ప్రఖ్యాత ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత కిశోర్ పంజాబ్ లో మరొక సారి కాంగ్రెస్ ను గెలిపించే వ్యూహం రచనకు పూనుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రధాన సలహాదారు నియమితులయ్యారు. ఈ విషయం ముఖ్యమంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. ప్రశాంత్ కిశోర్ తన ప్రధాన సలహాదారుగా చేరిన విషయాన్ని షేర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రశాంత్ కిశోర్ కెప్టెన్ అమరిందర్ సింగ్ తో పనిచేయడం ఇది రెండో సారి. గతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన కెప్టెన్ కు సలహాదారుగా ఉన్నారు. అపుడు కిశోర్ ఎన్నికల వ్యూహం విజయ వంతమయింది. ఫలితంగా 117 అసెంబ్లీ స్థానాలలో 77 స్థానాలను గెల్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరిగి వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి గెలిపించే వ్యూహం తయారు చేసేందుకే అమరిందర్ సింగ్ కిశోర్ ను తన సలహాదారుగా తీసుకున్నారు. కిశోర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కు సలహాదారుగా ఉన్నారు. ఈ మధ్య ఆయన బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తొందర్లో జరగబోయే ఎన్నికల్లో తమిళనాడు స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె అఖండ విజయం సాధించబోతున్నదని ట్వీట్ చేశారు.
పంజాబ్ ముఖ్యమంద్రి ప్రధాన సలహాదారు పదవిలో కిశోర్ కు క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అయితే, కిశోర్ ఎలాంటి ప్రభుత్వం నుంచి జీతం తీసుకోరని కేవలం నెలకొకరుపాయ గౌరవ వేతనం కింద ప్రజాసంక్షేమం (Pro bono) కోసంపని చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. కాకపోతే,ఆయన ఉచిత నివాసం, వాహనం, ఇతర సిబ్బంది ఉంటారు. మంత్రికి వచ్చే అన్ని సదుపాయాలు అందిస్తారు.