విజయవాడ, మార్చి 2: విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఎపియుడబ్ల్యుజె) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా వ్యక్తం అవుతున్న ఆగ్రహావేశాలను ప్రభుత్వాల నేతలు గ్రహించి ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరుతూ, విశాఖ ఉక్కు ఉద్యమానికి యూనియన్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది.
ఉద్యమంలో భాగంగా మార్చి నెల 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలని ఎపియుడబ్ల్యుజె పిలుపునిస్తున్నది.
విశాఖ ఉక్కు కర్మాగారంతో ఆంధ్రుల సెంటిమెంట్ ముడివడిఉంది. 1960 దశకంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమానికి తలవంచి నాటి ప్రభుత్వం ఈ కర్మాగారం నిర్మించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏకకంఠంతో నినదించి సాధించుకున్న రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ఈ ఉక్కు కర్మాగారం ప్రతీక.
ఆ విధంగా దీనితో ముడివడి ఉన్న ఆంద్రుల భావావేశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విశాఖ ఉక్కును ప్రయివేటు రంగానికి విక్రయించాలన్న నిర్ణయం, ఆర్ధిక విధానాల రీత్యా చూసినా కూడా సరైనది కాదని ఎపియుడబ్ల్యుజె భావిస్తున్నది. విశాఖ ఉక్కుకు ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన భూములే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అన్ని విధాలా అరిష్టదాయకమైన విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని మరోమారు కోరుతూ ఉక్కు ఉద్యమానికి ఎపియుడబ్ల్యుజె సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ తెలిపారు.