(వడ్డేపల్లి మల్లేశము)
ఒకనాడు పార్లమెంటులో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ ప్రతిపక్షాలకు చెందిన వారికి అధికారపక్షం గౌరవ మర్యాదలీయడంతో తోపాటు మంత్రి పదవులు ఇవ్వ చూపిన హుందాతనం ఉండింది. నాటితో పోలిస్తే, నేటి రాజకీయాలు ఎంత అథమ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర
చట్టసభలలో , రాజకీయ వేదికలపైనా, ప్రజల సమక్షంలో, నిత్య రాజకీయంలో, ఎన్నికల వేళ, ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో,
దేశంలో అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు, కీలక సమస్యలపై చర్చించే క్రమంలో ఒక దేశంలో రాజకీయ పార్టీల అవసరం ఆ ప్రభుత్వం గుర్తించే సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా ప్రతిపక్షాలు అనగానే చట్టసభలలో ప్రశ్నించే క్రమంలో, బిల్లులపై చర్చించి ఆమోదించే సందర్భంలో, ప్రజా సమస్యల పైన ఘాటుగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే సందర్భంలో రాజకీయ పార్టీలు చాలా అవసరమని మనం అనుకుంటూ ఉంటాం.
అందులో వాస్తవం ఉంది అయితే. ఒక దేశ లేదా రాష్ట్ర పరిపాలన సవ్యంగా సాగాలంటే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నిటి తోని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చే ఒక సంస్కారాన్ని అలవర్చుకోవల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఒక దేశ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వారే.
అయితే అధికార పార్టీ బయటి రాజకీయ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రదర్శనలు, లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అధికార పార్టీ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రతిపక్షాలను ఆహ్వానించకుండా ఒంటెద్దు పోకడ తెలంగాణలో రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో గానీ చూస్తున్నాం.
అలాగే చట్టసభలలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉంటే ఒక అంశంపైన కీలకమైన చర్చ జరిగే ఆస్కారం ఉంటుంది. ప్రశ్నించే వారు ఉంటారు కనుక దాని పూర్వాపరాలను ప్రభుత్వము కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రశ్నించేవారు లేకుంటే
తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే క్రమంలో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను పాస్ చేస్తున్న సందర్భాలు అనేకం. రైతు సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు చట్టాలను రైతు ప్రజలు రైతు సంఘాలు ప్రతిపక్షాలతో సమగ్రంగా చర్చించి ఉంటే నేడు ఇంత స్థాయిలో రైతు వ్యతిరేక ఉద్యమం వచ్చేది కాదు.
ఇక రాష్ట్రంలో చూస్తే ఎల్ ఆర్ ఎస్ (LRS) కానీ ప్రకృతి విధ్వంసానికి సంబంధించి నటువంటి నిర్ణయాలు రైతుబంధు సంబంధించి నియంత్రణ విధించకుండా రాళ్ళు బోర్లకు గుట్టకు వందల ఎకరాలు ఉన్నవారికి కూడా వర్తింప చేయడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పట్టించుకున్న దాఖలాలు ప్రభుత్వము ప్రతిపక్షాలు చర్చించి నటువంటి కూడా లేకపోవడం ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణమవుతుంది.
ఎన్నికల సందర్భంలో ఒక పార్టీపై గెలిచిన వారిని ప్రభుత్వం ఆశ చూపి ప్రలోభపెట్టి లేదా ఒత్తిడి ద్వారా సిబిఐ ఇలాంటి దాడులకు పూనుకోవడం ద్వారా కూడా తమ పార్టీలోకి బలవంతంగా తీసుకున్న దాఖలాలు కేంద్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ అనేకం ఉన్నాయి. ఆరా చట్టసభలో ప్రతిపక్షాలు లేకుండా పోవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లే కదా!
ప్రతిపక్షాలు ఎందుకు విఫలం అవుతున్నాయి
కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల ఆధ్వర్యంలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో బలవంతంగా చేరిన వాళ్ళు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసినట్లే కదా! ఇలా పార్టీలు మారుతున్న వారు కూడా అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను అని ఒక తప్పుడు ప్రచారాన్ని కొని పార్టీ మారడాని మనం గమనిస్తూ ఉంటాం.
ఇక ప్రతిపక్షాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు అధికారంలో ఉన్న టువంటి వారే. హయాంలో ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని కానీ అధికార దుర్వినియోగం కానీ అవినీతికి పాల్పడడం కానీ జరిగి ఉంటుంది. ఇలా వాటన్నిటి నుండి తప్పించుకోవాలన్న, ఉన్న ఆస్తులను పరిరక్షించుకోవాలని, కేసుల నుండి బయట పడాలని స్వప్రయోజనం తో మాత్రమే తనకు నమ్మి ఓటు వేసిన ప్రజానీకాన్ని నట్టేట ముంచుతున్నారు.
ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలను గెలిపిస్తే తిరిగి అధికార పార్టీలో నేతగా చేరేది అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేయడం ఎందుకు? అనే భావనతో ప్రజలు ప్రతిపక్షాలను ఆదరించడం తగ్గించుకొని అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రతిపక్షాలు కూడా కీలకమైన అంశాలపైనా ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. మొక్కుబడిగా వ్యవహరించడం వలన ప్రతిపక్షాలు కూడా ప్రజల ఆదరణకు నోచుకోలేక పోతున్నవి.
కవులు కళాకారులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తున్నపు కనీసం ప్రతిపక్షాలు ప్రశ్నించిన సందర్భాలు లేవు. ఇక వామపక్ష పార్టీలు కూడా ప్రజలకు సంబంధించిన కీలక అంశాల పైన పోరాట కార్యక్రమాలను నిర్మాణం చేయడం లేదు.
అటు చట్టసభల లోనూ బయట ప్రజల సమక్షంలో నూ చేసే పోరాట కార్యక్రమాలు చర్చావేదికలో ప్రతిపక్షాలు తమ పాత్రను నిర్వహించడంలేదు. ఆ కారణంగా లేదా అధికార పార్టీ తన పబ్బం ఆధిపత్యం కోసం ఇతర పార్టీ సభ్యులను లొంగదీసుకొని నచ్చజెప్పి భయపెట్టి అధికార పార్టీలో కలుపుకోవడం వల్ల ప్రతిపక్షాలన్నీ చట్ట సభల్లోనూ, ప్రజల మధ్యన లేకుండా పోతున్నవి.
ఒక ముఖ్యమంత్రి గానీ లేదా ప్రధాని ఇతర పార్టీ పెద్దలు మంత్రుల స్థాయి వాళ్ళు ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారు త్వరలో మా పార్టీలో కలవబోతున్నారు మీ ప్రభుత్వం కూలిపోతుంది అనే దుర్మార్గపు ప్రకటనలు చేయడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది.
ప్రతిపక్షాలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
గతంలో ప్రభుత్వాలు ప్రతిపక్షాలను ఆయా సభ్యుల అధికారాలు సూచనలను విరివిగా ప్రజలకోసం వాడుకునేవి. నేడు అన్ని రాష్ట్రాలలోనూ కేంద్ర లోనూ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏనాడూ కూడా ప్రతిపక్షాలతో చర్చించకుండా ప్రస్తావించకుండా అధికారము ఉన్నదని ఆధిపత్య భావజాలంతో ఒంటెద్దు పోకడ గా పరిపాలన కొనసాగిస్తున్నవి. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.
పరిపాలనకు సంబంధించి ప్రజా సమస్యల పైన కీలక అంశాలను చర్చించి క్రమంలో ప్రతిపక్షాలను కలుపుకోవడం ప్రభుత్వానికి క్షేమకరం.
చట్టసభలలో కూడా ప్రతిపక్ష నాయకులతో చర్చించడం ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాలతో చేస్తుందో పరిశీలిస్తూ ప్రభుత్వాల పైన విశ్వాసాన్ని పెంచుకుంటారు.
ఇక శాసనసభ లేదా పార్లమెంటు ప్రచార కార్యక్రమాలను టీవీలో చూస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులను మాట్లాడ నివ్వక పోవడం, బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, మార్షల్స్ తో బలవంతంగా గెంటి వేయడం మనం ఎన్నో సందర్భాల్లో చూసినదే.
ఒక దశలో ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రతిపక్ష సభ్యులను బయటకు గెంటి వేసినప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. పద్ధతి కాదు అని వాళ్లు ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన మంత్రి మీ హయాంలో ఇలా చేయ లేదా అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.
ఇప్పటికైనా ప్రభుత్వం విజయవంతం కావాలన్నా ,పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలన్న, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న ఏ అధికార పార్టీ ప్రభుత్వమైనా ప్రతిపక్షాలను అక్కున చేర్చుకోవాలి.
ఆదరించాలి. వాటి మనుగడకు అంతరాయం కలిగించకూడదు. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించకూడదు. భయపెట్టి లొంగదీసుకోవాలని దాడులకు పాల్పడకూడదు. ఇదే నిజమైన ప్రజాస్వామిక దృక్పథం.
అడ్డుకట్ట వేయడం ఎలా ప్రతిపక్ష సభ్యులు లేకుండా
చట్టసభలను నిర్వీర్యం చేస్తున్నపుడు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన, పౌర సమాజం పైన ,ప్రజాస్వామికవాదుల పైన ఎంతగానో ఉన్నది.
ఒక పార్టీ నుండి గెలిచిన వ్యక్తి కారణాలేవైనా అధికార పార్టీ లోకి పోయినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లకు పుట్టిన బిడ్డ నీకు అధికారం కావాలా? అందుకే పార్టీ మారినవా అని ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో నిలదీయాలి ప్రశ్నించాలి చివరికి చెప్పు దెబ్బలతోఛీత్కారాలకు
పాల్పడితే తప్ప అలాంటి అవినీతిపరులైన నాయకులు మారరు.
ఇలాంటి సంఘటనలు అలాంటి సందర్భంలో ప్రతిచోట జరిగినప్పుడు ప్రభుత్వానికి కూడా వెన్నులో చలి పుడుతుంది.
పార్టీ ఫిరాయింపుల చట్టం రాజీవ్ గాంధీ ధానిగా ఉన్న కాలంలో రూపొందినా ఇప్పటికీ అది అసంపూర్తిగానే ఉండడం రాజకీయ పార్టీల స్వార్థం వల్లనే.
ఇలాంటి పార్టీ ఫిరాయింపుల ను నివారించడానికి సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగం పరిధి మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఫిరాయించి నప్పుడు పదవి పోవడంతో పాటు తిరిగి ఎన్నికల్లో కొనసాగకుండా అడ్డుకట్ట వేసే చట్టాన్ని తీసుకువస్తే ఈ దేశంలో రాజకీయ అవినీతి, పార్టీ ఫిరాయింపుల దుర్మార్గపు ప్రలోభాలు తగ్గి ఆస్కారం ఉంటుంది.
అయితే అలాంటి చట్టాలు రావడానికి కేవలం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజాసంఘాలు బుద్ధి జీవులు మేధావులతో కలుపుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడమే నిజమైన పరిష్కారం మన ముందున్న తక్షణ కర్తవ్యం కూడా. ప్రజలుగా మన చేతిలో ఉన్న అధికారాన్ని కూడా వినియోగించుకోలేక పోవడం పార్టీ ఫిరాయింపు అధికార ఆనందాన్ని అనుభవిస్తున్న మన ఓట్లతో గెలిచిన సభ్యులను మనమే శిక్షించాలి.
ఆ వైపుగా కృషి చేయడానికి తగిన చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం బుద్ధి జీవులు మేధావులు విద్యావంతులు విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయులు కార్మికులు రైతులు సర్వ ప్రజానీకం తమకున్న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రశ్నించడం ద్వారా మాత్రమే ప్రతిపక్షాలను కాపాడుకోగలం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎక్కించుకోగలము.
(వడ్డేపల్లి మల్లేశము, వ్యాసకర్త,సాంఘిక, రాజకీయ విశ్లేషకులు)