(నల్లెల్ల రాజయ్య)
తెలంగాణలో ప్రతి నెలలో ప్రతి సోమవారం నాడు కలెక్టర్లు ప్రజా విజ్ఞప్తుల దినం పాటిస్తారు. ఆ రోజు మండల స్థాయిలో పరిష్కారం కాని అపరిష్కృత సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పిస్తారు. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించి ఎంతో మంది ప్రజలు (పేదలు,వికలాంగులు,వృద్ధులు,మహిళలు,నిరుద్యోగులు ) జిల్లా కలెక్టర్ ను కలుసుకునేందుకు వస్తుంటారు. ఇలాగే వరంగల్ జిల్లాలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లా కలెక్టర్ గారి కలవడానికి వస్తుంటారు. ఆ రోజున ఇలా అభ్యర్థనలతో వచ్చే వారి కొరకు మాత్రమే అందుబాటులో ఉండాలని వరంగల్ పౌరస్పందన వేదిక జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నది.
దూర ప్రాంతాలనుండి వచ్చిన అనేకమంది ప్రజలు తమ సమస్యలను ప్రత్యక్షంగా కలెక్టర్ కు మొర పెట్టుకుంటే తమకు పరిష్కారం లభిస్తుందనే గంపెడాశతో వస్తే కలెక్టర్ గారేమో ప్రభుత్వ వివిధ విభాగాల అధికారులతో సంప్రతింపులు,సమావేశాల్లో పాల్గొనటం మూలంగా ప్రజలు గంటల తరబడి ఎదిరిచూసి విసిగి వేసారి నిరాశతో వెనుదిరిగి పోయే దీన పరిస్థితి నెలకొంటున్నది.
కోవిడ్ పరిస్థితులనాసరా చేసుకొని కూడా కొంత మంది ప్రభుత్వ అధికారులు ప్రజల సమస్యలపట్ల పట్టింపులేని తనం కారణంగా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు.
కావున కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల రోజు తమ పూర్తి సమయాన్ని ప్రజల కొరకే వెచ్చించాలని, తమకు అండగా ప్రభుత్వం ఉన్నదనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన అవసరమున్నదని సహృదయం తో గుర్తించాలని వరంగల్ పౌరస్పందన వేదిక పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.
(నల్లెల్ల రాజయ్య .సమన్వయ కర్త.వరంగల్ పౌర స్పందన వేదిక)