పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, అయిదు రాష్ట్రాలు ఎన్నికలు సిద్ధమవుతూ ఉండటంతోవీటి మీద భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్రం యోచిస్తూ ఉంది. గత పది నెలaలో ముడి చమురు ధర రెట్టింపవడంతో భారత దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు భారతదేశంలో వీటి మీద పన్నులు కూడా భారీగానే ఉన్నాయి. ఇపుడు ప్రజలు చెల్లిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలలో కేంద్ర రాష్ట్రాల పన్నుల వాట దాదాపు 60 శాతం దాకా ఉంది. ప్రపంచంలో పెట్రో ఉత్పత్తుల వాడకంలో భారతదేశం మూడో అగ్రదేశం. రాస్ట్రాలకు లిక్కర్ తర్వాత బాగా రెవిన్యూ సమకూర్చేది పెట్రోలు డీజిల్ పన్నులే కాబట్టి, సుంకాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు ఇంతవరకు సుముఖంగా లేవు. అయితే,ఇపుడు కేంద్రం రాష్ట్రాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నది.
మార్చి ఒకటిన తెలంగాణలో పెట్రలు లీటర్ ధర రు 94.79/ కాగా డీజిల్ ధర రు 88.86 ఉండింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు లీటర్ ధర రు. 97.30 కాగా డీజిల్ ధర లీటర్ రు. 90.90
కరోనా పాండెమిక్ తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, ప్రజల ఆదాయాలు తగ్గినా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గత ఏడాది రెండు సార్లు పెట్రోలు, డీజిల్ మీద పన్నులు పెంచింది.నిజానికి ముడి చమురు ధర భారీగా పతనమయినపుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా మోదీ ప్రభుత్వం పన్నులు పెంచి వీటి ధర ఎపుడూ అధికంగా ఉండేలా చేసింది. ఇపుడు కీలకమయిన రాష్ట్రాలలో,అందునా భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నందున పెట్రోలు, డీజిల్ ధరల భారత తగ్గించేందుకు పన్నుల మీద కోత విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలనుసంప్రదిస్తున్నది. ఈ చర్చలు మార్చి మధ్య కల్లా ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు.