ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని టిఆర్ ఎస్ పెట్రోలు ధరలకు ముడేస్తూ ఓటర్లను హెచ్చరిస్తూ ఉంది. ఓటేసే ముందుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను యాదించుకోమంటున్నది. ఈ రోజు టిఆర్ ఎస్ అభ్యర్థి సురభి వాణి తరఫున ప్రచారం చేస్తూ పెట్రోలు ధరలను చూపించి ఓటేసేలా ప్రజలను ఒప్పించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు టిఆర్ ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ రోజు పరిగి నియోజక వర్గం బృందావన్ గార్డెన్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు.
‘పెరిగిన పెట్రోల్ ధరను యాదించుకో అని ఓటర్ కు చెప్పాలి. ప్రపంచంలో పెట్రోల్ రేటు తగ్గితే భారత దేశంలో ఎందుకు పెంచుతుంది ఈ బిజెపి ప్రభుత్వం. సెస్‌ల పేరుతో పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతుంది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎం చేస్తున్నదో మనం చెప్పాలి,’ అని ఆయన చెప్పారు.
బిజెపి మోదీ పాలన గురించి హరీష్ ఏమన్నారంటే..
- అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని మోదీ అన్నారు. ఆ లెక్కన 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏడ ఉన్నయ్. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం అంటే డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్ని కాల రాయడమే. పబ్లిక్ సెక్టర్ మూసేస్తే ఉద్యోగాలలో ఎస్సి,ఎస్టీ బిసి లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్న. బిఎస్ ఎన్ ఎల్ , బీపీసీఎల్ సంస్థలు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ చేయడమే వాళ్ళ లక్ష్యం దీనితో ఎంతో మంది రోడ్డున పడుతారు.
2. మాటలు ఎక్కువ వాళ్ళవి చేతలు తక్కువ. బీజేపీ పాలిత రాష్ట్రల్లో మోటర్లు,పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్ లు కాలిపోతున్నాయి. పక్కన ఉన్న రాష్ట్రంలో రైతు బంధు, భీమా లేదు. కల్యాణ లక్ష్మీ లేదు,ఇంటింటికి నీళ్లు లేవు. రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే. కర్ణాటక, మహారాష్ట్ర పోలీస్ శాఖ మన దగ్గరకు వచ్చి మీ పోలీస్ శాఖ తీసుకున్న షి- టైమ్స్ బాగున్నాయి అని పొగిడిపోతున్నారు.
3. బిజెపి కి ఎందుకు ఓటు వేయాలి.ఒక్కటి అంటే ఒక్క మంచి పని చెప్పండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా…ఐటీ ఐ ఆర్ అడిగితే ఇచ్చారా….
4. 30 నెలలో 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచందర్ రావు. ఆయనకు ఎమ్మెల్సీ అంటే ఇష్టం లేక ఎమ్మెల్యే గా ,ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
5. మన దక్షిణ భారతదేశం పన్నుల తో ఉత్తర భారత దేశం బతుకుతుంది. మన పన్నులు వాళ్లకు ఇస్తున్నారు కనుక ఇవన్నీ మనం చెప్పాలి.
6. మంచి విద్యావేత్త మన ఎస్.వాణి దేవిగారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి ఎస్. వాణి దేవి గారు. మాజీ ప్రధాన మంత్రి కూతురు అయినప్పటికీ ఆమె ప్రొపెసర్ గా కరస్పాండెంట్ గా సేవలు అందించారు.
ఎమ్మెల్యే లు మహేష్ రెడ్డి,పద్మాదేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,జెడ్పి చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ,డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.