భద్రాచలం శ్రీరామచంద్రుడిని ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని నిన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన భద్రాచలాన్ని కెసిఆర్ ఎలా మోసిగించారో వివరించారు. భద్రాచలాన్ని అభివృద్ధి చేసేందుకు వంద కోట్ల రుపాయలను (రు.100 కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి వచ్చి, సీతారామకల్యాణం తిలకించాక ఆయన ఈ ప్రకటన చేశారు.ఇది జరిగి అయిదేళ్ల వుతూ ఉంది.నిధులు విడుదల కాలేదు, కెసిఆర్ భద్రాద్రి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి “భద్రాద్రి రాముడిని ప్రధాని మోదీ ఒక వైపు నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ మరొక వైపు నుంచి మోసగించారు. భద్రాద్రి ఆలయ భూములను రాష్ట్ర విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించి మోసం చేసింది. భద్రాద్రిని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు రు. వందకోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఒక్క పైసా ఇవ్వకుండా కెసిఆర్ మోసగించారు,” అని అన్నారు. ఖమ్మంలో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఉత్తమ్ ప్రసంగించారు.
కెసిఆర్ రు.100 కోట్ల ప్రకటన ఏంటంటే…
2016 ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ముఖ్యమయిన ప్రకటన చేశారు. భద్రాద్రి ని దక్షిణభారత అయోధ్యగా తీర్చిదిద్దుతానని చెబుతూ దీనికి రు. 100 కోట్లు కేటాయిస్తున్న భద్రాద్రి సీతారాముల సాక్షిగా ప్ర్రకటించారు. 2014 లో తెలంగాణ వచ్చినప్పటినుంచి ఆయన భద్రాద్రిని విస్మరిస్తున్నారనే విమర్శ ఉంది. ఆయన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతి చేస్తున్నారుతప్ప భద్రాద్రిని పట్టించుకోలేదనే విమర్శ ఎక్కువయింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన రు 100 కోట్లప్రకటన చేశారు.
ఆ రోజు ఆయన భద్రాద్రి వచ్చి సీతారామకల్యాణం తిలకించి విలేకరులతో మాట్లాడుతూ ఈ రు. 100 కోట్ల ప్రకటన చేశారు. ఈ నిధులతో రామాలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, యాత్రికుల వసతులు మెరుగుపర్చడం, వాహనాల పార్కింగ్ వసతి విస్తరింపచేయడం చేస్తామని ఆయన చెప్పారు. భధ్రాచల ఆయలం, జఠాయు మండపం. దుమ్ముగూడెంలోని పర్ణశాలను అభివృద్ధి చేసేందుకు ఒక సమగ్ర ప్రణాళికను చిన్న జీయర్ స్వామీజీతో సంప్రదించిన తయారు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ ప్రకటనకి ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఈ ప్రకటన చేసి దాదాపు అయిదేళ్లవుతూ ఉంది. ఈ నూరు కోట్లువిడుదల కాలేదు. భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి శ్రీరామ నవమికి ఇక్కడి ప్రజలను ముఖ్యమంత్రి నుంచి నూరుకోట్ల ప్రకటన వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి సీతారామ కళ్యాణోత్సవానికి రాలేదు.
2017లో, 2018లలో భద్రాద్రి సీతారామ కల్యాణోత్సవాలకు ముఖ్యమంతి రాలేదు. కాకపోతే, 2017ఫిబ్రవరి 1న చిన్న జీయర్ స్వామీ అర్కిటెక్ట్ను వెంటబెట్టుకుని ,అప్పటి మంత్రి తుమ్మలనాగేశ్వరరావుతో కలసి భద్రాద్రి వచ్చారు. అక్కడఇక్కడా తిరిగారు, పరిసరాలు పరిశీలించారు. ఆలయం అభివృద్ధికి మూడు రకాల బొమ్మలు విడుదల చేశారు. ఆ తర్వాత 2018 బడ్జెట్ లో రు.100 కోట్ల కేటాయించి ఆలయం అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి మరొక సారి ప్రకటించారు.తర్వాత మళ్లీ కొన్ని సమావేశాలు జరిగాయి.ప్రకటనలు వెలువడ్డాయి. భద్రాద్రిని దక్షిణ భారత అయోధ్య చేసే పనులు ఫైళ్లు దాటి కదల్లేదు.
ఈ మధ్యకాలంలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం శరవేగంగా జరుగూ ఉంది. పూర్తయ్యే దశకు చేరింది. మార్చి నాలుగో తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలయ పునర్నిర్మాణం పనులు సమీక్షించేందుకు వెళ్తున్నారు.తొందరలో ప్రారంభానికి ఆయన ముహూర్తం నిర్ణయిస్తారని చెబుతున్నారు. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించబోతున్నారు. మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినపుడు ఈవిషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
అయితే, యాదాద్రి మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధను ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి మీద చూపడం లేదనేందుకు పెద్దగా విశ్లేషణ అవసరం లేదు.యాదాద్రిని రు.1800 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు, భద్రాద్రికి హామీ ఇచ్చిన రు. 100 కోట్లను విడుదల చేయలేదు. యాదాద్రి ముఖ్యమంత్రిని రెగ్యులర్ గా సందర్శిస్తున్నారు. భద్రాద్రి కి ఏడాాదికొకసారి కూడా వెళ్లడం లేదు. నూరు కోట్ల ప్రకటన తర్వాత ఆయన చేసిందంతా ఆలయ అభివృద్ధి నమూనాలను పరిశీలించడమే. ఈ నిర్లిప్తత వెనక ఏవయిన వాస్తుకారణాలున్నాయా? యాదాద్రి లక్ష్మీనరసింహుడు, శ్రీరామచంద్రుడు ఒక్కరే కదా. భద్రాద్రి అచ్చిరాదని ఎవరైనా చెప్పారా? ఏమో ముఖ్యమంత్రి మదిలో ఏముందో వూహిచండం కష్టం.
CM KCR inspected the models of Bhadrachalam Temple prepared by Mr Anand Sai's team on the instructions of Sri Chinna Jeeyar Swamy pic.twitter.com/8MirPSoJrp
— Telangana CMO (@TelanganaCMO) September 13, 2017