సర్వదేవభట్ల రామనాధం గారు నిజాం సంస్థానంలోని తెలంగాణ లో “ఆది కమ్యూనిస్టు”.
1940లో మల్కాపురం లో ఏడవ ఆంధ్ర మహాసభలకు రామనాధంగారు ఖమ్మం నుంచి లారీ ప్రతినిధుల్ని తీసుకెళ్లారు. నిజాంలో అజ్ఞాతనేత చండ్ర రాజేశ్వరావు గారిని దారిమధ్య సూర్యాపేటలో ఎక్కించుకెళ్లి అనామకుని రూపంలో సభలో హాజరుపరిచి, తన డైరెక్షన్ లో పోషించిన రామనాధం గారు పోషించిన పాత్ర కీలకమైనది. అప్పటికి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల బ్రదర్స్ స్టేట్ కాంగ్రెస్ లో అతివాదులే తప్ప కమ్యూనిస్టులుగా మార లేదు. తొలుత ఆంధ్ర మహాసభ లో కమ్యూనిస్టు పార్టీ వైఖరి ప్రకారం పనివిధానాన్ని అమలు లో “ఆది”పాత్ర పోషించింది సర్వదేవభట్ల రామనాధం గారే!
నిజం పాలనలో కార్మిక రంగంలో కమ్యూనిస్టు పార్టీ తొలి కృషి ప్రారంభమయ్యాక ముగ్గురో నలుగురో పేరొందిన తొలి కార్మిక నేతల్లో రామనాధం గారు ఒకరు. ఐతే నాడు కార్మిక రంగం రెండువిధాలుగా ఉంది. మొదటిది, హైదరాబాద్ నగర కేంద్రంగా గల కార్మికరంగంలో రాజబహదూర్ గౌర్, KL మహేంద్ర వంటి వారు ప్రముఖ తొలి కార్మిక నేతలుగా పని చేసారు. రెండవది, గ్రామీణ ప్రాంతాల పునాదిగా గల కార్మికవర్గంలో ప్రధాన కార్మిక నాయకుడిగా రామనాధం గారు పని చేశారు. నాటి మొత్తం కార్మిక రంగంలో రామనాధం గారు తొలి కార్మిక నేతల్లో ఒకరు. రెండో కోవలోని గ్రామీణ పునాదిగా గల కార్మిక వర్గంలో ఆయనే “ఆది” కార్మిక నేత. వీరందరూ ఏకకాలంలో తొలి కార్మికనేతలైనప్పుటికీ, ఒక తేడా ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు కేంద్రాలుగా సింగరేణి బొగ్గు గని కార్మిక వర్గం గానీ, వరంగల్ పునాదిగా ఆజాం జాహి మిల్ టెక్స్టైల్స్ కార్మిక వర్గం గానీ ప్రధానంగా గ్రామీణ సంబంధిత మైనది. ఇంకా తోళ్ల పరిశ్రమ, కాజీపేట రైల్వే వంటి కార్మిక వర్గాలను కూడా ఆర్గనైజ్ చేసారు. 1942లో ఓ విభాగం లో తెలంగాణలో “ఆది” కార్మిక నేతగా కీలక పాత్రని పోషించిన ఘన చరిత్ర రామనాధం గారిదే.
ఓవైపు ట్రేడ్ యూనియన్ నేతగా పని చేస్తూ, మరోవైపు “దున్నేవాడికే భూమి” నినాదం తో సాయుధ రైతాంగ పోరాటం చారిత్రక, రాజకీయ అవశ్యకత గా మారిన నూతన పరిస్థితుల్లో పార్టీ తెలంగాణ ప్రముఖనేతగా తానే అగ్రగామి పాత్రధారియై స్వయంగా సాయుధుడిగా మారి దానికి నాయకత్వం వహించిన ఘనత రామనాధం గారిదే. ఓ కీలక కార్మిక నేత వ్యవసాయక విప్లవంలో కూడా కీలక పాత్ర దారునిగా మారడం ఆధునిక విప్లవ చరిత్రలో ఓ విశేషమే.
తన స్వగ్రామం పిండిప్రోలు ను లెనిన్ గ్రాడ్ గా మార్చడంలో రామనాధం గారి పాత్ర గొప్పది. (పిండిప్రొలు, తెట్టేలపాడ్ గ్రామాల్ని నాడు లెనిన్ గ్రాడ్, స్టాలిన్ గ్రాడ్ గా పిలిచే వాళ్ళు).
అది గ్రంధాలయోద్యమానికి 1940 నాటికీ ఊపిర్లు ఊదిన గడ్డ. 1945 మేలో ఖమ్మంలో 40 వెలమందితో ఎర్రజండా యాత్రగా సాగిన 12వ ఆంధ్ర మహాసభకి “పొలికేక” వేసిన గడ్డ. సాయుధ పోరాట పొలికేక విని ఊరు ఊరంతా తిరగబడ్డ గడ్డ. రామనాధం గారి ప్రధమ శిష్యులు రాయల వెంకట నారాయణ గారి నేతృత్వంలో సుదూర పొరుగు ప్రాంతాలకు పలు సాయుధ దళ కమండర్ల ను అందించిన వీర గడ్డ నాటి పిండిప్రోలు. మేజర్ జయపాల్ సింగ్ మిలిటరీ శిక్షణ నుండి డాక్టర్ అచ్చమాంబ గారి వైద్య చికిత్స వరకూ పేరొందిన కేంద్రమది. ఓ స్త్రీసహా ఏడుగురి అమరత్వంతో పునీతనమైన విప్లవ కేంద్రమది. పుచ్చలపల్లి గారితో ప్రముఖ అజ్ఞాత నేతల్ని నెలల తరబడి కంటిపాపల వలె కాపాడిన చరిత్ర ఆ ఊరుకి ఉంది. రామనాధం గారి పాత్ర లేకుండా ఆనాడు అట్టి ఘన విప్లవరాజకీయ పునీతన చరిత్ర పిండిప్రోలు పోషించలేదు.
ఇవన్నీ ఒక ఎత్తు. తన వాటకు వచ్చిన సాగు భూమి 1800 ఎకరాలను గడ్డిపరకగా, కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన “దున్నేవాడిదే భూమి” నినాదం అనుసరించి పంపిణీ చేసిన రాజకీయ ఘనత సర్వదేవభట్ల రామనాధం గార్కి దక్కుతుంది. చరిత్రలో అదో ఘనత్యాగం.
పైన పేర్కొన్న ఆరింటికే పరిమితం కాకుండా ఇంకెన్నో చారిత్రిక రాజకీయ విశిష్టతలు రామనాధం గారి స్వంతం. రేపు 9-3-2021న ఉదయం 10 గంటలకు ఖమ్మంకి 20 km దూరంలోని రామనాధం గారి స్వగ్రామం పిండిప్రోలు (రాయల సుభాష్ చంద్రబోస్ @ రవన్న స్వగ్రామం కూడా అదే) లో “కష్టాల కొలిమి- త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాధం జీవితం” శీర్షికతో ఆవిష్కృతం కాబోయే పుస్తకం లో అలాంటి విశేషాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా ప్రముఖ నాయకత్వ స్థాయికి ఎదిగి, నాడు సర్వదేవభట్ల గారిని రాజకీయ సన్నిహితంగా ఎరిగి, అనంతరం కాలంలో సీపీఎం నిర్మాణంలో కూడా కీలక పాత్రను పోషించి, నేడు విశ్రాంత జీవితం సాగిస్తోన్న మల్లు స్వరాజ్యం గారి చేతుల మీదుగా పై పుస్తక ఆవిష్కరణ జరగ బోతోంది.
అదేవిధంగా ప్రముఖ విరసం నేత పాణి గారు ఈ సభలో నిర్బంధ విధానం మీద ప్రత్యేక ప్రసంగం చేస్తారు. మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక రైతాంగ ప్రతిఘటనపై మరో ప్రసంగపాఠం గత విద్యార్ధి నేత, ప్రముఖ విద్యావేత్త, ఐ వి రమణారావు చేస్తారు. రేపటి సభకి ఎక్కువమంది హాజరై, జయప్రదం చేస్తారని ఆశిద్దాం.
ముఖ్యంగా నిస్వార్థ నేత, తన సర్వ ఆస్తిపాస్తుల్ని పీడిత ప్రజలకి సమర్పించిన మహా త్యాగమూర్తి, అవసాన దశలో నిర్భాగ్య జీవితం గడిపిన అభాగ్యులు, కనీసం వాటికి ప్రతిఫలంగా తన జీవిత చరిత్ర రచనను నేటికీ నోచుకోలేని దురదృష్టవంతుడు ఆయన. అలా తన తనువు చాలించిన మహానీయుడైన త్యాగధనుణ్ణి స్మరించుకుందాం.
ఆయన మరణించిన 29 ఏళ్ల తర్వాత ఆలస్యంగా విడుదల అవుతోన్న సందర్బంగానైనా “తెలంగాణ ఆది కమ్యూనిస్టు” జీవిత ఆవిష్కరణ సభకి మనం హాజరై ఒక్కొక్కరం ఒక్కొక్క కన్నీటి చుక్కతో నివాళులు అర్పించి రాజకీయ రుణం తీర్చుకుందాం. ఆమహనీయుని జీవిత చరిత్ర పుస్తకాన్ని రేపు తలకొక్కటి కొని అధ్యయనం చేద్దాం. దాన్ని మనం ఇంటింటా భద్రపరుచుకొని, రేపటి చరిత్ర నిర్మాణంలో పాల్గొనేందుకు దాని నుండి నిత్యా విప్లవ స్ఫూర్తిని పొందుదాం.
గమనిక : 1. కామ్రేడ్ శివలింగం సేకరించి, డాక్టర్ ముత్యం రచించిన పై పుస్తకం కొన్ని అనుబంధాలతో కలిపి కవర్ పేజీ కాకుండా 312 పేజీలు ఉంది. ధర ₹200.
2 . పై ఇద్దరు రచయితల విజ్ఞప్తిపై ఈ పుస్తకానికి నేనే “ముందుమాట” రాశాను. 13 పేజీల సుదీర్ఘ “ముందుమాట” అది. పై పుస్తకం ఆధారంగా తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో సర్వదేవభట్ల రామనాధం గారి సముజ్వల, సమున్నత పాత్రని వెలుగులోకి తెచ్చే ఓ ప్రయత్నం నా జ్ఞాన పరిధిలో చేసాను. అందులో కొరతలుంటే చరిత్ర పరిశోధకుల భావి సూచనల మేరకు అవసరమైన మార్పులు మున్ముందు చేసుకుంటాను. చరిత్రలో మరుగునపడ్డ మహానేత (Forgootten Great Leader)ని వెలుగులోకి తెచ్చి ఫాసిస్టు ప్రమాదం పెరిగే నేటి కాలంలో యువతరానికి, నవతరానికి కాంతులు వెదజల్లి క్రాంతివంతమైన ఓ దివిటీగా అందిద్దామని భావించా. అట్టి నా సుదీర్ఘ “ముందుమాట”ను చదవడం నేటి పాఠకులకి కష్టమే. ఐనా చదివే ఆసక్తి ఉన్న వారి కోసం అందిస్తాను. దాన్ని పుస్తక ఆవిష్కరణకి నాలుగైదు గంటల ముందు రేపు 9వ తేదీ ఉదయం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తాను.
3. రేపు పిండిప్రోలు రాలేని సుదూర ప్రాంతాల కామ్రడ్స్, మిత్రులు ఇప్పటికే చాలా మంది పుస్తకం ఎలా పొందాలని అడిగి వున్నారు. రాయల సుభాష్ చంద్రబోస్ ట్రస్ట్ కార్యదర్శి ఆళ్ల రామారావు ఫోన్ నెంబర్- 9949263729 & పార్టీ నేత పోటు రంగారావు ఫోన్ నెంబర్- 9490700099 లను సంప్రదించగలరు.
4. ఢిల్లీ నుంచి వచ్చాక కోవిడ్ టెస్ట్ లో నాకుపాజిటివ్ తేలింది. నిన్న రాత్రి విజయవాడలోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. కోవిడ్ చికిత్స పొందుతున్నా. రైతు ప్రతిఘటనపై పిండిప్రోలు లో నా ప్రసంగ పాఠం ఉండెను. నా స్థానంలో పై సబ్జెక్టు మీద సాధికారికతగల రమణారావు ప్రసంగాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నేను రాలేక పోవడం సభకూ, సభికులకూ లోటు కాదు. ఓ మరుగునపడ్డ హీరో(Forgotten hero) చరిత్ర ఆవిష్కరణకు రాలేకపోవడం నాకు మాత్రమే పెద్దలోటు. ఆ లోటును నేను విశాల రాజకీయ హృదయంతో భర్తీ చేసుకుంటా.
రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని “ముందుమాట” కర్త గా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా.
సర్వ దేవ ర భట్ల రామనాథం గారి గురించి పుస్తకం రావడం సంతోషం. తొలి తరం కార్మిక నేతలు జోహార్లు.