలో గతంలో జైళ్ల శాఖ డిజిగా పని చేశారు.
ఇపుడాయన మనసులో మాట పైకి చెప్పేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని ప్రకటించారు.
“ఏక పక్ష ఫ్యామిలీ పాలక ఒంటరి మొండితన రాజ్యంగ ఖూనిని తెరపైకి తేవాలని మంచిని విజయంగా భావించే విధంగా ఉద్యమం బంగారు తెలంగాణ కోసం ప్రమాణం చేస్తున్నాను.” అని ప్రకటనలో శపథం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిత్యం వేదిస్తోందని చెబుతూ మే 2020 లోనే తాను నా రిటైర్మెంట్ పై ప్రభుత్వానికి విఆర్ఎస్ ఇచ్చానని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వం తన విఆర్ ఎస్ ను క్యాన్సిల్ చేసిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్వీసులో ఉన్న వారికంటే మాజీ పోలీసు అధికారులకే మంచి పదవులు లబిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో తనకు విబేధాలు లేవని చెబుతూనే ఆయన రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరికీ కనిపించకుండా ఉండటం మీద కూడా ఆయన వ్యాఖ్యానించారు.” ఎపుడైతే రాజు దర్శనమివ్వడో, పత్రిక స్వేచ్ఛ లేదో, విజిలెన్స్. డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్, ఇంటెలిజెన్స్ . నిఘా, రవాణా తలలు లేకపోవడం, అడుగంటుతున్న విద్య ఆరోగ్య శాఖలు, మౌళిక సదుపాయాలు లేక చెడిపోయి, అధికారులను పోస్టింగ్ ల కోసం వేచి ఉంచడం, కులం, మతం, డబ్బు, పార్టీ పైరవీ, ఇష్టాను సారంగా వ్యవహారాలు పాటించడం, కరోనా విజృంభించిన సమయంలో గౌరవనీయ లీడర్ చాలా కాలం కనిపించక, అత్యవసరమైన హోదాలను ఏళ్లతరబడి ఖాళీగా ఉంచారు.”
ఆయన ఇంకా ఏమన్నారంటే…
సీనియర్ అధికారులు పోస్టింగ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది నిజాయితీ అధికారులు మౌనంగా ఉన్నారు. తెలంగాణ లో కుటుంబ పాలన నడుస్తోంది. బంగారు తెలంగాణ కంగారు తెలంగాణ గా మారింది.
ప్రభుత్వానికి నేను అనేక లేఖలు రాశాను. కానీ అభివృద్ధిపై ప్రభుత్వం స్పదించలేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలనేదే ప్రభుత్వం ప్రయారిటీ. ఎన్నికల ముందే ప్రభుత్వం నిరుద్యోగులకు పథకాలు తీసుకొస్తుంది.
ఆత్మహత్యలు చేసుకుని సాధించిన తెలంగాణ లో యువతకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ చూశాకా ప్రభుత్వానికి లేఖ రాశాను. తెలంగాణ ను విడిచి వెళ్లను ఇక్కడే ఉండి ప్రజల తరపున పోరాడుతాను
నాకు సీఎంతో విభేధాలు లేవు. డబుల్ బెడ్ రూం స్కీం ఎక్కడ పోయింది.సెక్రెటేరీయట్ పడగొట్టి కొత్తది కట్టడం అప్రస్తుతం. తెలంగాణ లో తుగ్లక్ పాలన జరుగుతుంది.రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఉంది
తెలంగాణ కొంతమంది నాయకుల కోసం కాదు. పంజాబ్ ప్రభుత్వం నాకు అడ్వయిజర్ గా నియమించింది. నాకు పంజాబ్ వెళ్లడం ఇష్డం లేదు. ఇక్కడే ఉంటాను. ఇదే పని ఇక్కడ చేస్తానంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అధికారులకు ఆత్మసంతృప్తి ఉండాలి, కానీ ఇక్కడ అసంతృప్తి ఉంది
తెలంగాణ లో అధికారులపై కులం, మతం, డబ్బు ప్రభావం, రాజకీయ ఒత్తిడి ఉంటుంది. పదిహేను రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాను. ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లా పదవుల్లేకుండా పని చేస్థాను.ఊరు ఊరు తిరుగుతాను