ఆధునిక తెలంగాణ చరిత్రలో ఆంధ్ర మహాసభ పాత్ర

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఆధునిక తెలంగాణ చరిత్ర ని మలుపు తిప్పడంలో ఆంధ్ర మహాసభ పోషించిన పాత్ర అసాధారణమైనది. అది సాంస్కృతిక రంగంలో విజ్ఞప్తులతో ప్రారంభమై, రాజకీయ రంగంలో సాయుధ తిరుగుబాటుకు పూర్వరంగ దశను పరిపక్వo చేసింది. తొలి ఆంధ్ర మహాసభ జోగిపేటలో, రెండో మహాసభ దేవరకొండలో జరిగాయి. నిజాం సర్కార్ ఆంక్షల వల్ల అనుమతి దొరక్క 1932లో జరగాల్సిన మూడో మహాసభ 1934లో ఖమ్మంలో జరిగింది. రామనాధం గారు తిరిగి ఆ పనిలో మునిగారు.

నాడు సంఘ సంస్కరణల్ని తీవ్రంగా వ్యతిరేకించే సనాతన బ్రాహ్మణ పండిత వర్గాలు ఆంధ్ర మహాసభల్ని ఖమ్మంలో జరగ నివ్వరాదని పంతం పట్టాయి. అదేసనాతన బ్రాహ్మణ వర్గానికి చెందిన సర్వదేవభట్ల, పెరవల్లి, చిర్రావూరి వంటి యూత్ వాటి జయప్రదంకై నడుం బిగించింది. అక్షయలింగం గుప్తా, పెండ్యాల సత్యనారాయణ, గెల్లా కేశవ రావు వంటి యూత్ తోడ్పాటు లభించడంతో ఆటంకాల మధ్య మహాసభ జయప్రధమైనది. ఐతే రామనాధం, చిర్రావూరి, పెరవల్లి కులం నుండి “వెలి” వేయబడ్డారు. ఐనాలొంగకుండా ఓవైపు గ్రంథాలయోద్యమం పై ఇంకోవైపు అంటరానితనం, SC విద్యార్థులకు విద్యా బోధనపై దృష్టి పెట్టారు. ఫలితంగా రెండో సారి కులం “వెలి” వేసింది. ఈ రెండు “వెలి” సంఘటనలు 1934, 1935లలో జరిగాయి.

ఖమ్మం హైస్కూల్ లో 15ఏళ్ల లోపు వయస్సులో నిజాం స్తుతి గీతంపై నిరసించారు. తర్వాత వరంగల్ లో ఇంటర్ చదివారు. ఖమ్మం తిరిగొచ్చాక సంస్కరణ కృషి, ఆంధ్రమహాసభ కృషి, కులం నుండి వెలి జరిగాయి. ఈ మధ్యలో పరివర్తన ఏమిటి?

ఈనెల 9 పిండిప్రోలు సభలో ఆవిష్కరించబోయే ఆయన జీవిత చరిత్ర పుస్తకం నుండి కొన్ని వాక్యాల్ని యధాతధంగా క్రింద పేర్కొంటున్నాను.

“హన్మకొండ లో ఇంటర్ చదివే రోజుల్లో రామనాధం విద్యార్థుల ఆందోళనలలో పాల్గొన్నాడు. ఆర్య సమాజం లోని తన సహచరులతో, సామాజిక అంశాలపై తరచు చర్చించే వాడు. పండితులు నిర్వహించే సభలలో, ఆంధ్ర మహాసభల కార్యక్రమాల్లో పాల్గొన సాగాడు. ఆయన అంతకు ముందు నుంచే మతం, విగ్రహారాధన, దైవభక్తి, శాస్త్రాలపై ఒక అవగాహన కలిగి వున్నాడు.”

దీన్నిబట్టి ఇంటర్ లో ఆయనలో రాజకీయ పరివర్తన పెరిగిందని తెలుస్తోంది. అది రెండోదశ రాజకీయ ఉద్యమ కారుడిగా మలిచి ఉండొచ్చు.

రామనాధం గారు 1930లో ఇంటర్ పాసై, 1935 వేసవి వరకూ ఖమ్మంలో వున్నారు. ఎంతకాలం డిగ్రీకి ఎందుకు వెళ్ళలేదు? విడుదల కానున్న పుస్తకం ఇలా పేర్కొన్నది.

“1930లో ఇంటర్ పాసైనా 1935కి గానీ ఆయన డిగ్రీలో చేరని కారణం ఏమిటో? 1935 వరకు ప్రజారంగంలో తలమునకలుగా పాల్గొనే కృషి తెలుస్తూనే ఉన్నది. కుటుంబ వత్తిడి వల్లో, స్వయం ప్రేరణ వల్లో తెలియదు గానీ, మళ్లీ రామనాధం 1935లోనే డిగ్రీ చదువుకు హైదరాబాద్ వెళ్ళాడు.”

రామనాధం గారు ఇంటర్ తర్వాత నాలుగైదేళ్లు ఉన్నత చదువులకి ఎందుకు వెళ్లలేదు? తమకొడుకు వరంగల్ ఇంటర్ లో రాజకీయ ప్రవేశం తండ్రిని భీతిల్లిజేసి ఉంటుందా? ఉన్నత విద్యకు హైదరాబాద్ పంపిస్తే రాజకీయాల్లో మరింత మునిగి పోతాడనే భయంతో ఆపించి వుంటారా? ఇంటివద్ద కూడా చెప్పిన మాట వినకుండా రెండు సార్లు కులం నుండి వెలివేతకి గురయ్యాక, తండ్రి మనస్సు మారిందా? ఖమ్మంలో ఉంచే కంటే, హైదరాబాద్ కి పంపిస్తేనే మంచిదనే నిర్ణయానికి ఆ తండ్రి వచ్చివుంటారా? లేదా వేదవిద్య ప్రియులుగా ఆధునిక ఉన్నత విద్య తమకు పొసగదని ఆపి, “వెలి” తర్వాత అయిష్టంగానే పంపారా? ఏది నిజమో చరిత్రకే వదిలేద్దాం. కానీఆరోజు ఆతండ్రి నిర్ణయం మాత్రం చరిత్రలో ఓ చరితార్థుడికి రాజకీయ జన్మని ఇచ్చింది. ఆయన పంపిన ఆ కొడుకే తెలంగాణలోనే ‘ఆది కమ్యూనిస్టు’ గా మారాడు. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే సర్వదేవభట్ల రామనాధం గారికి ఓ అపూర్వ, అపురూప స్థానం దక్కింది. అది ఏమిటో రేపు తెలుసుకుందాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *