ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘విరాట పర్వం’ టీజర్ విడుదలయింది. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సాయంకాలం విడుదలయింది. 1990 ల నాటి నక్సల్ ఉద్యమ నేపథ్యంలో రానా – సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’ ఈ రెండో టీజర్ ఉద్విగ్న భరిత ప్రేమ – పోరాటం దృశ్యాలతో వుంది. రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి టీజర్ రానా వీరోచిత నాయకత్వాన్ని ప్రదర్శిస్తే, ఈ కొత్త టీజర్ నక్సల్ ఉద్యమ నేపథ్యంలో ఆకర్షణీయమైన ప్రేమకథను వివరిస్తోంది.
రానాని విప్లవ రచయితగా, కామ్రేడ్‌గా చూపిస్తూ టీజర్ తో ప్రారంభమవుతుంది. రానా విప్లవ కవిత్వంతో ఉత్తేజితురాలైన సాయి పల్లవి, అతడ్ని కలుసుకోవాలని బయల్దేరుతుంది. శ్రీ కృష్ణుడి ఆరాధనలో తల్లిదండ్రుల్ని, భర్తనీ విడిచి పెట్టిన మీరాబాయి లాగా, సాయి పల్లవి కూడా రానా కోసం అన్నీ వదులుకుని వచ్చేస్తున్నట్టు ప్రకటిస్తుంది.
అతడి కవిత్వం పట్ల ప్రేమ ఆమెని తెగించి పోరాటం వైపు, కమ్యూనిజం వైపు మళ్లేలా చేస్తుంది. అతడి కోసం చనిపోవడానికైనా సిద్ధంగా వుంటుంది. అతడ్ని కలిసే ప్రయత్నంలో జైలుకి కూడా వెళ్తుంది. తన ప్రేమ అమలినమైనది, ఆలోకిక మైనది, ఆత్మికమైనది అని ప్రకటిస్తుంది.
మరోవైపు, రానా తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంకితం చేసిన కామ్రేడ్‌గా వుంటాడు. ఈ దృశ్యాలకి డానీ ని సాంచెజ్-లోపెజ్, దివాకర్ మణి ద్వయం ఛాయాగ్రహణం హైలైట్ గా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల రూపొందిస్తున్న’విరాట పర్వం’ పై భారీ అంచనాలున్నాయి. చెరుకూరి సుధాకర్, సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ నక్సల్ చిత్రం ఏప్రిల్ 30 న విడుదలవుతుంది.