(భూమన్)
శేషాచలం అడవుల్లో కుమారధార తీర్థం ఒక అద్భుతమయిన ప్రదేశం. కుమారధార,పసుపుధార ప్రాజక్టులు కట్టక పూర్వం, నేను శ్వేత డైరెక్టర్ గా ఉండే రోజుల్లో, మొత్తం తిరుపతి, తిరుమలకు సంబంధించిన జర్నలిస్టులందరిని తీసుకువెళ్లి, అక్కడ ఉన్న సహజ సౌందర్యం చూపించాను.
ఎందుకంటే, ప్రాజక్టులు వచ్చాక ఇంతటి ప్రకృతి సౌందర్యం చూల్లేరు. ఈ రోజు పసుపుధార, కుమార ధార రిజర్వాయర్లు పూర్తయి, తిరుమల నీటి అవసరాలను తీరుస్తున్నాయి.
కుమారధార తీర్థానికి తిరుమలలో వేదిక్ పాఠశాల వైపు నుంచి ఒక దారి ఉంది. పాపనాశం నుంచి మరొక దారి ఉంది. నేను కుమారధారకి ఒక రోజు సాయంకాలం పోయి చూసొచ్చాక మరికొందరు తమని తీసుకెళ్లమని అడిగారు. దానితో నేను మరుసటి ఉదయం మరొక సారి కుమార ధార వెళ్లాను. ఇలా నేను నాకోసం ఒకసారి మిత్రులకోసం మరొక సారి కుమారధార వెళ్తుంటాను. అక్కడికి పాదయాత్ర చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎపుడూ అలసటనేది లేకుండా నేను వెళ్తూను ఉంటాను.
ఇది పాపనాశం నుంచి మూడు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అదే విధంగా వేదపాఠశాల నుంచి కూడా మూడు కిలో మీటర్ల దూరాన ఉంటుంది. ఆలోయలు, కొండలు, వృక్షాలు, పక్షులు యాత్రికులకు కనువిందు చేస్తాయి. ఈ కుమారధార తీర్థంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలల్లో పౌర్ణిమ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక రోజు కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ సారి ఈరోజు జరగాల్సి ఉండింది. అయితే, కరోనా కారణంగా రద్దయింది.
శనివారం సౌర్ణమి నాడు జరగవలసిన ఈ కుమారధార తీర్థ ఉత్సవాన్ని కరోనా కారణంగా టీటీడీ రద్దు చేసింది.
ఆ ఒక్క రోజు ఈ తీర్థ సందర్శనకు భక్తులకు అనుమతి ఉంటుంది. మిగతా రోజులలో పర్మిషన్ తీసుకుని పోవలసిందే తప్ప సాధారణ భక్తులకు అనుమతి ఉండదు. అక్కడ ఒక పచ్చటి చెట్లతో నిండిన సుందరమయిన లోయలో ఈ తీర్థం ఉంటుంది. తీర్థంలో ఎపుడూ నీళ్లు పారుతూ ఉంటాయి. సన్నటి ధారగా జలపాతం కూడా దూకుతూ ఉంటుంది.
వర్షాకాలంలో ఇది ఉధృతంగా ఉంటుంది. ఇక్కడి సెలయేర్లన్నీ నిండుగా ప్రవహిస్తూంటాయి. ఈ జలపాతాన్ని అన్ని రుతువులలో దాదాపు పదిహేను సార్లు చూసి ఉంటాను. తీర్థం ఉన్న రోజుల్లో చూశాను, తీర్థం లేని రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి వచ్చాను. తీర్థం జరిగే రోజుల్లో దాదాపు వేయిమంది దాకా భక్తులు వస్తారు.
మిగతా రోజుల్లో ట్రెక్ చేసేందుకు ఒక పది పదైదు మంది మించకుండా వస్తుంటారు. ఇది పాపనాశానికి చాలా దగ్గిరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్యప్రాణలేవీ కనిపించవు. ఇతరత్రా భయాలు కూడా ఉండవు. నిజానికి కుమారధార చాలా చిన్న తీర్థం. అయితే, అక్కడికి వెళ్లి, లోయలోకి దిగి, అక్కడి కాలువల వెంబడి ప్రయాణించి వెళ్లడమనేది గొప్ప అనుభవం.
ఇపుడు తీర్థం జరిగే రోజుల్లో, టిటిడి వారు భక్తులు సులభంగా దిగేందుకు నిచ్చెన ఏర్పాటు చేశారు పెద్దవారు తిగేందుకు ఒక తాడు కూడా ఏర్పాటుచేశారు. తీర్థం రోజు డెబ్బై ఎనభై సంవత్సరాలు పైబడిన వారు ఇక్కడికి రావడం నేను చూశాను. ఈ దైవభక్తి వల్లనయితేనేమీ వీళ్లంతా ఎంతో శ్రమించి, ఎంతో దూరం నడిచి, కోండల్లోకి కోనల్లోకి వచ్చి, లోయల్లోకిదిగి, జలపాతాలలో స్నానమాచరించి ప్రకృతిలో మమేకం కాగలుతున్నారు. మామూలుగా ఆహ్లాదం అని చెబితే ఎవరూ రారేమో.
తిరుమలకు కూ అంతేగా. తిరుమల మెట్లను వయోవృద్ధులు కూడా సులభంగా ఎక్కుతూ ఆశ్చర్యపరుస్తారు. మామూలుగా మెట్లక్కమంటే ఎంతమంది ఎక్కుతారు? ఎవరూ ముందుకు రారేమో. కనీసం భక్తి పేరుతో నైనా జనం ప్రకృతి ఒడిలోకి రావడమనేది చాలా ఆనందాన్నిచ్చే అంశం.
అయితే, వీరంతా ఇలా వచ్చి అలా పోతుంటారు. సాధారణంగా యాత్రలకొచ్చేవాళ్లంతా ప్రకృతి ఒడిలోకి వస్తున్నారుగాని, ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదించే ప్రయత్నం చేయరు.
ఉదాహరణకు కుమారధార యాత్రని తీసుకుందాం. ఇక్కడ తీర్థమొక్కటే విశేషం కాదు. ఇక్కడి లోయలో ఎన్నిరకాల చెట్టున్నాయి? ఇక్కడ బ్రహ్మాండమయిన చెట్లున్నాయి, రకరకాల ఉసిరి చెట్లున్నాయి. కలేపళ్ల చెట్లున్నాయి, బిక్కి పండ్ల చెట్లున్నాయి. అక్కడి ఆహ్లాదకరమయిన వాతావరణాన్ని పరిశీలించాలి. అయితే, చాలా మంది యాత్రికులు వీటిని ఏమీ పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి విగ్రహాలకు పూజలు, చేసి జలపాతం స్నానం చేసి వెళ్లిపోతుంటారు. ఇది యాత్ర ఉద్దేశం అయి ఉండదు. కొద్ది సేపు నిమ్మళంగా, ప్రశాంతంగా ప్రకృతిని గమనిస్తూ, సహజ అటవీ సౌందర్యాన్ని అస్వాదిస్తూ గడిపేందుకు యాత్రలుండి ఉండాలి. అపుడే యాత్ర పరిపూర్ణమవుతుంది.అయితే, జరగడం లేదేమో అనిపిస్తుంది.
ఇలా ప్రకృతిలో మమేకమయి కొద్ది సేపు తీరుబడిగా గడిపిన క్షణాల ప్రభావం మనలను మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇలా ప్రతిసంవత్సరం కుమార ధార, తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం ఒకసారి ఎవరైనా వచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వస్తుంది.
శేషతీర్థం అని మరొక ప్రదేశం ఉంది. టిటిడివారు ఎందుకో ఇక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడికి కూడా అనుమతిస్తే చాలా బాగుంటుంది. అది ఇంకా సుందరమయిన ప్రదేశం.
ఈ సారి రామకృష్ణ తీర్థానికి కూడా అనుమతించలేదు. వచ్చేనెల తుంబురు తీర్థయాత్ర ఉంటుంది. టిటిడి వారు అనుమతిస్తారో లేదో తెలియదు. వచ్చే ఏడాది మళ్లీ కుమారధార కు అనుమతించినపుడు సాధ్యమయినంతవరకు ఈ తీర్థాన్ని సందర్శించేందుకు ప్రయత్నించండి.
తిరుపతి సమీపంలో ఉన్న అద్భుత ప్రదేశం. ఇక్కడ ట్రెక్ చేయడం ఆహ్లదాన్నిస్తుంది. ఆరోగ్యాన్నికాపాడుతుంది.