తెలంగాణ హరిదాస్ పూర్ ఎపుడూ వార్తల్లో ఉంటుంది. సంగారెడ్డి జిలా కొండాపూర్ మండలానికి చెందిన ఈ గ్రామంలో ఆడశిశువు పుడితే సెలెబ్రేట్ చేసుకుంటారు.
నిజానికి ఒకపుడు ఈ వూర్లో ఆడశిశువుజననం అంతమంచి వార్త కాదు. అయితే, వూరి సర్పంచ్ మహమ్మద్ షఫీ, విలేజ్ సక్రెటరీ రోహిత్ కులకర్ణి ఆడశిశువుల పట్ల చాలా మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను మార్చేశారు. ఇపుడు ఈ వూర్లో ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా వూరంతా పండగ చేసుకుంటారు. పంచాయతీ ఆఫీస్ ను అలంకరిస్తారు. మిఠాయిలు పంచుతారు. పాప పేరుతో వేయి రుపాయలు జమచేసి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చెస్తారు.
మొన్నా కరోనా సమయంలో కూడ షఫీ, కులకర్ణి వూరి వారికి కొత్త అలవాటు చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వూర్లోకి ప్రవేశించే చోట, బయటికి వెళ్లే చోట చేతుల కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఏర్పాటుచేశారు. వూర్లోకి వచ్చేవాళ్లు, పోయేవాళ్లు విధిగా హ్యాండ్ వాష్ వాడాలి. లేదా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
అంతేకాదు, ప్రతిఇంటిముందుబయటకూడా ఇదే ఏర్పాటుచేశారు. ఇంట్లోకి వచ్చేటపుడు పోయేటపుడు విధిగా చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ఇలాంటి ఏర్పాటు చేసిన గ్రామం తెలంగాణ ఇదే కావచ్చు. ఇలాగే పరిశుభ్రత, హరితహారం లో కూడా హరిదాస్ పూర్ ఆదర్శ గ్రామంగా నిలబడింది. గ్రామంలో ఈ ఐక్యత సాధించడంలో షపీ, కులకర్ణి విజయవంతమయ్యారు. దీనితో వాళ్లకి దాతల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తూ ఉంది.
ఇపుడు ఆడబిడ్డ జననాన్ని ఈ వూర్లో ఎలా సెలెబ్రేటో చేసుకుంటారో చూద్దాం. ఈ వూర్లో ఆడశిశువుల జననాలు తగ్గిపోయాయి. ఈ కాలంలో శిశు లింగనిర్ధారణ పెద్ద పనేం కాదు. మొత్తానికి డిసెంబర్ 2019- జనవరి 2020 మధ్య గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలు కేవలం ముగ్గురే. దీనితో గ్రామంలో లింగనిష్పత్తిలో బాగా తేడా పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితిని మార్చేందుకు గ్రామాన్ని యావత్తు షఫీ, కులకర్ణి సిద్ధం చేశారు.
గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఊరంతా పండగలాగా జరపడం మొదలుపెట్టారు. వారిద్దరు పంచాయతీ కార్యాలయాన్ని డెకొరేట్ చేస్తారు. ఆడశిశువులను కార్యాలయానికి అతిధులుగా ఆహ్వానిస్తారు. పుట్టిన రోజు కానుకలందిస్తారు. అందరికి స్వీట్లు పంచుతారు. పాప పేరుతో వేయి రుపాయల చెక్కు కూడ ఇస్తారు. అంతేకాదు, పాప చదువుకు లేదా ఆడపిల్లల వివాహానికి సంబంధించి కుటుంబానికి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులుంటే కూడా సాయం చేస్తారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వోపెన్ చేస్తారు. ఇలా ఆడపిడ్డ పుట్టడం ఆవూర్లో ఊరి పండగలాగా చేస్తారు. ఈ మార్పు భవ్య అనే పాపపుట్టడం తో మొదలయింది.
భవ్యకి ఇపుడు 14 నెలలు. ఈ మార్పు ఎలా సాధ్యమయిందంటే… పద్నాలుగు నెలల కిందట భవ్య పుట్టిన రోజున వూర్లో చెట్లు నాటే కార్యక్రమం గురించి సర్పంచ్ షఫీ తదితరులు ఇంటింటికి తిరిగిప్రచారం చేస్తున్నారు. అలా భవ్య ఇంటికి వచ్చారు.ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే, ఎందుకంటే కొడుకు కావాలని అన్ని దేవతలకు మొక్కు కుంటున్నా, మూడో బిడ్డగా భవ్య పుట్టింది. వాళ్లెవరూ షపీ చెట్లునాటే హరిత హారం కార్యక్రమం గురించి వినేలా లేరు. దీనితో సర్పంచు వెనుదిరిగి వెళ్లిపోయాడు, కొంచెం దిగులుగానే.
ఈ విషయాన్ని షపీ పంచాయతీ సభ్యల దృష్టికి తీసుకువచ్చాడు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి కులకర్ణి కూడా ఉన్నాడు. పంచాయతీ లో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు. అయితే, అందరిలో గ్రామం కోసం పనిచేయాలనే తపన ఉంది. భవ్య ఇంటి పరిస్థితి చూశాక , ఆడ బిడ్డ పుట్టటం ఏ ఇంటా కూడా బాధాకరం కారాదు, ఈ ధోరణిని మార్చాలని నిర్ణయించారు. అందువల్ల ఆడబిడ్డ పుట్టగానే ఊరంత పండగ చేయాలని నిర్ణయించారు.
సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఇతర సభ్యులు తలా కొంచం చందావేసుకుని ఒక మొత్తం తయారు చేశారు. భవ్య పుట్టిన రోజును సెలెబ్రేట్ చేయాలను కున్నారు. అంతే, ఆ ఆలోచన ఒక రోజులోనే కార్యరూపం దాల్చింది.
భవ్య బర్త్ డే కోసం పంచాయతీ కార్యాలయం మస్తాబయింది. భవ్య తల్లితండ్రులను ఆహ్వానించారు. వూరంతా స్వీట్స్ పంచారు.భవ్య పేరుతో వేయి రుపాయలు జమచేసి సుకన్య సమృద్ధి యోజన (SSY)అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇదొక సంప్రదాయం అయింది.
వూర్లో పాప పుడితే వూరంతా సంబరం చేసుకుంటుంది. షఫీ కులకర్ణి ఇద్దరు కలసి , పుట్టిన రోజు పండగలను ఉపయోగించుకుని పాప పుట్టడం పాపం కాదు, అపశకునం అంతకన్నా కాదు, పాప బాబు ఇద్దరు ఒక్కటే అనే భావన తీసుకు రాగలిగారు.
ఈ లోపు నగేశ్ కుంటుంబం నుంచి మరొక పాకకు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఒపెన్ చేశారు. ఎందుకుంటే, ఒక ఇంటి నుంచి ఇద్దరి దాకా అకౌంట్ ఒపెన్ చేయవచ్చు.
గ్రామస్థులలో వచ్చిన ఈ మార్పు చాలా మందిని దాతలను కూడా ప్రభావితం చేసింది గ్రామంలో SSY కి అర్హత ఉన్న పిల్లలందరిని గుర్చించారు. 86 మందికి అర్హత వుందని తేలింది. దాతల సాయంతో వీరందరికి ఒక్కొక్కరికి వేయి జమచేసి సుకన్య అకౌంట్స్ ఓపెన్ చేశారు. 50 మందికి పాస్ బుక్ లను అందించారు. మిగతావారి పాస్ బుక్ లు తయారవుతున్నాయని షపీ, కులకర్ణిలు చెప్పారు. ఇది చూసి మరొక దాత రు. 40 వేల విరాళాన్ని అడబిడ్డల కోసం అందిచారు.
తమ వూర్లో మంచి పనులకు గ్రామస్థుల సహాకారం బాగా ఉందని,ఈ సహకారం వల్లే ఈ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి తాము మోడల్ విలేజ్ లాగా తయారవుతున్నామని సర్పంచ్ షపీ ‘ట్రెండింగ్ తెలుగున్యూస్’ కు చెప్పారు.
“ఆదర్శ గ్రామంగా హరిదాస్ పూర్ ను మార్చేందుకు గ్రామస్థులకు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, డిఆర్ డిఎ ప్రాజక్టు డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు సహకారం చాలా ఉంది. దీనివల్లే మా గ్రామస్తులంతా సమిష్టికిగా ముందుకు సాగుతున్నారు,” అని షపీ అన్నారు.
హరిదాస్ పూర్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఉంటుంది. హైదరాబాద్ కి 80 కి.మీ దూరాన ఉన్న ఈ గ్రామం జనాభా 813 మంది. ఇక్కడ మహిళ సంఖ్య (సెక్స్ రేషియో) బాగా తక్కువ. ప్రతినూరు మంది పురుషులకు 88 మంది మహిళలే ఉన్నారు. ఈ తారతమ్యాన్ని పోగొడతామన్న ధీమాని షఫీ, కులకర్ణి వ్యక్తం చేస్తున్నారు.