( డాక్టర్ జివిజి శంకర్ రావు, మాజీ ఎంపి)
దేశంలో ఆర్ధిక వృద్ధికి ప్రయివేటీకరణ సరైన మార్గమని ప్రభుత్వపు ఆలోచన గా ఉన్నట్టుంది.
‘ప్రభుత్వం పని వ్యాపారం చెయ్యడం కాదు,ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని మినహాయించి,వీలైనన్ని ప్రయివేటీకరించడం మంచిదని’ ప్రధాని అభిప్రాయపడ్డట్టు వార్తలొచ్చాయి.
అది నిజమే అయితే ఆ అభిప్రాయం సరైంది కాదు. సరళీకరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రయివేటీకరణ పట్ల భ్రమల్ని తొలగించేవిగా ఉన్నాయి.
అంతకు ముందున్న లైసెన్స్ రాజ్ దేశంలోని వృద్ధిని మందగింపజేస్తే,తర్వాత పరిణామాలు వృద్ధిని పరిమితమైన వారి చేతిలో బందీని చేశాయి.
దేశానికి స్వంతమైన వనరుల్ని వాడుకుంటూ సృష్టింపబడిన సంపద అతి కొద్దిమంది చేతికే చెంది,అత్యధికమందిని పేదలుగా ఉంచింది. ఫలితంగా ఫోర్బ్స్ ప్రకటించే బిలియనీర్లు పదుల సంఖ్యలో పెరగగా,కొత్తగా పేదరికంలోకి జారిపోయిన వారు కోట్ల సంఖ్యలో పెరిగారు.
దేశంలో పెరిగే సంపదలో 70 శాతం కేవలం పది శాతం మంది దగ్గర పోగుపడడం, అది రాన్రాను మరింత తక్కువ శాతం మందికి పరిమితమవ్వడం పెరిగిపోతున్న అసమానతల్ని,అసమానతల్ని పెంచే విధానాల్ని చెబుతోంది.
కాబట్టి ఇప్పుడు దేశానికి కావాల్సింది సంపద సృష్టితో పాటు, సరైన పంపిణీ. ఆర్ధిక అసమానతల్ని, వాటికి మూలంగా నిల్చిన సామాజిక అసమానతల్ని రూపుమాపే కార్యక్రమం. సంపద సృష్టికి దోహదపడే వనరుల సృష్టి, వినియోగం. విలువైన మానవ వనరులు ఏర్పడేలా అందరికీ ఉచిత విద్యావకాశాలు, ఉచిత లేదా చవకైన ఆరోగ్య సేవలు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం అన్నవి దీర్ఘకాలికంగా దేశానికి లాభం చేకూర్చేవి.
ఇక ప్రయివేటీకరణ విషయానికి వస్తే అన్ని ప్రభుత్వ సంస్థలూ అసమర్ధమైనవి కావు, అన్ని ప్రయివేటు సంస్థలూ గొప్పవి కావు. నిర్వహణ బట్టీ ఫలితం. నిర్వహణలో లోపాల్ని సరిదిద్దితే గాడిన పడతాయి. ప్రయివేటు సంస్థ చెయ్యగలిగింది ప్రభుత్వం చెయ్యలేదంటే లాజిక్ లేదు.పైగా ప్రభుత్వ రంగ సంస్థ వల్ల ఉపాధి,ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయి, వాటి ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం సాధ్య పడుతుంది. ప్రయివేటులో యాజమాన్యానికి లాభం ముఖ్యమై, మిగతా విషయాల పట్టింపు ఉండదు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం. దీర్ఘకాలికంగా ప్రభుత్వానికి అంటే ప్రజల ఖజానా కు జమ అయ్యేది తక్కువ. యాజమాన్యానికి పోగుపడేది ఎక్కువ.
కాబట్టి ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యకూడదు అన్నది సరైన భావన కాదు. అది ప్రజల ధనంతో ప్రజలందరికీ న్యాయం, లాభం చేకూర్చగల మార్గం. ప్రభుత్వం కేవలం ట్రస్టీ. గాంధీజీ దృష్టిలోనైనా వ్యాపారం తప్పు కాదు.. నైతికత లేని వ్యాపారమే పాపం. అదైతే ఎవ్వరూ చెయ్యగూడదు.. చెయ్యనివ్వగూడదు.
(డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం. 94408 36931)