6 సంవత్సరాలు హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి
ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్లు వృద్ధి
హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ
ఐటీఐఆర్ పైన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కి కేటీఆర్ లేఖ
ఐటి పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఈరోజు కోరారు.
తెలంగాణ ఐటి మరియు ఐటి అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని హైదరాబాద్ గత ఆరు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తన లేఖలో కేంద్రమంత్రికి వివరించారు.
దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయన్నారు. జాతీయ సగటు 1.9% ఉండగా తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లతో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
కోవిడ్ పరిస్థితులున్న సంవత్సరంలోనూ 8.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల నూతన కార్యాలయం స్పేస్ క్రియేషన్ హైదరాబాద్‌లో జరిగిన విషయాన్ని కూడా తెలిపారు. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్తి ఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీస్, బ్లాక్‌చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మరియు రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఈ రంగంలో గత ఆరు సంవత్సరాల్లో నెలకొల్పబడ్డాయని చెప్పారు.
ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వ చొరవతో ఐటి అభివృద్ధి లో ముందవరుసలో ఉన్న హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్న విషయాన్ని తెలిపారు.
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఅర్ అనేక సార్లు ఐటిఐఆర్ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లాల్సిందిగా కోరారని తెలిపారు.
ఐటిఐఆర్ మీద ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన రావడం లేదు
కేంద్ర ప్రభుత్వం ఐటిఐఆర్ పైన తాత్సారం చేయడం తో అత్యంత విలువైన సమయాన్ని తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగం అభివృద్ధి విషయంలో కోల్పోయిందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఐటి మరియు ఐటి అనుబంధ పరిశ్రమ యొక్క ప్రాధాన్యతను కేంద్రం గుర్తించి, లక్షలాది మందికి నూతన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐటిఐఆర్ హోదాని తిరిగి కల్పించడం లేదా ఐటీఐఆర్ కు సమానమైన ప్రత్యేక పాలసీ పరమైన ప్రోత్సాహాన్ని హైదరాబాద్‌కి ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. అయితే ఐటిఐఆర్ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసిన విజ్ఞప్తుల పట్ల స్పందించకపోవడంతో ఈ విషయం స్పష్టం అవుతుంది అన్నారు. భారత దేశ ఆర్థిక ఇంజన్లు గా మారుతున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక హోదా అందిస్తే తెలంగాణలో మరిన్ని ఉపాధి అవకాశాలు ఈ రంగంలో వస్తాయన్న ఆశాభావంతో తెలంగాణ యువత ఉన్నదని వారిని, నిరుత్సాహ పరిచవద్దని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ గత ఆరు సంవత్సరాలుగా సాధించిన అద్భుతమైన ఐటి మరియు ఐటి అనుబంధ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని ఐటీఐఆర్ లాంటి ప్రత్యేక పాలసీని నగరానికి ప్రకటించాలని కేంద్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.